మైనింగ్ శాఖపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి పెద్దిరెడ్డి తదితరులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇక నుంచి ఈ–వేలం ద్వారానే మైనర్ మినరల్స్ విక్రయించాలని, సీనరేజీ ఫీజు వసూళ్లను ఔట్ సోర్సింగ్‌కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మైనింగ్ శాఖలో పలు సంస్కరణలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారు. మైనింగ్ శాఖపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇసుక అందుబాటులో ఉంచడంతో పాటు మైనింగ్ లీజులపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రానైట్ మైనింగ్‌లో సైజు (పరిమాణం) పద్ధతిలో కాకుండా బరువు ఆధారంగా సీనరేజీ నిర్ణయించాలని నిర్ణయించారు. ఇకపై ఎన్ని టన్నుల బరువు ఉంటే.. ఆ మేరకు సీనరేజీ నిర్ణయిస్తారు. దీనివల్ల కనీసం 35 నుంచి 40 శాతం ఆదాయం పెరుగుతుందని అంచనా వేశారు.
లీజులు పొంది, గనులు నిర్వహించని చోట కొత్తగా ఈ–వేలం నిర్వహించాలని నిర్ణయించారు. దీనివల్ల మరో రూ.వెయ్యి కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తుందని అంచనా. సెప్టెంబర్ నుంచి కొత్త నిర్ణయాలు అమల్లోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మైనింగ్ శాఖలో నిఘా, అమలు విభాగం పటిష్టంగా ఉండాలని, ఆదాయాలకు గండి పడకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. వర్షాలు వచ్చేలోగా కనీసం 60 నుంచి 79 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. వర్షాల వల్ల రీచ్‌లు మునిగిపోయే అవకాశం ఉంటుందని, మళ్లీ ఇసుకకు ఇబ్బందులు రాకుండా సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment