Department of Mining
-
అక్రమ క్వారీలపై మైనింగ్‌శాఖ దాడులు
పలమనేరు: కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలంలో అక్రమంగా నిర్వహిస్తున్న క్వారీలపై మైనింగ్‌శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. వారం రోజులుగా మూడు ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టిన అధికారులు బుధవారం రూ.50లక్షల విలువైన 164 గ్రానైట్ దిమ్మెలను సీజ్ చేశారు. ఒక కంప్రెషర్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని గుడుపల్లె పోలీసులకు అప్పగించారు. భూగర్భగనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి ఆదేశాల మేరకు దాడులు నిర్వహిస్తున్నట్లు మైనింగ్ ఏడీ వేణుగోపాల్ తెలిపారు. -
గనుల వేలానికి హైపవర్ కమిటీ ఆమోదం
సాక్షి, అమరావతి: బంగారం, వజ్రాలు సహా 22 అత్యంత విలువైన గనుల వేలానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ ఆమోదం తెలిపింది. వెలగపూడి సచివాలయంలో బుధవారం మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నేతృత్వంలో జరిగిన హైపవర్ కమిటీ సమావేశంలో వేలానికి ఆమోదముద్ర వేశారు. సమావేశంలో మైనింగ్ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి పాల్గొనగా, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైనింగ్ రీజినల్ కంట్రోలర్ శైలేంద్రకుమార్, జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సదరన్ రీజియన్ డైరెక్టర్ ప్రసూన్ఘోష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. జీఎస్ఐ ప్రతిపాదించిన 9, రాష్ట్ర మైనింగ్ శాఖ ధ్రువీకరించిన 13 గనుల వేలానికి సంబంధించిన విధివిధానాలను కమిటీలో ఖరారు చేశారు. ప్రీమియం, రిజర్వు ధరలు, వేలం నిర్వహణపై మార్గదర్శకాలు నిర్దేశించారు. వీటి ప్రకారం 22 గనులకు వేలం నిర్వహించాలని మైనింగ్ శాఖకు స్పష్టం చేసింది. 21 గనులకు కాంపోజిట్ లీజులు, ఒక గనికి సాధారణ లీజు ఇచ్చేందుకు అంగీకరించింది. కమిటీ సూచించిన మార్గదర్శకాల ప్రకారం వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామని మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు. -
‘బంగారు’ గనులు
సాక్షి, అమరావతి: గతంలో ఎప్పుడూ లేనివిధంగా విలువైన 22 ఖనిజ లీజులకు ఒకేసారి వేలం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) సూచించిన 9 బ్లాకులు, రాష్ట్ర మైనింగ్ శాఖ ఎంపిక చేసిన 13 బ్లాకులకు త్వరలో వేలం నిర్వహిస్తారు. వీటిలో 21 బ్లాకులకు కాంపోజిట్ లీజులు, ఒకటి సాధారణ లీజుకు ఇస్తారు. అనంతపురం జిల్లాలో 9,740 హెక్టార్లలో 10 బంగారు గనులు ఇందులో ఉన్నాయి. రామగిరి నార్త్, సౌత్, బొక్సంపల్లి నార్త్, సౌత్, జవ్వాకుల ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్ బ్లాకులుగా బంగారు గనులకు కాంపోజిట్ లీజులు ఇస్తారు. అలాగే శ్రీకాకుళం జిల్లా బటువ, విజయనగరం జిల్లా పెద్దలింగాలవలస, నంద, ములగపాడు, గరికపేట, శివన్నదొరవలస, బుధరాయవలసలో మాంగనీస్ గనులు లీజుకు ఇవ్వనుంది. వీటిలో తొలి రెండింటిని మైనింగ్ శాఖ ఎంపిక చేయగా మిగిలిన ఐదింటిని జీఎస్ఐ నిర్థారించింది. ప్రకాశం జిల్లా లక్ష్మక్కపల్లె, అద్దంకివారిపాలెంలో ఇనుప ఖనిజం, కడప జిల్లా ఉప్పరిపల్లెలో వజ్రాల గని, నెల్లూరు జిల్లా మాసాయపేటలో బేస్‌మెటల్ గనికి లీజులు ఇవ్వనుంది. ఈ 21 గనుల్లో జీ–4 (ప్రాథమిక స్థాయి) సర్వే ద్వారా ఖనిజ లభ్యతను గుర్తించారు. దీనిద్వారా తవ్వబోయే ఖనిజం గురించి పూర్తి సమాచారం తెలియదు. జీ–3, జీ–2, జీ–1 స్థాయి సర్వేలు చేశాకే అక్కడ ఎంత ఖనిజం ఉంది, ఏ గ్రేడ్ది ఉందనే వివరాలు తెలుస్తాయి. ప్రస్తుతం జీ–4 సర్వే ఆధారంగా వేలం పాటలు నిర్వహించి కాంపోజిట్ లీజులు ఇస్తారు. ఈ లీజు తీసుకుంటే వెంటనే మైనింగ్‌కు అవకాశం ఉండదు. లీజు పొందిన వారే మలి దశ సర్వేలు చేయించుకోవాలి. ఇందుకు కొన్నేళ్లు సమయం ఇస్తారు. ఆ తర్వాత ఆ లీజులను సాధారణ లీజులుగా మారుస్తారు. ఇవి కాకుండా విజయనగరం జిల్లా చిన్నబంటుపల్లిలో మాంగనీస్ గనికి సాధారణ లీజుకు వేలం నిర్వహించనున్నారు. నేడు హైపవర్ కమిటీ సమావేశం ఈ లీజుల వేలానికి విధివిధానాలు ఖరారు చేసేందుకు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని హైపవర్ కమిటీ బుధవారం సమావేశం కానుంది. రిజర్వు ధర, ప్రీమియం, వేలం ఎలా నిర్వహించాలనే అంశాలను ఈ కమిటీ ఖరారు చేస్తుంది. వాటి ప్రకారం 22 బ్లాకులకు మైనింగ్ శాఖ టెండర్లు పిలుస్తుంది. వీటన్నింటికీ లీజులు ఖరారైతే ఒకేసారి భారీ స్థాయిలో లీజులు మంజూరు చేసిన రాష్ట్రంగా ఏపీ రికార్డుల్లోకి ఎక్కే అవకాశం ఉంది. ఇప్పటికే ఎటువంటి ఆటంకాలు లేకుండా గొర్లగుట్ట లైమ్‌స్టోన్, గుటుపల్లి ఇనుప ఖనిజం బ్లాకుల లీజుల్ని కేటాయించినందుకు కేంద్రం రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షల రివార్డును ఏపీకి ప్రకటించింది. -
AP: వజ్రాల వేటకు ఓకే
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా ఉప్పరపల్లెలో వజ్రాల అన్వేషణకు మైనింగ్ శాఖ త్వరలో టెండర్లు పిలవనుంది. ఉప్పరపల్లె ప్రాంతంలో వజ్రాల లభ్యత ఉన్నట్లు ఇటీవల జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ధృవీకరించి, ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ప్రాథమిక సర్వే (జీ–4) ప్రకారం వజ్రాల లభ్యత ఉన్నట్లు తేలింది. గతంలో జీ–4 సర్వే ఆధారంగా గనులకు వేలం నిర్వహించకూడదని కేంద్రం స్పష్టం చేయడంతో వజ్రాల గనిపై ముందడుగు పడలేదు. ఆదాయం పెంచుకోవాల్సిన నేపథ్యంలో కేంద్రం ఇటీవలే తాజాగా ఎంఎండీఆర్ (మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్) చట్టాన్ని సవరించి జీ–4 సర్వే ప్రకారం గనుల్ని లీజుకిచ్చే అవకాశం కల్పించింది. దీంతో ఉప్పరపల్లెలో వజ్రాల గనికి సానుకూలత ఏర్పడింది. వాస్తవానికి మైనింగ్ శాఖ గతంలోనే ఈ ప్రాంతంలో వజ్రాల లభ్యత ఉన్నట్లు గుర్తించింది. కేంద్రం ఆంక్షలు, వజ్రాల వెలికితీత కష్టతరం కావడం, భారీగా ఖర్చయ్యే పరిస్థితి ఉండడంతో అప్పట్లో దానిపై అంతగా దృష్టి సారించలేదు. మరింత లోతుగా సర్వే తాజాగా కేంద్ర ప్రభుత్వ వైఖరి మారడంతోపాటు వజ్రాల వెలికితీతకు అవకాశాలు మెరుగు పడడంతో మరింత లోతుగా అన్వేషణ కోసం టెండర్లు పిలవడానికి సిద్ధమైంది. జీ–4 సర్వే ఆధారంగా ఈ గనికి వేలం నిర్వహించి కాంపోజిట్ లీజు ఇవ్వనున్నారు. ఈ లీజు తీసుకున్న వారు వెంటనే మైనింగ్ చేసుకునే అవకాశం ఉండదు. ఆ బ్లాకుల్లో ఖనిజం ఎక్కడ, ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి సొంతంగా జీ–3, జీ–2, జీ–1 స్థాయి సర్వేలు చేయించుకోవాల్సి ఉంటుంది. వైఎస్సార్ జిల్లా ఉప్పరపల్లె గ్రామంలో వజ్రాల నిక్షేపాలు ఉన్న భూములు ఇందుకు రెండు నుంచి ఐదేళ్లు అవకాశం ఇస్తారు. ఆ తర్వాత వారికిచ్చిన కాంపోజిట్ లీజును సాధారణ లీజుగా మార్పు చేస్తారు. ఉప్పరపల్లె ప్రాంతంలో 37.65 చదరపు కిలోమీటర్లలో వజ్రాల లభ్యతకు అవకాశం ఉన్నట్లు ప్రాథమిక అంచనాల్లో తేలింది. లీజు పొందిన సంస్థ పూర్తి స్థాయిలో సర్వేలు చేస్తే, వజ్రాల లభ్యత గురించి పూర్తి సమాచారం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మైనింగ్ శాఖ టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపింది. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే టెండర్లు పిలవనున్నట్లు మైనింగ్ శాఖ అధికారులు తెలిపారు. -
వైఎస్సార్ జిల్లాలో వజ్రాల లభ్యత: జీఐఎస్
సాక్షి, న్యూఢిల్లీ, అమరావతి: ఏపీలోని వైఎస్సార్ జిల్లా పరిధిలో పెన్నా నదీ బేసిన్ ప్రాంతంలో వజ్రాల లభ్యత ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఐఎస్) గుర్తించింది. దేశ వ్యాప్తంగా ఖనిజాన్వేషణ సర్వే నిర్వహించిన ఈ సంస్థ జీ–4 స్థాయి పరిశోధన అనంతరం 100 మినరల్ బ్లాక్‌ల (గనులు) నివేదికలను సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల మైనింగ్ శాఖలతో ఢిల్లీలో బుధవారం కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆ నివేదికలను ఆయన ఆయా రాష్ట్రాలకు అందజేశారు. మైనింగ్ బ్లాక్‌ల నివేదికలను స్వీకరించిన రాష్ట్రాలు ఇక ఆలస్యం లేకుండా వేలాన్ని వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వం మైనింగ్ రంగాన్ని ఉత్తేజ పరచడానికి వీలుగా దేశంలో ఖనిజ అన్వేషణను వేగవంతం చేస్తోందని వివరించారు. మొత్తం 14 రాష్ట్రాలు మైనింగ్ బ్లాక్ నివేదికలను అందుకున్నాయి. అత్యధికంగా మధ్యప్రదేశ్ 21, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 9 చొప్పున నివేదికలు అందుకున్నాయి. ఏపీ తరఫున రాష్ట్ర మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి నివేదికలు అందుకున్నారు. రాష్ట్రాలు ఆయా బ్లాక్‌లకు కాంపోజిట్ లైసెన్స్‌లు ఇచ్చేందుకు వేలం నిర్వహించాల్సి ఉంటుంది. 37 చ.కి.మీ మేర వజ్రాల బ్లాక్ వైఎస్సార్ జిల్లా ఉప్పరపల్లె ప్రాంతంలో 37.65 చదరపు కిలోమీటర్ల పరిధిలో వజ్రాల లభ్యతకు అవకాశం ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఐఎస్) అన్వేషణలో తేలింది. నెల్లూరు జిల్లా మాసాయపేట పరిధిలో 20 చ.కి.మీ మేర బేస్ మెటల్ ఉన్నట్లు స్పష్టం చేసింది. శ్రీకాకుళం జిల్లా ములగపాడులో 4.02 చ.కి.మీ, విశాఖపట్నం జిల్లా నందాలో 2.04 చ.కి.మీ, విజయనగరం జిల్లా గరికపేటలో 4.60 చ.కి.మీ, శివన్నదొర వలసలో 4.20 చ.కి.మీ, బుద్ధరాయవలసలో 6.38 చ.కి.మీ విస్తీర్ణంలో మాంగనీస్ బ్లాక్‌లు ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రకాశం జిల్లాలోని లక్ష్మక్కపల్లెలో 30.23 చ.కి.మీ విస్తీర్ణంలో ఒకటి, అద్దంకివారిపాలెంలో 9.14 చ.కి.మీ విస్తీర్ణంలో మరొకటి మొత్తంగా 2 ఐరన్ ఓర్ బ్లాక్‌లు ఉన్నాయని వెల్లడించింది. ఆదాయం పెంచుకునేందుకే.. గతంలో ఈ స్థాయి సర్వే ప్రకారం గనులకు వేలం నిర్వహించవద్దని కేంద్రం చెప్పింది. అయితే ఆదాయం పెంచుకోవాల్సిన నేపథ్యంలో తాజాగా ఎంఎండీఆర్ (మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్) చట్టాన్ని సవరించి జీ–4 సర్వే ప్రకారం గనుల్ని లీజుకిచ్చే అవకాశం కల్పించింది. వేలంలో లీజులు తీసుకున్న వారు వెంటనే మైనింగ్ చేసుకునే అవకాశం ఉండదు. ఆ బ్లాకుల్లో ఖనిజం ఎక్కడ, ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి సొంతంగా జీ–3, 2, 1 స్థాయి సర్వేలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకు రెండు నుంచి ఐదేళ్లు అవకాశం ఇస్తారు. ఆ తర్వాత వారికిచ్చిన కాంపోజిట్ లీజును సాధారణ లీజుగా మార్పు చేస్తారు. -
ఫోర్జరీ పత్రాలతో ఆరోపణలా!?
సాక్షి, అమరావతి: సీఎంఓ సిఫారసుల మేరకు సుధాకర్ ఇన్ఫ్రా అనే సంస్థకు గోదావరి నదిలో ఇసుక డ్రెడ్జింగ్‌కు అనుమతిచ్చినట్లు టీడీపీ అధికార ప్రతినిధి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, సత్యదూరమని రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాల కాంట్రాక్టును జేపీ పవర్ వెంచర్స్ సంస్థకు టెండర్ల ద్వారా నిబంధనల ప్రకారం ఇచ్చామని సోమవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ఆ సంస్థకు మాత్రమే ఓపెన్ రీచ్‌లలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఉందన్నారు. సుధాకర్ ఇన్ఫ్రా సంస్థకు అనుమతిస్తూ తన కార్యాలయం ఎటువంటి లేఖ ఇవ్వలేదని ఆయన స్పష్టంచేశారు. ఆ సంస్థకు గోదావరి నదిలో ఇసుక డ్రెడ్జింగ్‌కు అనుమతివ్వాలని సీఎంఓ నుంచి కూడా ఎటువంటి మౌఖిక లేదా లిఖితపూర్వక సిఫారసు రాలేదన్నారు. కాంట్రాక్టు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ తనకు ఆ సంస్థ రాసినట్లు చెబుతున్న లేఖకు.. తన కార్యాలయానికి సంబంధంలేదన్నారు. ఇవ్వని కాంట్రాక్టుకు ధన్యవాదాలు ఎలా చెబుతారని ద్వివేది ప్రశ్నించారు. సుధాకర్ ఇన్ఫ్రాపై జూన్ 4న కేసు జేపీ సంస్థ నుంచి తాము సబ్ కాంట్రాక్టు పొందామని సుధాకర్ ఇన్ఫ్రా కొందరిని మోసం చేసినట్లు ఈ సంవత్సరం జూన్ 4న విజయవాడ భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైనట్లు ఆయన తెలిపారు. తమకు గనుల శాఖ అనుమతి ఉందంటూ ఆ సంస్థ చూపించిన డాక్యుమెంట్లు తమ కార్యాలయం నుంచి జారీచేసినవి కావన్నారు. ఈ విషయాన్ని తాను అదే రోజు ఆ కేసు దర్యాప్తు చేస్తున్న విజయవాడ పశ్చిమ ఏసీపీకి లిఖితపూర్వకంగా తెలిపానని గోపాలకృష్ణ ద్వివేది గుర్తుచేశారు. దీనిపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఇప్పుడు అవే ఫోర్జరీ పత్రాలను మరోసారి చూపించి టీడీపీ అధికార ప్రతినిధి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వాటిని సృష్టించి మోసం చేసిన వ్యక్తులు అరెస్టయ్యారని తెలిపారు. గతంలో పోలీసు కేసు నమోదై అరెస్టులు కూడా జరిగిన వ్యవహారానికి సంబంధించిన ఫోర్జరీ పత్రాలను చూపించి ఇప్పుడు జరిగినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. జూన్‌లోనే ఫోర్జరీకి పాల్పడిన వారిపై కేసు నమోదవడం, అరెస్టులు జరిగిన విషయాన్ని టీడీపీ నాయకుడు ఎందుకు ప్రస్తావించలేదో ప్రజలు గమనించాలని కోరారు. అన్ని మీడియాల్లో వచ్చిన నిజాలను దాచిపెట్టి మళ్లీ కొత్త అంశంగా ప్రభుత్వంపై బురదజల్లాలని ప్రయత్నించడం ఏమిటన్నారు. సుధాకర్ ఇన్ఫ్రాకు చెందిన వ్యక్తులపై కాకినాడ టుటౌన్ పోలీస్స్టేషన్లోనూ 420 కేసు నమోదైందని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేవిధంగా, గనుల శాఖలో నిబద్ధతతో పనిచేస్తున్న అధికారుల మానసికస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఆరోపణలు చేశారన్నారు. దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ద్వివేది హెచ్చరించారు. -
ఉల్లం‘ఘనులకు’ ఇంటి దొంగల వత్తాసు
సాక్షి, అమరావతి: గనులను కొల్లగొట్టిన అక్రమార్కులకు మైనింగ్ శాఖలోని కొందరు అధికారులే అండగా నిలవడం ఉత్తరాంధ్రలో చర్చనీయాంశమైంది. విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతంలోని మెటల్ క్వారీల్లో చోటుచేసుకున్న అక్రమాలపై మైనింగ్ విజిలెన్స్ విభాగం 10 రోజులుగా చేస్తున్న తనిఖీలకు అక్కడి మైనింగ్ అధికారులు అడుగడుగునా అడ్డు తగులుతున్నట్టు తేలింది. తనిఖీలకు నేతృత్వం వహిస్తున్న విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డి పట్ల అనకాపల్లి మైనింగ్ ఏడీ కార్యాలయ అధికారులు దురుసుగా ప్రవర్తించగా.. జియాలజిస్ట్ విఘ్నేశ్వరుడు ఏకంగా దాడికి యత్నించటం కలకలం రేపింది. ఫైళ్లు ఇవ్వకుండా.. మాఫియాకు పాదాక్రాంతం అనకాపల్లి మండలంలోని 30 క్వారీల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్టు ఫిర్యాదులు రావడంతో మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ బృందాలను రంగంలోకి దించారు. ఈ బృందాలు రాష్ట్రంలోనే బడా కంపెనీలకు చెందిన క్వారీల్లో తనిఖీలు చేసి ఉల్లంఘనల్ని బయటపెడుతుండడంతో మైనింగ్ మాఫియా వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. అయినా విజిలెన్స్ అధికారులు వెనక్కి తగ్గకపోవడంతో అనకాపల్లి ఏడీ కార్యాలయంలోని కొందరు సిబ్బంది, ఇతర ప్రాంతాల్లోని పలువురు మైనింగ్ అధికారులు విజిలెన్స్ బృందాలకు అడ్డంకులు కల్పించారు. తనిఖీలు చేస్తున్న క్వారీలకు సంబంధించిన ఫైళ్లు, అనుమతులు, ఇతర వివరాలు ఇవ్వకుండా అక్కడి అధికారులు రోజుల తరబడి తప్పుకుని తిరుగుతున్నట్టు సమాచారం. మరోవైపు విజిలెన్స్ అధికారుల తనిఖీల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మైనింగ్ మాఫియాకు చేరవేస్తూ అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో మైనింగ్ విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డి ఇటీవల అనకాపల్లి మైనింగ్ ఏడీ కార్యాలయానికి వెళ్లి ఫైళ్లు ఇవ్వాలని కోరారు. విజిలెన్స్ బృందం మూడు గంటలకు పైగా ఆ కార్యాలయంలో వేచి ఉన్నప్పటికీ.. ఫైళ్లు ఇవ్వకుండా తనిఖీలను తప్పుపట్టేలా మాట్లాడుతూ అక్కడి జియాలజిస్ట్ విఘ్నేశ్వరుడు విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఉన్నట్టుండి ఏడీ మొహంపై తాను తాగుతున్న టీని విసిరారు. ఆ తర్వాత దాడికి ప్రయత్నించడంతో సిబ్బంది అడ్డుకున్నారు. దీనిపై ప్రతాప్‌రెడ్డి విజయవాడలోని మైనింగ్ శాఖ సంచాలకులు వెంకటరెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణ జరిపారు. అనకాపల్లి జియాలజిస్ట్ విఘ్నేశ్వరుడుదే తప్పని నిర్థారించి వెంటనే ఆయనను సస్పెండ్ చేసి పని చేస్తున్న ప్రాంతం నుంచి అనుమతి లేకుండా వెళ్లకూడదని ఆదేశించారు. విజిలెన్స్ ఏడీ లక్ష్యంగా మాఫియా స్కెచ్ ఉత్తరాంధ్ర మైనింగ్ మాఫియాకు చెందిన శ్రీనివాస చౌదరి, ఎంఎస్ రెడ్డి, వాణీ చౌదరికి చెందిన కంపెనీలతోపాటు ఇతర కంపెనీలతోనూ అనకాపల్లి మైనింగ్ ఏడీ కార్యాలయ అధికారులు లాలూచీపడినట్టు స్పష్టమైంది. వారి మద్దతుతోనే విజిలెన్స్ ఏడీపై జియాలజిస్ట్ దాడి చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారం బహిర్గతమవడంతో ఇప్పుడు నేరుగా మాఫియాలోని వ్యక్తులే విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డిని అడ్డుకునేందుకు స్కెచ్ వేసినట్టు పోలీసులకు సమాచారం అందింది. ఆయన్ను భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా తనిఖీలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. దీంతో ప్రతాప్‌రెడ్డికి పోలీసులు భద్రత పెంచారు. విజిలెన్స్ బృందాలకు సైతం భద్రత పెంచి తనిఖీల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసు ఇంటెలిజెన్స్ అధికారులు సైతం అనకాపల్లి మైనింగ్ వ్యవహారాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్నట్టు సమాచారం. -
మైనర్ మినరల్స్ తవ్వకాలకు ఈ–వేలం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇక నుంచి ఈ–వేలం ద్వారానే మైనర్ మినరల్స్ విక్రయించాలని, సీనరేజీ ఫీజు వసూళ్లను ఔట్ సోర్సింగ్‌కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మైనింగ్ శాఖలో పలు సంస్కరణలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారు. మైనింగ్ శాఖపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇసుక అందుబాటులో ఉంచడంతో పాటు మైనింగ్ లీజులపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రానైట్ మైనింగ్‌లో సైజు (పరిమాణం) పద్ధతిలో కాకుండా బరువు ఆధారంగా సీనరేజీ నిర్ణయించాలని నిర్ణయించారు. ఇకపై ఎన్ని టన్నుల బరువు ఉంటే.. ఆ మేరకు సీనరేజీ నిర్ణయిస్తారు. దీనివల్ల కనీసం 35 నుంచి 40 శాతం ఆదాయం పెరుగుతుందని అంచనా వేశారు. లీజులు పొంది, గనులు నిర్వహించని చోట కొత్తగా ఈ–వేలం నిర్వహించాలని నిర్ణయించారు. దీనివల్ల మరో రూ.వెయ్యి కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తుందని అంచనా. సెప్టెంబర్ నుంచి కొత్త నిర్ణయాలు అమల్లోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మైనింగ్ శాఖలో నిఘా, అమలు విభాగం పటిష్టంగా ఉండాలని, ఆదాయాలకు గండి పడకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. వర్షాలు వచ్చేలోగా కనీసం 60 నుంచి 79 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. వర్షాల వల్ల రీచ్‌లు మునిగిపోయే అవకాశం ఉంటుందని, మళ్లీ ఇసుకకు ఇబ్బందులు రాకుండా సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. -
అక్రమార్కులపై ‘ప్రతాపం’
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. మైనింగ్ శాఖలో తన ‘ప్రతాపం’ చూపిస్తున్నారు. వందల కోట్ల రూపాయలను కొల్లగొట్టిన ‘ఘనుల’ బాగోతం బయటపెడుతున్నారు. గత ప్రభుత్వంలో దాచి పెట్టిన, దోచుకున్న సొమ్మును లెక్క కట్టి చూపిస్తున్నారు. తన, తమ భేదం లేదు. తప్పు చేసిన వాడి నుంచి ప్రభుత్వానికి ఫైన్ చెల్లించేలా పనిచేసి మైనింగ్ శాఖను హడలెత్తిసున్నారు. ఈ వ్యవహారాలను గమనిస్తున్నవారికి ఆయనెవరో ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది. ఆయనే మైనింగ్ శాఖ విజిలెన్స్ స్క్వాడ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.ప్రతాప్‌రెడ్డి. ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మైనింగ్ అక్రమార్కుల్లో దడ పుట్టిస్తున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి ఏరియాలో జరిగిన వేల టన్నుల అక్రమ మైనింగ్ గుట్టు రట్టు చేశారు. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి తదితర ప్రాంతాల్లో నడుస్తున్న మాంగనీస్ ఖనిజాల అక్రమ నిల్వలు, తవ్వకాలు, అనధికార రవాణా బండారాన్ని బయటపెట్టారు. ఇక, శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి, రాజాం, ఆమదాలవలస నియోజకవర్గాల్లో వందల కోట్ల విలువైన గ్రానైట్ అక్రమాల నిగ్గు తేల్చారు. ఆయన దూకుడుని తట్టుకోలేక ఏదో ఒక ఆరోపణ చేసి ఇరికించే స్థాయికి అక్రమార్కులు దిగజారారంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వాన్ని గడగడలాడించిన వైనం గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి సన్నిహితంగా ఉన్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన రుత్విక్ సంస్థ అప్పటికే వంశధార పనులు నిర్వహిస్తోంది. పనులు జరుగుతున్న క్రమంలో మెటల్, గ్రావెల్ అక్రమంగా తవ్వకాలు చేపట్టింది. 7,774 క్యూబిక్ మీటర్ల మెటల్ అక్రమంగా తవ్వినట్టు గుర్తించి, రూ.83,57,050 జరిమానా విధించారు. 52,774 క్యూబిక్ మీటర్లు అక్రమంగా తవ్వడంతో కోటి 42 లక్షల 48 వేల 490 రూపాయల జరిమానా వేశారు. ఏ లీజు లేకుండా అక్రమంగా తవ్వినందుకు రూ.2.36 కోట్లు మేర పెనాల్టీ వేసి నోటీసు జారీ చేశారు. నాడు మంత్రిగా పనిచేసిన ఒకాయన పొందూరులో జరిపిన మైనింగ్ అక్రమాలను బయటపెట్టారు. మరో మంత్రి దేవినేనికి చెందిన మైనింగ్ అక్రమాల గుట్టు రట్టు చేశారు. ఇంకేముంది ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. కానీ వెనక్కి తగ్గలేదు. తాను బయటపెట్టిన అక్రమాలపైనే స్టాండ్ అయిపోయారు. ఎంతకీ లొంగలేదని నాటి మంత్రి ఒకరు హుటాహుటిన బదిలీ చేయించేశారు. వాస్తవానికి నాడు జిల్లాకొచ్చినప్పుడే అనంతపురం జిల్లా నుంచి బదిలీపై వచ్చారు. అక్కడ కూడా టీడీపీలో బ్రదర్స్‌గా చెలామణి అయిన నేతల అక్రమాలు బయటపెట్టారని ఇక్కడికి పంపించేశారు. తనను ఉద్దేశపూర్వకంగా బదిలీ చేశారని తెలిసినప్పటికీ వెనక్కి తగ్గకుండా శ్రీకాకుళం జిల్లాలో కూడా మైనింగ్ అక్రమాల బాగోతాన్ని బయటపెట్టారు. ఒత్తిళ్లు, బదిలీలు తనను ఆపలేవని చేతల ద్వారా చూపించారు. మొత్తానికి టీడీపీ హయాంలో బదిలీని బహుమానంగా ఇచ్చి అక్రమార్కులకు నాటి పెద్దలు అండగా నిలిచారు. ప్రభుత్వం మారింది... అక్రమాల గుట్టు రట్టయింది టీడీపీ ప్రభుత్వం దిగిపోయిన వెంటనే అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ మైనింగ్ అక్రమాలపై దృష్టి సారించింది. మైనింగ్‌లో ఉన్న లొసుగులు, అక్రమాలు తెలిసిన వ్యక్తిని రంగంలోకి దించితే గానీ బయటికి రావని గుర్తించింది. ఆ శాఖలో పనిచేస్తున్న కొందరు మైనింగ్ మాఫియాకు తొత్తులై, ముడుపులతో అక్రమాలకు యథేచ్ఛగా వదిలేస్తున్నారని నిర్ధారణకొచ్చి.. ప్రతాప్రెడ్డిలాంటి అధికారులను ప్రభుత్వం రంగంలోకి దించింది. ఇంకేముంది క్వారీల్లో చోటు చేసుకున్న అక్రమాలన్నీ బయటికొచ్చేస్తున్నాయి. వెలుగు చూసిన అక్రమాలివే.. కోటబొమ్మాళి మండలం లింగాలవలసలో ఉన్న ఎంఎస్పీ గ్రానైట్‌లో 56,009 క్యూబిక్ మీటర్ల కలర్ గ్రానైట్ అక్రమంగా తవ్వినట్టు తేల్చారు. అపరాధ రుసుంతో కలిసి రూ.215 కోట్ల 6 లక్షల 27 వేల 76 రూపాయలు ప్రభుత్వానికి ఎంఎస్పీ కంపెనీ చెల్లించాలని నోటీసు కూడా జారీ చేశారు. ►కోటబొమ్మాళి మండలం పట్టుపురంలో ఉన్న ఐశ్వర్య గ్రానైట్ అండ్ మినరల్స్‌లో 589 క్యూబిక్ మీటర్లు కలర్ గ్రానైట్ అక్రమంగా తవ్వినట్టు గుర్తించారు. లీజు వెలుపుల 321 క్యూబిక్ మీటర్లు అక్రమంగా తవ్వి సొమ్ము చేసుకున్నట్టు నిగ్గు తేల్చారు. మొత్తంగా కోటి 50 లక్షల వరకు ఫైన్ విధించారు. ►వంగర మండలం జగన్నాథపురం గ్రామంలో గల పూశ్య క్వారీ వెలుపల అనధికారికంగా 17,164 క్యూబిక్ మీటర్ల వైట్ గెలాక్సీ/కాశ్మీర్ వైట్ తవ్వకాలు జరిపినట్టు గుర్తిదంచారు. రూ.42 కోట్ల 32 లక్షల 56 వేల మేర జరిమానా విధించారు. అప్పుడు అధికారం అక్రమార్కులకు అండగా నిలిచింది. ఇప్పుడు నిజాయితీగా పనిచేసే వారికి ప్రస్తుత ప్రభుత్వం స్వేచ్ఛనివ్వడంతో అక్రమాలు బయటికొస్తున్నాయి. ఇవన్నీ గత ప్రభుత్వంలోనే దాదాపు గుర్తించారు. కానీ నాటి పాలకులే అక్రమార్కులకు తొత్తులు కావడంతో బయటికి రానివ్వలేదు. దీంతో ప్రస్తుతం ప్రతాప్‌రెడ్డి పేరు హాట్ టాపిక్ అయ్యింది. అక్రమార్కులకు సింహస్వప్నంగా నిలిచిపోయారు. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే కాదు విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కూడా రోజుకొక చోట మైనింగ్ అక్రమ తవ్వకాల గుట్టురట్టు చేస్తున్నారు. వాహనాలు సీజ్ చేయడం, అక్రమ తవ్వకాలకు సంబంధించి ఫైన్లు వేయడం చేస్తున్నారు. దీంతో మైనింగ్ శాఖలోనే కాదు మైనింగ్ అక్రమార్కుల్లో ప్రతాప్‌రెడ్డి గుబులు పట్టుకుంది. ఇంతవరకు బయటపడని అక్రమాలు వెలుగులోకి తెస్తున్నారని క్వారీ యజమానులు, జరిగిన అక్రమాలు దాచి పెట్టి ప్రభుత్వానికి నష్టపరిచిన అధికారులకు వణుకు మొదలైంది. ఎప్పుడు ఎవరి పీకకు చుట్టుకుంటుందోనన్న భయం పట్టుకుంది. -
ఆన్లైన్లో గనుల లీజులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త గనుల లీజుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను పూర్తిగా అన్లైన్ చేశామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. గనుల లీజులు, అనుమతుల దరఖాస్తులను ఇకపై ఆన్లైన్లో చేసుకోవచ్చన్నారు. లీజుల పునరుద్ధరణ దరఖాస్తులను సైతం ఆన్లైన్లో స్వీకరిస్తామన్నారు. గనుల శాఖ ఇప్పటికే అందిస్తున్న ఆన్లైన్ సేవలకు అనుబంధంగా కొత్త సేవలను బుధవారం మంత్రి కేటీఆర్ సచివాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దరఖాస్తుదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా అన్లైన్లో దరఖాస్తుల స్థితిగతులను తెలుసుకోవచ్చన్నారు. ఆన్లైన్ విధానంతో లైసెన్సుల పునరుద్ధరణ ద్వారా రాయల్టీలు సకాలంలో అంది ఖజానాకు అదాయం పెరుగుతుందని చెప్పారు. ఏ అధికారినీ నేరుగా కలవాల్సిన అవసరం లేకుండా అనుమతులు పొందవచ్చని, దీంతో పారదర్శకత, వేగం పెరుగుతుందని అన్నారు. ఖనిజాల డీలర్లకు సైతం లైసెన్సుల కోసం దరఖాస్తుల సమర్పణ, అమ్మకాలు, నిల్వ వంటి కార్యకలాపాలను నిర్వహించేందుకు డిజిటల్ సంతకాలతో కూడిన లైసెన్సులు జారీ చేస్తామని గనుల శాఖ డైరెక్టర్ సుశీల్‌కుమార్ మంత్రికి తెలిపారు. లీజు విస్తీర్ణం డిజిటైజ్.. గనుల శాఖ ఇప్పటికే టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకుంటోందని, రాష్ట్రంలో గనులు, వివిధ రకాల ఖనిజాలు లభించే ప్రాంతాలు, వాటి నిల్వలు, ఖనిజాల ఆధారిత పరిశ్రమలు, వాటి అభివృద్ధికి ఉన్న అవకాశాల వివరాలను గనుల శాఖ వెబ్సైట్లో పొందుపరి చామని మంత్రి కేటీఆర్ చెప్పారు. లీజుకు ఇచ్చిన విస్తీర్ణాన్ని డిజిటైజ్ చేసి దాన్ని జియో మ్యాపింగ్ చేయడం, మైనింగ్ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి కార్యకలాపాలను పర్యవేక్షించడం, డ్రోన్ల వినియోగం లాంటి కార్యక్రమాలను వెంటనే చేపట్టాలని గనుల శాఖను మంత్రి ఆదేశించారు. -
అక్రమ ఇటుక బట్టీలు
► నిబంధనలు బేఖాతరు ► ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్న వ్యాపారులు ► పట్టించుకోని అధికారులు ఆదిలాబాద్ టౌన్ : ఆదిలాబాద్ నియోజక వర్గంలో ఇటుక బట్టీలు ఇష్టారీతిగా వెలుస్తున్నాయి. ఇటుకలకు పెరుగుతున్న డిమాండ్‌తో ఆయా మండలాల్లో ఎక్కడపడితే అక్కడ పుట్టగొడుగుల్లా బట్టీలు వెలుస్తున్నాయి. ప్రజలు నివసించే ప్రాంతాలకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఇటుకలను తయారు చేయాలని నిబంధనలు ఉన్నా వాటిని వ్యాపారులు తుంగలో తొక్కుతున్నారు. నివాస ప్రాంతాలకు సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా బట్టీలను ఏర్పాటు చేస్తున్నారు.ఏజెన్సీ ప్రాంతంలో 1/ 70 చట్టం ప్రకారం తవ్వడానికి వీలు లేనప్పటికీ అవేం పట్టకుండా గ్రామాల్లో లక్షల వ్యాపారం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కడపడితే అక్కడ ఇటుకల తయారీ చేయడంతో వాతావరణం కాలుష్యమవుతుంది. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రూ. లక్షల్లో గండి.. ఆదిలాబాద్ రూరల్, మావల మండలంలోని బట్టీసావర్గాం, బంగారుగూడ, మావల, అంకోలి, తంతోలి, చించూగాట్, యాపల్‌గూడ, జైనథ్ మండలంలోని పెన్ గంగా సమీపంలోని డోలార వద్ద ఇటుకల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇటుకల విక్రయాలతో ప్రధానంగా వాణిజ్య పన్నుల శాఖ ఎక్కువగా ఆదాయం కోల్పోతుంది. సంవత్సరానికి రూ. లక్షల్లో నష్టపోవాల్సివస్తోంది. ఒక్కో ఇటుకకు రూ. 3 చొప్పన వ్యాపారులు వసూలు చేస్తున్నా చాలామంది వ్యాపారులు ప్రభుత్వానికి నయాపైసా కూడా చెల్లించడం లేదు. వ్యాపారులు 5 శాతం వ్యాట్ చెల్లించడం గాని, అనుమతులు పొందడం లాంటివి చేయడంలేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండిపడుతోంది. ఇటుకల తయారీకి మట్టి అవసరం. చేన్లో, గుట్టల్లో, అటవీ ప్రాంతంలోని మట్టిని తవ్వి ఇటుకలు తయారు చేస్తున్నారు. మట్టిని తవ్వాలంటే భూగర్భ శాఖ, గ్రామపంచాయతీ అనుమతి కూడా ఉండాలి. ఆదిలాబాద్ రూరల్, మావల మండలాల్లో కుప్పలు తెప్పలుగా ఇటుక బట్టీలు వెలసినా ఏ ఒక్కదానికి అనుమతులు లేదని తెలుస్తోంది. ఇటుకలు విక్రయించాక అమ్మకం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం విలువ అధారిత పన్ను (వ్యాట్) వీటికి ఐదుశాతం ఉంది. ఈ విక్రయాలకు పన్ను చెల్లించాల్సి ఉన్నా అది కూడా అమలు కావడం లేదు. పట్టించుకోని అధికారులు జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో అనుమతి లేని ఇటుక బట్టీలు వెలుస్తున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో మట్టికోసం గుట్టలను తవ్వుతున్నా అటవీశాఖ అధికారుల్లో చలనం కన్పించడం లేదు. రోజురోజుకు ఈ వ్యాపారం ఊపందుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇప్పటికైనా అధికారులుస్పందించి ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించాలి్సన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. బట్టీల్లో మగ్గుతున్న బాల్యం 6–14 సంవత్సరాల లోపు పిల్లలంతా విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లోనే ఉండాలి. కానీ ఇటుకలు తయారు చేసే కార్మికుల పిల్లల బాల్యం బట్టీల్లోనే మగ్గుతోంది. తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా మట్టి పనిలోనే నిమగ్నమవుతున్నారు. విద్యాశాఖ, కార్మిక శాఖ అధికారుల పట్టింపు లేనితనంతో వారి బాల్యం బుగ్గిపాలవుతోంది. ఆ ప్రాంతంలో ప్రత్యామ్నాయ పాఠశాలలు లేక పోవడంతో చదువుకు దూరమవుతున్నారు. చర్యలు తీసుకుంటాం ఇటుక వ్యాపారం కొనసాగించాలంటే గ్రామపంచాయతీతో పాటు మైనింగ్ శాఖ అధికారుల అనుమతి తీసుకోవాలి. అనుమతులు లేకుండా ఇటుక బట్టీల నిర్వహణ కొనసాగిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం. అనుమతులు లేకుండా ఇటుక వ్యాపారం సాగిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వారి వివరాలు సేకరించాం. నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటాం. – శ్రీదేవి, ఆదిలాబాద్ రూరల్ తహసీల్దార్