సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. మైనింగ్ శాఖలో తన ‘ప్రతాపం’ చూపిస్తున్నారు. వందల కోట్ల రూపాయలను కొల్లగొట్టిన ‘ఘనుల’ బాగోతం బయటపెడుతున్నారు. గత ప్రభుత్వంలో దాచి పెట్టిన, దోచుకున్న సొమ్మును లెక్క కట్టి చూపిస్తున్నారు. తన, తమ భేదం లేదు. తప్పు చేసిన వాడి నుంచి ప్రభుత్వానికి ఫైన్ చెల్లించేలా పనిచేసి మైనింగ్ శాఖను హడలెత్తిసున్నారు. ఈ వ్యవహారాలను గమనిస్తున్నవారికి ఆయనెవరో ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది. ఆయనే మైనింగ్ శాఖ విజిలెన్స్ స్క్వాడ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.ప్రతాప్‌రెడ్డి. ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మైనింగ్ అక్రమార్కుల్లో దడ పుట్టిస్తున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి ఏరియాలో జరిగిన వేల టన్నుల అక్రమ మైనింగ్ గుట్టు రట్టు చేశారు. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి తదితర ప్రాంతాల్లో నడుస్తున్న మాంగనీస్ ఖనిజాల అక్రమ నిల్వలు, తవ్వకాలు, అనధికార రవాణా బండారాన్ని బయటపెట్టారు. ఇక, శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి, రాజాం, ఆమదాలవలస నియోజకవర్గాల్లో వందల కోట్ల విలువైన గ్రానైట్ అక్రమాల నిగ్గు తేల్చారు. ఆయన దూకుడుని తట్టుకోలేక ఏదో ఒక ఆరోపణ చేసి ఇరికించే స్థాయికి అక్రమార్కులు దిగజారారంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు.
గత ప్రభుత్వాన్ని గడగడలాడించిన వైనం
గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి సన్నిహితంగా ఉన్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన రుత్విక్ సంస్థ అప్పటికే వంశధార పనులు నిర్వహిస్తోంది. పనులు జరుగుతున్న క్రమంలో మెటల్, గ్రావెల్ అక్రమంగా తవ్వకాలు చేపట్టింది. 7,774 క్యూబిక్ మీటర్ల మెటల్ అక్రమంగా తవ్వినట్టు గుర్తించి, రూ.83,57,050 జరిమానా విధించారు. 52,774 క్యూబిక్ మీటర్లు అక్రమంగా తవ్వడంతో కోటి 42 లక్షల 48 వేల 490 రూపాయల జరిమానా వేశారు. ఏ లీజు లేకుండా అక్రమంగా తవ్వినందుకు రూ.2.36 కోట్లు మేర పెనాల్టీ వేసి నోటీసు జారీ చేశారు. నాడు మంత్రిగా పనిచేసిన ఒకాయన పొందూరులో జరిపిన మైనింగ్ అక్రమాలను బయటపెట్టారు. మరో మంత్రి దేవినేనికి చెందిన మైనింగ్ అక్రమాల గుట్టు రట్టు చేశారు.
ఇంకేముంది ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. కానీ వెనక్కి తగ్గలేదు. తాను బయటపెట్టిన అక్రమాలపైనే స్టాండ్ అయిపోయారు. ఎంతకీ లొంగలేదని నాటి మంత్రి ఒకరు హుటాహుటిన బదిలీ చేయించేశారు. వాస్తవానికి నాడు జిల్లాకొచ్చినప్పుడే అనంతపురం జిల్లా నుంచి బదిలీపై వచ్చారు. అక్కడ కూడా టీడీపీలో బ్రదర్స్‌గా చెలామణి అయిన నేతల అక్రమాలు బయటపెట్టారని ఇక్కడికి పంపించేశారు. తనను ఉద్దేశపూర్వకంగా బదిలీ చేశారని తెలిసినప్పటికీ వెనక్కి తగ్గకుండా శ్రీకాకుళం జిల్లాలో కూడా మైనింగ్ అక్రమాల బాగోతాన్ని బయటపెట్టారు. ఒత్తిళ్లు, బదిలీలు తనను ఆపలేవని చేతల ద్వారా చూపించారు. మొత్తానికి టీడీపీ హయాంలో బదిలీని బహుమానంగా ఇచ్చి అక్రమార్కులకు నాటి పెద్దలు అండగా నిలిచారు.
ప్రభుత్వం మారింది... అక్రమాల గుట్టు రట్టయింది
టీడీపీ ప్రభుత్వం దిగిపోయిన వెంటనే అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ మైనింగ్ అక్రమాలపై దృష్టి సారించింది. మైనింగ్‌లో ఉన్న లొసుగులు, అక్రమాలు తెలిసిన వ్యక్తిని రంగంలోకి దించితే గానీ బయటికి రావని గుర్తించింది. ఆ శాఖలో పనిచేస్తున్న కొందరు మైనింగ్ మాఫియాకు తొత్తులై, ముడుపులతో అక్రమాలకు యథేచ్ఛగా వదిలేస్తున్నారని నిర్ధారణకొచ్చి.. ప్రతాప్‌రెడ్డిలాంటి అధికారులను ప్రభుత్వం రంగంలోకి దించింది. ఇంకేముంది క్వారీల్లో చోటు చేసుకున్న అక్రమాలన్నీ బయటికొచ్చేస్తున్నాయి.
వెలుగు చూసిన అక్రమాలివే..
కోటబొమ్మాళి మండలం లింగాలవలసలో ఉన్న ఎంఎస్‌పీ గ్రానైట్‌లో 56,009 క్యూబిక్ మీటర్ల కలర్ గ్రానైట్ అక్రమంగా తవ్వినట్టు తేల్చారు. అపరాధ రుసుంతో కలిసి రూ.215 కోట్ల 6 లక్షల 27 వేల 76 రూపాయలు ప్రభుత్వానికి ఎంఎస్‌పీ కంపెనీ చెల్లించాలని నోటీసు కూడా జారీ చేశారు.
►కోటబొమ్మాళి మండలం పట్టుపురంలో ఉన్న ఐశ్వర్య గ్రానైట్ అండ్ మినరల్స్‌లో 589 క్యూబిక్ మీటర్లు కలర్ గ్రానైట్ అక్రమంగా తవ్వినట్టు గుర్తించారు. లీజు వెలుపుల 321 క్యూబిక్ మీటర్లు అక్రమంగా తవ్వి సొమ్ము చేసుకున్నట్టు నిగ్గు తేల్చారు. మొత్తంగా కోటి 50 లక్షల వరకు ఫైన్ విధించారు.
►వంగర మండలం జగన్నాథపురం గ్రామంలో గల పూశ్య క్వారీ వెలుపల అనధికారికంగా 17,164 క్యూబిక్ మీటర్ల వైట్ గెలాక్సీ/కాశ్మీర్ వైట్ తవ్వకాలు జరిపినట్టు గుర్తిదంచారు. రూ.42 కోట్ల 32 లక్షల 56 వేల మేర జరిమానా విధించారు.
అప్పుడు అధికారం అక్రమార్కులకు అండగా నిలిచింది. ఇప్పుడు నిజాయితీగా పనిచేసే వారికి ప్రస్తుత ప్రభుత్వం స్వేచ్ఛనివ్వడంతో అక్రమాలు బయటికొస్తున్నాయి. ఇవన్నీ గత ప్రభుత్వంలోనే దాదాపు గుర్తించారు. కానీ నాటి పాలకులే అక్రమార్కులకు తొత్తులు కావడంతో బయటికి రానివ్వలేదు. దీంతో ప్రస్తుతం ప్రతాప్‌రెడ్డి పేరు హాట్ టాపిక్ అయ్యింది. అక్రమార్కులకు సింహస్వప్నంగా నిలిచిపోయారు. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే కాదు విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కూడా రోజుకొక చోట మైనింగ్ అక్రమ తవ్వకాల గుట్టురట్టు చేస్తున్నారు. వాహనాలు సీజ్ చేయడం, అక్రమ తవ్వకాలకు సంబంధించి ఫైన్‌లు వేయడం చేస్తున్నారు. దీంతో మైనింగ్ శాఖలోనే కాదు మైనింగ్ అక్రమార్కుల్లో ప్రతాప్‌రెడ్డి గుబులు పట్టుకుంది. ఇంతవరకు బయటపడని అక్రమాలు వెలుగులోకి తెస్తున్నారని క్వారీ యజమానులు, జరిగిన అక్రమాలు దాచి పెట్టి ప్రభుత్వానికి నష్టపరిచిన అధికారులకు వణుకు మొదలైంది. ఎప్పుడు ఎవరి పీకకు చుట్టుకుంటుందోనన్న భయం పట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment