prathap reddy
-
పాఠ్యాంశాలపై తప్పుడు ప్రచారం: పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: ప్రభుత్వాన్ని అప్రతిష్ణపాలు చేసేలా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలపై విద్యా శాఖ తరపున స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యా శాఖ ఫిర్యాదుపై ఇబ్రహింపట్నం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాల పరిచయం కోసం అన్ని మతాల పండగలకి సమాన ప్రాధాన్యనిస్తూ తెలుగు వాచకంలో రెండవ తరగతి నుంచి ఏడో తరగతి వరకు పాఠ్యపుస్తకాల రూపకల్పన చేశామన్నారు. చదవండి: దుర్గమ్మ పాఠ్యాంశాలను తొలగించలేదు పాఠ్యపుస్తకాలలో హిందూ పండుగలు - 7, ముస్లిమ్ పండుగలు - 2 , క్రిస్టియన్ పండుగలు - 2, సవరల పండుగ- ఒకటి చొప్పున పాఠ్యాంశాలు ఉన్నాయని తెలిపారు. మొత్తం 12 పండగలు గురించి పాఠ్యాంశాల్లో పొందుపరిచి అన్ని మతాలకి సమ ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. ఇందులో నుంచి ఒక్క పండగ మాత్రమే ఎంపిక చేసి హిందూ మతానికి అన్యాయం జరుగుతున్నట్లుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. అందుకోసమే ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. చదవండి: శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేయకపోతే కృష్ణా జలాలు వృథా -
ఉల్లం‘ఘనులకు’ ఇంటి దొంగల వత్తాసు
సాక్షి, అమరావతి: గనులను కొల్లగొట్టిన అక్రమార్కులకు మైనింగ్ శాఖలోని కొందరు అధికారులే అండగా నిలవడం ఉత్తరాంధ్రలో చర్చనీయాంశమైంది. విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతంలోని మెటల్ క్వారీల్లో చోటుచేసుకున్న అక్రమాలపై మైనింగ్ విజిలెన్స్ విభాగం 10 రోజులుగా చేస్తున్న తనిఖీలకు అక్కడి మైనింగ్ అధికారులు అడుగడుగునా అడ్డు తగులుతున్నట్టు తేలింది. తనిఖీలకు నేతృత్వం వహిస్తున్న విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డి పట్ల అనకాపల్లి మైనింగ్ ఏడీ కార్యాలయ అధికారులు దురుసుగా ప్రవర్తించగా.. జియాలజిస్ట్ విఘ్నేశ్వరుడు ఏకంగా దాడికి యత్నించటం కలకలం రేపింది. ఫైళ్లు ఇవ్వకుండా.. మాఫియాకు పాదాక్రాంతం అనకాపల్లి మండలంలోని 30 క్వారీల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్టు ఫిర్యాదులు రావడంతో మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ బృందాలను రంగంలోకి దించారు. ఈ బృందాలు రాష్ట్రంలోనే బడా కంపెనీలకు చెందిన క్వారీల్లో తనిఖీలు చేసి ఉల్లంఘనల్ని బయటపెడుతుండడంతో మైనింగ్ మాఫియా వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. అయినా విజిలెన్స్ అధికారులు వెనక్కి తగ్గకపోవడంతో అనకాపల్లి ఏడీ కార్యాలయంలోని కొందరు సిబ్బంది, ఇతర ప్రాంతాల్లోని పలువురు మైనింగ్ అధికారులు విజిలెన్స్ బృందాలకు అడ్డంకులు కల్పించారు. తనిఖీలు చేస్తున్న క్వారీలకు సంబంధించిన ఫైళ్లు, అనుమతులు, ఇతర వివరాలు ఇవ్వకుండా అక్కడి అధికారులు రోజుల తరబడి తప్పుకుని తిరుగుతున్నట్టు సమాచారం. మరోవైపు విజిలెన్స్ అధికారుల తనిఖీల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మైనింగ్ మాఫియాకు చేరవేస్తూ అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో మైనింగ్ విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డి ఇటీవల అనకాపల్లి మైనింగ్ ఏడీ కార్యాలయానికి వెళ్లి ఫైళ్లు ఇవ్వాలని కోరారు. విజిలెన్స్ బృందం మూడు గంటలకు పైగా ఆ కార్యాలయంలో వేచి ఉన్నప్పటికీ.. ఫైళ్లు ఇవ్వకుండా తనిఖీలను తప్పుపట్టేలా మాట్లాడుతూ అక్కడి జియాలజిస్ట్ విఘ్నేశ్వరుడు విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఉన్నట్టుండి ఏడీ మొహంపై తాను తాగుతున్న టీని విసిరారు. ఆ తర్వాత దాడికి ప్రయత్నించడంతో సిబ్బంది అడ్డుకున్నారు. దీనిపై ప్రతాప్‌రెడ్డి విజయవాడలోని మైనింగ్ శాఖ సంచాలకులు వెంకటరెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణ జరిపారు. అనకాపల్లి జియాలజిస్ట్ విఘ్నేశ్వరుడుదే తప్పని నిర్థారించి వెంటనే ఆయనను సస్పెండ్ చేసి పని చేస్తున్న ప్రాంతం నుంచి అనుమతి లేకుండా వెళ్లకూడదని ఆదేశించారు. విజిలెన్స్ ఏడీ లక్ష్యంగా మాఫియా స్కెచ్ ఉత్తరాంధ్ర మైనింగ్ మాఫియాకు చెందిన శ్రీనివాస చౌదరి, ఎంఎస్ రెడ్డి, వాణీ చౌదరికి చెందిన కంపెనీలతోపాటు ఇతర కంపెనీలతోనూ అనకాపల్లి మైనింగ్ ఏడీ కార్యాలయ అధికారులు లాలూచీపడినట్టు స్పష్టమైంది. వారి మద్దతుతోనే విజిలెన్స్ ఏడీపై జియాలజిస్ట్ దాడి చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారం బహిర్గతమవడంతో ఇప్పుడు నేరుగా మాఫియాలోని వ్యక్తులే విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డిని అడ్డుకునేందుకు స్కెచ్ వేసినట్టు పోలీసులకు సమాచారం అందింది. ఆయన్ను భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా తనిఖీలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. దీంతో ప్రతాప్‌రెడ్డికి పోలీసులు భద్రత పెంచారు. విజిలెన్స్ బృందాలకు సైతం భద్రత పెంచి తనిఖీల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసు ఇంటెలిజెన్స్ అధికారులు సైతం అనకాపల్లి మైనింగ్ వ్యవహారాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్నట్టు సమాచారం. -
వైఎస్ ప్రతాప్‌రెడ్డి కార్యాలయంలో పోలీసుల తనిఖీ
పులివెందుల: వైఎస్సార్ జిల్లా భాకరాపురంలోని పేలుడు పదార్థాల లైసెన్సు హోల్డర్ వైఎస్ ప్రతాప్‌రెడ్డి కార్యాలయంలో శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పోరుమామిళ్ల సీఐ మోహన్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి శనివారం మధ్యాహ్నం వైఎస్ ప్రతాప్‌రెడ్డి కార్యాలయానికి చేరుకున్నారు. పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని విచారించారు. పేలుడు పదార్థాలు, వాటి నిల్వలతో పాటు ఎవరెవరికి సరఫరా చేస్తారు? తదితర విషయాలపై వారిని ప్రశ్నించినట్లు సమాచారం. మామిళ్లపల్లె వద్దనున్న ముగ్గురాళ్ల క్వారీలో ఈనెల 8న పేలుళ్లు సంభవించి 10 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి క్వారీ లీజుదారుడు నాగేశ్వరరెడ్డి, జిలెటిన్ స్టిక్స్ సరఫరా చేసిన రఘునాథరెడ్డితో పాటు పులివెందులకు చెందిన వైఎస్ ప్రతాప్‌రెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. -
ప్రతాప్ రెడ్డి కార్యాలయంలో పోలీసుల తనిఖీ
సాక్షి, వైఎస్సార్ జిల్లా : పులివెందుల మున్సిపాలిటీ భాకరపురంలోని వైఎస్ ప్రతాప్‌రెడ్డి కార్యాలయంలో పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బందిని విచారించారు. పేలుడు పదార్థాలపై ఆరా తీశారు. పేలుడు పదార్థాలను ఎలా నిల్వ చేస్తారు.. ఎక్కడి నుంచి తెస్తారు.. ఎవరికి అమ్ముతారు.. ఇటీవల ఎవరెవరికి అమ్మారు లాంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, ఈనెల 8న మామిళ్లపల్లి క్వారీ వద్ద జరిగిన పేలుడులో 8 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి గని లీజుదారుడు నాగేశ్వర్‌రెడ్డి, రఘునాథ్‌రెడ్డిలను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఈనెల 11న ప్రతాప్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన్ని కోర్టులో హాజరు పర్చగా కోర్టు రిమాండ్ విధించింది. -
అక్రమార్కులపై ‘ప్రతాపం’
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. మైనింగ్ శాఖలో తన ‘ప్రతాపం’ చూపిస్తున్నారు. వందల కోట్ల రూపాయలను కొల్లగొట్టిన ‘ఘనుల’ బాగోతం బయటపెడుతున్నారు. గత ప్రభుత్వంలో దాచి పెట్టిన, దోచుకున్న సొమ్మును లెక్క కట్టి చూపిస్తున్నారు. తన, తమ భేదం లేదు. తప్పు చేసిన వాడి నుంచి ప్రభుత్వానికి ఫైన్ చెల్లించేలా పనిచేసి మైనింగ్ శాఖను హడలెత్తిసున్నారు. ఈ వ్యవహారాలను గమనిస్తున్నవారికి ఆయనెవరో ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది. ఆయనే మైనింగ్ శాఖ విజిలెన్స్ స్క్వాడ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.ప్రతాప్‌రెడ్డి. ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మైనింగ్ అక్రమార్కుల్లో దడ పుట్టిస్తున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి ఏరియాలో జరిగిన వేల టన్నుల అక్రమ మైనింగ్ గుట్టు రట్టు చేశారు. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి తదితర ప్రాంతాల్లో నడుస్తున్న మాంగనీస్ ఖనిజాల అక్రమ నిల్వలు, తవ్వకాలు, అనధికార రవాణా బండారాన్ని బయటపెట్టారు. ఇక, శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి, రాజాం, ఆమదాలవలస నియోజకవర్గాల్లో వందల కోట్ల విలువైన గ్రానైట్ అక్రమాల నిగ్గు తేల్చారు. ఆయన దూకుడుని తట్టుకోలేక ఏదో ఒక ఆరోపణ చేసి ఇరికించే స్థాయికి అక్రమార్కులు దిగజారారంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వాన్ని గడగడలాడించిన వైనం గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి సన్నిహితంగా ఉన్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన రుత్విక్ సంస్థ అప్పటికే వంశధార పనులు నిర్వహిస్తోంది. పనులు జరుగుతున్న క్రమంలో మెటల్, గ్రావెల్ అక్రమంగా తవ్వకాలు చేపట్టింది. 7,774 క్యూబిక్ మీటర్ల మెటల్ అక్రమంగా తవ్వినట్టు గుర్తించి, రూ.83,57,050 జరిమానా విధించారు. 52,774 క్యూబిక్ మీటర్లు అక్రమంగా తవ్వడంతో కోటి 42 లక్షల 48 వేల 490 రూపాయల జరిమానా వేశారు. ఏ లీజు లేకుండా అక్రమంగా తవ్వినందుకు రూ.2.36 కోట్లు మేర పెనాల్టీ వేసి నోటీసు జారీ చేశారు. నాడు మంత్రిగా పనిచేసిన ఒకాయన పొందూరులో జరిపిన మైనింగ్ అక్రమాలను బయటపెట్టారు. మరో మంత్రి దేవినేనికి చెందిన మైనింగ్ అక్రమాల గుట్టు రట్టు చేశారు. ఇంకేముంది ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. కానీ వెనక్కి తగ్గలేదు. తాను బయటపెట్టిన అక్రమాలపైనే స్టాండ్ అయిపోయారు. ఎంతకీ లొంగలేదని నాటి మంత్రి ఒకరు హుటాహుటిన బదిలీ చేయించేశారు. వాస్తవానికి నాడు జిల్లాకొచ్చినప్పుడే అనంతపురం జిల్లా నుంచి బదిలీపై వచ్చారు. అక్కడ కూడా టీడీపీలో బ్రదర్స్‌గా చెలామణి అయిన నేతల అక్రమాలు బయటపెట్టారని ఇక్కడికి పంపించేశారు. తనను ఉద్దేశపూర్వకంగా బదిలీ చేశారని తెలిసినప్పటికీ వెనక్కి తగ్గకుండా శ్రీకాకుళం జిల్లాలో కూడా మైనింగ్ అక్రమాల బాగోతాన్ని బయటపెట్టారు. ఒత్తిళ్లు, బదిలీలు తనను ఆపలేవని చేతల ద్వారా చూపించారు. మొత్తానికి టీడీపీ హయాంలో బదిలీని బహుమానంగా ఇచ్చి అక్రమార్కులకు నాటి పెద్దలు అండగా నిలిచారు. ప్రభుత్వం మారింది... అక్రమాల గుట్టు రట్టయింది టీడీపీ ప్రభుత్వం దిగిపోయిన వెంటనే అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ మైనింగ్ అక్రమాలపై దృష్టి సారించింది. మైనింగ్‌లో ఉన్న లొసుగులు, అక్రమాలు తెలిసిన వ్యక్తిని రంగంలోకి దించితే గానీ బయటికి రావని గుర్తించింది. ఆ శాఖలో పనిచేస్తున్న కొందరు మైనింగ్ మాఫియాకు తొత్తులై, ముడుపులతో అక్రమాలకు యథేచ్ఛగా వదిలేస్తున్నారని నిర్ధారణకొచ్చి.. ప్రతాప్రెడ్డిలాంటి అధికారులను ప్రభుత్వం రంగంలోకి దించింది. ఇంకేముంది క్వారీల్లో చోటు చేసుకున్న అక్రమాలన్నీ బయటికొచ్చేస్తున్నాయి. వెలుగు చూసిన అక్రమాలివే.. కోటబొమ్మాళి మండలం లింగాలవలసలో ఉన్న ఎంఎస్పీ గ్రానైట్‌లో 56,009 క్యూబిక్ మీటర్ల కలర్ గ్రానైట్ అక్రమంగా తవ్వినట్టు తేల్చారు. అపరాధ రుసుంతో కలిసి రూ.215 కోట్ల 6 లక్షల 27 వేల 76 రూపాయలు ప్రభుత్వానికి ఎంఎస్పీ కంపెనీ చెల్లించాలని నోటీసు కూడా జారీ చేశారు. ►కోటబొమ్మాళి మండలం పట్టుపురంలో ఉన్న ఐశ్వర్య గ్రానైట్ అండ్ మినరల్స్‌లో 589 క్యూబిక్ మీటర్లు కలర్ గ్రానైట్ అక్రమంగా తవ్వినట్టు గుర్తించారు. లీజు వెలుపుల 321 క్యూబిక్ మీటర్లు అక్రమంగా తవ్వి సొమ్ము చేసుకున్నట్టు నిగ్గు తేల్చారు. మొత్తంగా కోటి 50 లక్షల వరకు ఫైన్ విధించారు. ►వంగర మండలం జగన్నాథపురం గ్రామంలో గల పూశ్య క్వారీ వెలుపల అనధికారికంగా 17,164 క్యూబిక్ మీటర్ల వైట్ గెలాక్సీ/కాశ్మీర్ వైట్ తవ్వకాలు జరిపినట్టు గుర్తిదంచారు. రూ.42 కోట్ల 32 లక్షల 56 వేల మేర జరిమానా విధించారు. అప్పుడు అధికారం అక్రమార్కులకు అండగా నిలిచింది. ఇప్పుడు నిజాయితీగా పనిచేసే వారికి ప్రస్తుత ప్రభుత్వం స్వేచ్ఛనివ్వడంతో అక్రమాలు బయటికొస్తున్నాయి. ఇవన్నీ గత ప్రభుత్వంలోనే దాదాపు గుర్తించారు. కానీ నాటి పాలకులే అక్రమార్కులకు తొత్తులు కావడంతో బయటికి రానివ్వలేదు. దీంతో ప్రస్తుతం ప్రతాప్‌రెడ్డి పేరు హాట్ టాపిక్ అయ్యింది. అక్రమార్కులకు సింహస్వప్నంగా నిలిచిపోయారు. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే కాదు విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కూడా రోజుకొక చోట మైనింగ్ అక్రమ తవ్వకాల గుట్టురట్టు చేస్తున్నారు. వాహనాలు సీజ్ చేయడం, అక్రమ తవ్వకాలకు సంబంధించి ఫైన్లు వేయడం చేస్తున్నారు. దీంతో మైనింగ్ శాఖలోనే కాదు మైనింగ్ అక్రమార్కుల్లో ప్రతాప్‌రెడ్డి గుబులు పట్టుకుంది. ఇంతవరకు బయటపడని అక్రమాలు వెలుగులోకి తెస్తున్నారని క్వారీ యజమానులు, జరిగిన అక్రమాలు దాచి పెట్టి ప్రభుత్వానికి నష్టపరిచిన అధికారులకు వణుకు మొదలైంది. ఎప్పుడు ఎవరి పీకకు చుట్టుకుంటుందోనన్న భయం పట్టుకుంది. -
అపోలో ఫీవర్ క్లినిక్స్ ప్రారంభం
న్యూఢిల్లీ: కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యేకంగా ఫీవర్ క్లినిక్స్‌ను ప్రారంభించినట్లు అపోలో హెల్త్ అండ్ లైఫ్స్టయిల్లో భాగమైన అపోలో క్లినిక్స్ వెల్లడించింది. జ్వరాలు, తత్సంబంధిత లక్షణాల గురించి సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని పేర్కొంది. తొలి దశలో హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు నగరాల్లో 21 క్లినిక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు. తర్వాతి వారంలో వీటిని 50కి పెంచనున్నట్లు వివరించారు. ప్రత్యేక ఫీవర్ క్లినిక్స్‌లో ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉంటాయని తెలిపారు. -
ఈయన వైఎస్సార్సీపీ నాయకుడట!
సాక్షి, అమరావతి: తమ పార్టీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌తో కలిసి పనిచేసే వారంతా టీడీపీ వాళ్లు కాదని.. బిర్రు ప్రతాప్‌రెడ్డి వైఎస్సార్సీపీ నాయకుడేనని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పుకొచ్చారు. మంగళవారం ఆయన మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రతాప్‌రెడ్డితో కేసు వేయించి కావాలనే ఎన్నికలు ఆలస్యం చేశారని ఆరోపించారు. హైకోర్టు ఒక నెల సమయమిచ్చినా బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లడంలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. (సోమిరెడ్డి కూడా వైఎస్సార్‌సీపీయేనా..?) 50 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. దీనిపై పోరాడతామని, సుప్రీంకోర్టుకు వెళ్లే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. 50 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే 16 వేల మంది బీసీలకు పదవులు పోతాయన్నారు. తమకు కేంద్రం నుంచి డబ్బులు రావాల్సి ఉన్నందునే.. 50 శాతం రిజర్వేషన్లతో ముందుకు వెళుతున్నామని అధికార పార్టీ చెప్పడం సరికాదన్నారు. దీనివల్ల జరిగే నష్టానికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. (చదవండి: చంద్రబాబు వల్లే సీట్ల కోత) చంద్రబాబు బీసీల వ్యతిరేకి టీడీపీ అధినేత చంద్రబాబు బీసీల వ్యతిరేకి అని మరోమారు రుజువైంది. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎక్కడ ప్రాధాన్యత లభిస్తుందోననే భయంతో చంద్రబాబు కుట్రలకు తెరతీశారు. ఆయన నైజం తెలుసుకున్న బీసీలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. – రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి -
ఇంగ్లిష్ మీడియంతో విద్యార్థులకు 'ఉజ్వల భవిత'
ఇంగ్లిష్ మీడియంతో మాతృభాష మృతభాషగా మారిపోతుందని, ప్రాభవం కోల్పోతుందనే వాదనల్లో అర్థం లేదు. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం. ఇది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ దిశగా ముందడుగు సాక్షి, అమరావతి: ‘బాల్యంలోనే ఏ భాషపైన అయినా పట్టు సాధించవచ్చని భాషాశాస్త్రం వెల్లడిస్తోంది. పోటీ ప్రపంచంలో రాణించేందుకు ఇంగ్లిష్‌లో విషయ పరిజ్ఞానం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ప్రాథమిక విద్య నుంచే ఇంగ్లిష్ మీడియంలో బోధించడం ఉత్తమం’ అని ప్రముఖ భాషా శాస్త్రవేత్త, తెలుగు అకాడమీ మాజీ అధ్యక్షుడు జె.ప్రతాప్‌రెడ్డి చెప్పారు. ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే.. ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలకు.. రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయంగా విశ్లేషించాకే ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. పోటీ ప్రపంచంలో ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు దక్కించుకోవాలంటే ఇంగ్లిష్ మీడియంలో విద్యాభ్యాసం తప్పనిసరి. ప్రపంచంలో విషయ పరిజ్ఞానమంతా ఇంగ్లిష్‌లోనే ఉంది. బాల్యంలోనే ఏ భాషపైన అయినా పట్టు సాధించవచ్చని భాషాశాస్త్రం శాస్త్రీయంగా నిరూపించింది. కాబట్టి విద్యార్థులకు బాల్యం నుంచే ఇంగ్లిష్ నేర్పించాలి. ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలో సాగితేనే విద్యార్థుల మనోవికాసం సరిగా ఉంటుందనే వాదన సరికాదు. మాతృభాషలో ప్రాథమిక విద్యను అభ్యసించి ఉన్నత విద్యను ఇంగ్లిష్‌లో అభ్యసిస్తే విద్యార్థులు సరైన విజ్ఞానాన్ని పొందలేరు. కొంతమంది రాద్ధాంతానికి అర్థం లేదు ఇంగ్లిష్ మీడియంతో తెలుగు భాష ప్రాభవానికి, ఉనికికి ఎలాంటి ముప్పూ లేదు. ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే తెలుగు భాష వైభవాన్ని కోల్పోతోందని కొందరు చేస్తున్న రాద్ధాంతానికి అర్థం లేదు. దీని వెనుక కార్పొరేట్ విద్యా సంస్థల హస్తం ఉంది. ఇంగ్లిష్ మీడియం లేదా వేరే మీడియం విద్యా బోధనతో ప్రపంచంలో ఒక మాతృభాష మృతభాషగా మారిపోయినట్టు ఇంతవరకు నిర్ధారణ కాలేదు. స్వాతంత్య్రానికి పూర్వం హైదరాబాద్ సంస్థానంలో 400 ఏళ్లకుపైగా ఉర్దూనే అధికారిక భాషగా, బోధన భాషగా సాగింది. అందరూ ఉర్దూ మీడియంలోనే చదువుకునేవారు. అయితే.. హైదరాబాద్‌తో సహా తెలంగాణలో తెలుగు భాష ఉనికికి, సాహితీ వైభవానికి ఏ మాత్రం భంగం కలగలేదు. కర్ణాటకలో తుళు భాషకు లిపి లేదు.. దాన్ని కన్నడంలోనే రాస్తారు. అయినా ఆ భాష వందల ఏళ్లుగా ప్రాభవాన్ని కోల్పోకుండా ఉంది. అలాంటిది.. 2 వేల ఏళ్లకుపైగా చరిత్ర, ఘన సాహితీ వారసత్వం, ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మందికి మాతృభాష అయిన తెలుగు ఉనికి, వైభవం ఎందుకు కోల్పోతుంది?.. అని ప్రతాప్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారు. -
ఆశ.. నిరాశ..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్ టికెట్ల పంపిణీ వ్యవహారం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఒకరే పోటీపడుతున్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను తొలి జాబితాలోనే ప్రకటించిన ఆ పార్టీ.. మలి విడత జాబితాపై మాత్రం సస్పెన్స్ కొనసాగిస్తోంది. భాగస్వామ్య పక్షాల ఒత్తిడి, సామాజిక సమతూకం, ఇతరత్రా అంశాలు అభ్యర్థుల ఖరారుపై ప్రభావం చూపుతున్నాయి. వికారాబాద్ జిల్లాలోని మొత్తం స్థానాలకు, మేడ్చల్‌లో కేవలం కుత్భుల్లాపూర్ సెగ్మెంట్, రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం, కల్వకుర్తి, చేవెళ్ల నియోజకవర్గాలకు అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం సోమవారం రాత్రి ఖరారు చేసింది. మిగతా సెగ్మెంట్ల విషయంలో మహాకూటమి భాగస్వామ్య పక్షాల నుంచి అభ్యంతరాలు, డిమాండ్లు వస్తుండడంతో పెండింగ్‌లో పెట్టింది. ఈ నేపథ్యంలో పెండింగ్ స్థానాల విషయంలో ఆయా పార్టీలు పెడుతున్న మడత పేచీతో కాంగ్రెస్ తలబొప్పికడుతోంది. ముఖ్యంగా టీడీపీ ప్రతిపాదిస్తున్న సీట్లపై పీటముడి నెలకొంది. నిన్నటి వరకు కేవలం మూడు స్థానాలకే తెలుగుదేశం పరిమితమవుతుందన్న చర్చలు కాస్తా తాజాగా మరిన్ని నియోజకవర్గాలకు పాకడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఇబ్రహీంపట్నం కూడా.. ఇప్పటికే ఉప్పల్, శేరిలింగంపల్లి స్థానాలు టీడీపీ ఖాతాలో చేరిపోయాయి. వీటికి ఆ పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించింది. కాగా, తాజాగా కూకట్పల్లి, రాజేంద్రనగర్, ఎల్బీనగర్ లేదా ఇబ్రహీంపట్నం సీటును కూడా సర్దుబాటు చేయాలని తెలుగుదేశం ఒత్తిడి పెంచింది. ఢిల్లీ స్థాయిలో ఆ పార్టీ అధినాయకత్వం కాంగ్రెస్ హైకమాండ్‌కు ఈమేరకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. దీంతో రాజకీయ సమీకరణలు దాదాపుగా మారిపోతున్నాయి. సీట్ల పంపకాలలో కూకట్‌పల్లిని టీడీపీకి వదలాలని మొదట్నుంచి కాంగ్రెస్ అనుకుంటోంది. మరోవైపు సబిత తనయుడు కార్తీక్‌రెడ్డి ఆశిస్తున్న రాజేంద్రనగర్ సీటుకు కూడా టీడీపీ ఎసరు తెస్తోంది. ఇప్పటికే ఒక కుటుంబానికి ఒకటే టికెట్ నిబంధనతో కార్తీక్‌కు ముప్పు పొంచి ఉండగా.. తాజా పరిణామం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇదిలాఉండగా, ఎల్బీనగర్ స్థానంపై టీడీపీ గట్టిగా పట్టుపడుతోంది. ఈ స్థానం నుంచి సామ రంగారెడ్డిని బరిలో దించాలని కృతనిశ్చయంతో ఉంది. అయితే ఈ సెగ్మెంట్‌ను మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి బలంగా ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లో వదలుకోవద్దని కాంగ్రెస్ భావిస్తోంది. ఒకవేళ పొత్తులో ఈ సీటు దక్కకపోతే ఇబ్రహీంపట్నం సీటును అడగాలని దేశం నాయకత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా ప్రతిపాదనలను ఏఐసీసీ ముందుంచుంది. ఈ సెగ్మెంట్ నుంచి సామ రంగారెడ్డి లేదా రొక్కం భీంరెడ్డిని బరిలోకి దించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ తాజా పరిణామాలు కాంగ్రెస్ ఆశావహులను ఆత్మరక్షణలో పడేసింది. ఈ సీటును ఆశిస్తున్న డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్‌కు, మల్రెడ్డి బ్రదర్స్‌కు మింగుడుపడడంలేదు. ప్రతాపరెడ్డికీ డౌటేనా..? షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి అభ్యర్థిత్వం కూడా కష్టమేనని తెలుస్తోంది. మొదటి జాబితాలోనే ఆయన పేరు ఉంటుందని భావించినా.. పెండింగ్ పెట్టడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది. షాద్‌నగర్ నుంచి కాంగ్రెస్ తరపున బలమైన అభ్యర్థిగా కేవలం ప్రతాపరెడ్డే ఉన్నారు. ఒకరే పోటీపడుతున్న స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధినాయకత్వం ఈ సెగ్మెంట్‌ను పక్కన పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ స్థానాన్ని టీజేఎస్‌కు ఇచ్చే అంశంపై కూడా పరిశీలన జరుగుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ వీర్లపల్లి శంకర్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. టీజేఎస్ టికెట్ కోసం తెరవెనుక మంతనాలు సాగిస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే ప్రతాపరెడ్డి పేరును పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. కిచ్చెన్నకు ఇచ్చేనా..? మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆశిస్తున్న మేడ్చల్ టికెట్‌పై ఇంకా స్పష్టత రావడంలేదు. ఈయన అభ్యర్థిత్వానికి పీసీసీ ముఖ్యులు మోకాలడ్డుతున్నట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయనపై ఏఐసీసీకి నివేదిక సమర్పించిన పీసీసీ పెద్దలు టికెట్ రాకుండా పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్‌రెడ్డితో పాటు పార్టీలో చేరిన తోటకూర జంగయ్యయాదవ్‌కు టికెట్ దక్కేలా సామాజిక సమతుల్యతను తెరమీదకు తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు వీరిరువురికి కాకుండా టీజేఎస్ కోటాలో మేడ్చల్‌ను కేటాయిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. -
‘దేశం’ డీలా.. పార్టీకి లీడర్ లేడు.. కేడరూ లేదు..!
జిల్లాలో సుమారు రెండు దశాబ్దాల పాటు బలమైన రాజకీయ శక్తి. సర్పంచ్‌లు, ఎంపీపీలు మొదలుకుని ఎమ్మెల్యే, ఎంపీ దాకా ఆ పార్టీ నేతలే రాజ్యమేలారు. 2004, 2009 సాధారణ ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ వ్యూహంతో చావు దెబ్బ తగిలింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేపథ్యంలో క్రమంగా ప్రాభవాన్ని కోల్పోయి కనుమరుగైంది. ఇప్పుడా పార్టీకి లీడర్ లేడు.. కేడరూ లేదు.. మిగిలిందల్లా ఒకరిద్దరు సొంత బలం కలిగిన నేతలు. వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల నాటికి.. మిగిలిన ఆ ఒకరిద్దరూ పార్టీలో ఉంటారా..? వేరే దారి చూసుకుంటారా..? ఇదీ ఉమ్మడి మెదక్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. – సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పార్టీ ఆవిర్భావం నుంచి సుమారు రెండు దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో బలీయమైన శక్తిగా నిలిచింది. ప్రస్తుత సీఎం కేసీఆర్‌తో పాటు అనేక మందికి రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది. ఎంతో మంది నేతలు, కార్యకర్తలు గ్రామస్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు అనేక పదవులు దక్కించుకున్నారు. 2004 సాధారణ ఎన్నికల్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వ్యూహంతో అసెంబ్లీ, పార్లమెంటులో జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ పక్షాన ఒక్కరికీ ప్రాతినిధ్యం దక్కలేదు. క్షేత్ర స్థాయిలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఉన్నా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో చాలా మంది టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. 2009 సాధారణ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ స్థానం మినహా ఎక్కడా టీడీపీ విజయం సాధించలేదు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో నలుగురు జెడ్పీటీసీ సభ్యులు, 102 మంది ఎంపీటీసీ సభ్యులు ఎన్నికయ్యారు. ఆ తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు ఊపందుకోవడంతో ప్రస్తుతం కేవలం పటాన్చెరు జెడ్పీటీసీ సభ్యుడు శ్రీకాంత్‌గౌడ్ మాత్రమే పార్టీలో మిగిలారు. జహీరాబాద్, నారాయణఖేడ్, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకరిద్దరు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు పార్టీలో కొనసాగుతున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో టీటీడీపీ కార్య నిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి బట్టి జగపతి, శశికళ యాదవరెడ్డి తదితరులు కాంగ్రెస్‌లో చేరారు. మిగిలింది ఒకరిద్దరు నేతలే! ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో సొంత శక్తి కలిగిన ఒకరిద్దరు నేతలే మిగిలారు. దశాబ్దకాలంగా పార్టీ నుంచి టీఆర్ఎస్, కాంగ్రెస్‌లోకి వలసలు సాగుతున్న నేపథ్యంలో.. సాధారణ ఎన్నికల నాటికి వీరిలో ఎవరు పార్టీలో ఉంటారో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. దుబ్బాక, నర్సాపూర్, సంగారెడ్డి, అందోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చెప్పుకోదగిన నాయకులు లేకపోవడం పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా గుండు భూపేశ్ వ్యవహరిస్తుండగా, మాజీ కౌన్సిలర్ దరిపల్లి చంద్రం వంటి ఒకరిద్దరు మాత్రమే ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలేవీ నిర్వహించే పరిస్థితి లేదు. 2009 సాధారణ ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌పై పోటీ చేసిన ఒంటేరు ప్రతాప్‌రెడ్డి టీడీపీలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ప్రతాప్‌రెడ్డి భవిష్యత్తు రాజకీయ ప్రస్థానంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం సాగింది. ఇటీవల సుమారు నెల రోజుల పాటు జైలులో గడిపిన ప్రతాప్‌రెడ్డి విడుదల అనంతరం ఒకటి రెండు గ్రామాల్లో పర్యటించి.. ఆ తర్వాత స్తబ్దుగా ఉంటున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఇల్లెందుల రమేశ్ మినహా.. పార్టీ పేరు చెప్పుకునే కార్యకర్తలు కూడా కనిపించడం లేదు. పార్టీ దాదాపు తుడిచి పెట్టుకుపోయిన పరిస్థితి నియోజకవర్గంలో కనిపిస్తోంది. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్ బట్టి జగపతి.. రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఏకే గంగాధర్‌రావు పల్లెపల్లెకూ టీడీపీ పేరిట పార్టీ ఉనికిని చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. నర్సాపూర్ అసెంబ్లీ నియోజవర్గంలో హత్నూర మండలం దేవులపల్లికి చెందిన రఘువీరారెడ్డి టీడీపీ నేతగా చెలామని అవుతున్నా.. పార్టీ కార్యకలాపాలేవీ జరగడం లేదు. పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ అవిర్భావం నుంచి టీడీపీ బలమైన శక్తిగా ఉన్నా.. వలసల మూలంగా బలహీన పడింది. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సపానదేవ్ టీఆర్ఎస్లో చేరగా, పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేసిన శశికళ యాదవరెడ్డి.. రేవంత్‌తో పాటు కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్‌లో టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక జెడ్పీటీసీ సభ్యుడు గడీల శ్రీకాంత్‌గౌడ్ జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా మారారు. పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న శ్రీకాంత్‌గౌడ్ త్వరలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగానూ నియమితులయ్యే అవకాశం ఉంది. శ్రీకాంత్‌గౌడ్‌తో పాటు ఎడ్ల రమేశ్, మాణిక్యప్రభు వంటి ఒకరిద్దరు నేతలు పార్టీలో కొనసాగుతున్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో టీడీపీ పూర్తి నిస్తేజంగా మారగా, జెడ్పీ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, బందన్న గౌడ్ వంటి ఒకరిద్దరు నేతలు నామ్‌కే వాస్తేగా కొనసాగుతున్నారు. అందోలు నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయి నేత శ్రీశైలం ఇన్చార్జిగా కొనసాగుతున్నా పార్టీ కార్యకలాపాలేవీ సాగడం లేదు. 2009, 2014 సాధారణ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నరోత్తమ్ పల్లెపల్లెకూ టీడీపీ పేరిట పార్టీ ఉనికిని చాటే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన గుండప్ప, దశరథరెడ్డి పార్టీలో ఉన్నా.. క్రియాశీల కార్యక్రమాల్లో అరుదుగా కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసిన మదన్మోహన్ రావు పార్టీ పరంగా ఎక్కడా కనిపించడం లేదు. మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌రెడ్డి నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఉనికిని కాపాడే ప్రయత్నం చేస్తున్నా.. 2016లో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా జరిగిన వలసలు పార్టీని పూర్తిగా బలహీన పరిచాయి. సిద్దిపేట జిల్లాలో అంతర్భాగంగా ఉన్న చేర్యాల, హుస్నాబాద్, బెజ్జంకి ప్రాంతాల్లోనూ టీడీపీ నామ మాత్ర ఉనికి కూడా కనిపించడం లేదు. -
బీజేపీకి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి రాజీనామా
హైదరాబాద్: బీజేపీ జనగామ నియోజక వర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు. జనగామ ప్రజలు, అభిమానుల ఒత్తిడి మేరకే తానీ నిర్ణయం తీసుకున్నా నని ఆయన ప్రకటించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన రాజీ నామా పత్రాన్ని ప్రదర్శించారు. పార్టీలో క్రమశిక్షణ లోపించడం వల్ల బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు కొమ్మూరి తెలి పారు. అన్ని మండలాల ముఖ్య నాయ కులూ తన బాటలోనే నడవనున్నట్లు తెలిపారు. ఏ పార్టీలో చేరుతారని విలేక రులు అడిగిన ప్రశ్నకు.. ప్రజల అభీష్టం మేరకే నడుచుకుంటానని బదులిచ్చారు. మంత్రి హరీశ్‌ను కేవలం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకే కలిశానని, రాజకీయ చర్చ జరగలేదని పేర్కొన్నారు. -
కావలి కాలువ సంగతేంటి?
కావలి కాలువ గురించి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీశారు. పంటలు ఎండిపోతున్నాయని, కావలి కాలువకు 1,200 క్యూసెక్కుల నీరు ఇచ్చేలా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి సీఎంను డిమాండ్ చేశారు. పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలంటే పెండింగ్‌లో ఉన్న పనులకు వెంటనే అటవీ అనుమతులు ఇప్పించాలని కోరినట్లు తెలిసింది. అదేవిధంగా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి నడికుడి-శ్రీకాళహస్తి రైల్యే పనులు పూర్తయితే నియోజకవర్గంతో పాటు జిల్లా అభివృద్ధి చెందుతుందని కోరారు. అదేవిధంగా సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి హైలెవల్ కెనాల్ ఫేజ్-2 పనులు త్వరగా పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. ఇంకా లైనింగ్ నార్త్ ఫీడర్, సౌత్ ఫీడర్ కెనాల్స్ పూర్తిచేస్తే ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు సాగు, తాగునీటి సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయని కోరారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇంకా స్థానికంగా ఉన్న పలు సమస్యలపై సీఎంకు వివరించినట్లు సమాచారం. అంతకు ముందు జిల్లా అధికారయంత్రాంగం పలు కార్యక్రమాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అధికారులు, ఎమ్మెల్యేలు పలు సమస్యలపై నివేదికలు ఇచ్చినా ఫలితం లేకపోయిందని అధికారవర్గాలు వెల్లడించాయి. అందరు చెప్పినవి విని పొదుపు మంత్రం చెప్పి వెళ్లిపోయినట్లు తెలిసింది. -
ఔరా..!
నంద్యాల టౌన్ : నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు.. అన్నట్లుగా ఉంది నంద్యాలలోని పోలీసు అధికారుల తీరు. నంద్యాలలో కొత్తగా నిర్మించిన త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌ను ఏడాది క్రితం అధికారులు ప్రారంభించారు. అప్పటి నుంచి స్టేషన్లో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. కానీ హోం శాఖ మంత్రి చిన్నరాజప్ప మెప్పు పొందడానికి పోలీస్ అధికారులు మళ్లీ ఈనెల 8వ తేదీన ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు. బొమ్మలసత్రం సమీపంలోని డీఎస్పీ బంగ్లా వద్ద త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌ను రూ.60 లక్షల వ్యయంతో నిర్మించారు. 2013 మార్చి నాటికి పనులు పూర్తయ్యాయి. దీన్ని అప్పటి మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డితో ప్రారంభించాలని అధికారులు ఏర్పాట్లు చేసినా చివరి నిమిషంలో వాయిదా పడింది. ఎన్నికలు సమీపించడంతో స్టేసన్ అవసరం ఏర్పడింది. దీంతో అధికారులు స్టేషన్‌ను ప్రారంభించి కార్యకలాపాలు మొదలుపెట్టారు. ఏడాది నుంచి స్టేషన్ పని చేస్తూనే ఉంది. ఏఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ పలుమార్లు మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించారు. కానీ హోం మంత్రి జిల్లా పర్యటనకు వస్తుండడంతో మళ్లీ ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 8వ తేదీ మధ్యాహ్నం మంత్రి స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. ఏడాది నుండి నడుస్తున్న స్టేషన్‌ను హోంమంత్రితో ప్రారంభిస్తుండటంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. పర్యటన ఖరారు.. హోంమంత్రి చిన్నరాజప్ప నంద్యాల పర్యటన ఖరారైందని త్రీటౌన్ సీఐ దైవప్రసాద్ తెలిపారు. ఆయన 8వ తేదీ మధ్యాహ్నం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారని, తర్వాత దొర్నిపాడుకు వెళ్లి అక్కడ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారని చెప్పారు. అదే రోజు రాత్రి నంద్యాల చేరుకొని అమరావతి ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడకు వెళ్తారని తెలిపారు. -
డీఈఓ ఇచ్చిన హామీలు
2013లో మూడో స్థానం.. 2014లో రెండో స్థానం.. 2015లో అగ్రస్థానం వచ్చేలా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.. పదవతరగతి పరీక్షా ఫలితాలలో గతంలో కంటే మెరుగైన స్థానంలో ఉండేలా డీఈఓ ప్రతాపరెడ్డి ఉపాధ్యాయులు, సిబ్బందికి మార్గ నిర్ధేశనం చేస్తున్నారు.. పాఠశాలల్లో మౌలికవసతులు ఎలా ఉన్నాయన్న విషయాలను పరిశీలించేందుకు వీఐపీ రిపోర్టర్‌గా మారారు.. ప్రొద్దుటూరులోని నడింపల్లె మున్సిపల్ హైస్కూల్‌ను తనిఖీ చేశారు..పాఠాలకు సంబంధించిన ప్రశ్నలను అడిగి విద్యార్థుల నుంచి సమాధానాలను రాబట్టారు.. తానూ పాఠాలు చెప్పారు.. పాఠశాలలను అభివృద్ధిపథంలో నడిపించడమే తన ధ్యేయమని పేర్కొన్నారు. డీఈఓ ప్రతాప్‌రెడ్డి: మీ పాఠశాలల్లో పదో తరగతికి సంబంధించి సబ్జెక్టులు పూర్తయ్యాయా? విద్యార్థి (మహ్మద్ ఇమ్రాన్): అన్ని సబ్జెక్టులల్లో దాదాపు 85 శాతం పూర్తయ్యాయి. మళ్లీ టీచర్లు కొన్ని సబ్జెక్టులను రివిజన్ చేస్తున్నారు. డీఈఓ: భవిష్యత్తు శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ఇన్స్పైర్ కార్యక్రమాలు నిర్వహించారా? ఎలా చేస్తే బాగుంటుంది, ఎక్కడికైనా వెళ్లారా? ఫర్హిన్: మా పాఠశాలలో ఇంకా నిర్వహించలేద్సార్. పలు చోట్ల నిర్వహించిన ఇన్స్పైర్ కార్యక్రమాలకు వెళ్లాం. మేధావులు చెబుతున్న వాటిని ఆలకించడం ద్వారా మాలో కొంత స్ఫూర్తి పెరుగుతోంది. ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం. డీఈఓ: పదో తరగతిలో మొత్తం ఎంత మంది ఉన్నారు... ఇంగ్లీషు మీడియమా.. తెలుగు మీడియమా... గణితంలో త్రికోణమితి గురించి తెలుసా? ఖాదర్‌వల్లి: పాఠశాలల్లో మొత్తం 76 మంది విద్యార్థులు ఉన్నాం. అందులో ఏ సెక్షన్, బీ సెక్షన్ కింద విభజించి చదువు బోధిస్తున్నారు. ఇంగ్లీషు మీడియం, తెలుగు మీడి యం వేర్వేరుగా నిర్వహిస్తున్నా రు. త్రికోణమితి గురించి తెలుసు సార్. ఇప్పటికే త్రికోణమితికి సంబంధించిన అధ్యాయం కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో డీఈఓ త్రికోణమితి అధ్యాయంలోని సైన్ టీటా, కాస్ టీటాకు సంబంధించిన ఒక లెక్కను విద్యార్థులకు సులభరీతిలో బోర్డుపై బోధిస్తూ వివరించారు. డీఈఓ: తెలుగులో సందులు, సమాసాలు వచ్చా? సోషియల్‌లో మ్యాప్ పాయింట్లో అరేబియా సముద్రం ఎక్కడ ఉంది? స్పోర్ట్స్‌లో ఎవరైనా రాణించారా? ఖలందర్: సందులు, సమాసాలు తెలుసు సార్ (సవర్ణదీర్ఘ సంది గురించి వివరిస్తూ). సోషియల్ మ్యాప్‌లో అరేబియా సముద్రాన్ని చూపించిన అనంతరం స్పోర్ట్స్‌లో కబడ్డీలో మంచి ప్రతిభకనబరిచా. డీఈఓ: కొన్ని చోట్ల విద్యార్థుల పట్ల ఆకతాయిల వేధింపులు, ఇతర సమస్యలు ఎదురవుతున్నాయి. మీకేమైనా సమస్యలు ఎదురవుతున్నాయా? రేష్మా: ఇంటి నుంచి పాఠశాలకు వస్తున్నప్పుడు కానీ, లేదా ఇక్కడ కానీ మాకు ఎలాంటి సమస్యలు లేవు. ఏదైనా ఇబ్బంది జరిగినా ఇటు తల్లిదండ్రులకుగానీ, ఉపాధాయులకైనా ధైర్యంగా చెబుతాం. డీఈఓ: గత మూల్యాంకణ విధానానికి ప్రస్తుత విధానానికి తేడాలు ఉన్నాయి, మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా? ఆఫ్రిన్: అంతా దగ్గర దగ్గర ఒక్కటే కాబట్టి పెద్దగా సమస్య ఎదురుకాలేదు. పైగా సబ్జెక్టులను పూర్తి చేసుకుని మరో మారు బోధిస్తుండటంతో సమస్య ఉత్పన్నం కాలేదు. డీఈఓ: బాబు నీవు ఏం కావాలనుకుంటున్నావు? పవన్‌కుమార్: సార్ నేను క్రికెటర్ కావాలని ఆశ. బ్యాట్స్‌మెన్‌గా దేశస్థాయిలో ఆడాలని ఉంది. అదే నా ఆశయం. గతంలో కోచింగ్ కూడా తీసుకున్నా. డీఈఓ: (సమీపంలో కూర్చున్న విద్యార్థిని ఉద్దేశించి) చిన్నా నీ లక్ష్యం ఏమిటి? హరికృష్ణ: ఇంజనీర్ కావాలన్నదే నా లక్ష్యం సార్. గతంలో ఈ పాఠశాలలో చదివిన కొంత మంది ఉన్నత స్థానంలో ఉన్నారు. వారి స్ఫూర్తితోనే నేను ఇంజనీర్ లేదా శాస్త్రవేత్తగా అవ్వాలన్నదే సంకల్పం. డీఈఓ: ఎగ్జామ్స్ వస్తున్నాయి ప్రిపేర్ అవుతున్నారా? ఏమైనా టెన్షన్ పడుతున్నారా? ఖయ్యుం: కొంచెం భయంగా ఉంది సార్. కష్టపడి చదువుతున్నా. పైగా స్టడీ అవర్స్ కూడా నిర్వహిస్తున్నారు. రోజు కనీసం 3, 4 గంటలు చదువుతున్నా. మంచి గ్రేడ్ తెచ్చుకుంటానన్న నమ్మకం నాకుంది. డీఈఓ: కంప్యూటర్లు ఉన్నాయి, ఆపరేటింగ్ ఎవరెవరికి వస్తుంది? ప్రవల్లిక: పదో తరగతి విద్యార్థులలో చాలా మందికి కంప్యూటర్ నేర్పించారు. ప్రత్యేకంగా సిబ్బంది ఉండటం వల్ల దాదాపు అందరు నేర్చుకున్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా తెలుసు. డీఈఓ: ప్రతి రోజు పీఈటీ క్లాసు కేటాయిస్తున్నారా? సాంస్కృతిక విభాగాల్లో రాణించిన వారు ఎవరైనా ఉన్నారా? బాలవెంకటసుబ్బయ్య: ప్రతి రోజు ఏదో ఒక సమయంలో ఆడుకోవడానికి సమయం ఇస్తారు. కాకపోతే మైదానం లేదు. సమీప ప్రాంతాల్లోకి వెళ్లి ఆడుకుంటాం. నేను పాటలు బాగా పాడుతా. (‘మానవుడా దానవుడా’ పాట పాడుతూ..) డీఈఓ: (సమీపంలో ఉన్న హెడ్మాస్టర్ను ఉద్దేశించి) పాఠశాలకు సంబంధించి సౌకర్యాల కల్పనకు ఎవరైనా దాతలు ముందుకు వచ్చారా? హెడ్మాస్టర్ మునిచంద్రారెడ్డి: పాఠశాలకు సంబంధించి స్థానికంగా ఉన్న దాత ఇన్వర్టర్ అందజేశారు. మరికొంతమంది దాతలు పాఠశాలకు అవసరమైన టేబుళ్లు, ఇతర సామాగ్రి అందించారు. డీఈఓ: రాత్రి సమయంలో ఎంత సేపు చదువుతారు? సీరియల్స్ ఎంతమంది చూస్తారు? మహబూబ్‌బాష: సీరియల్స్ చూడం సార్. రాత్రి సమయంలో 8 నుంచి 9.30 గంటల వరకు చదువుకుంటాం. మళ్లీ తెల్లవారుజామున కూడా చదువుకోవడం అలవాటు. (నిజమా అబద్దమా అని తెలుసుకునేందుకు డీఈఓ తల్లిదండ్రులతో మాట్లాడి నిర్ధారణ చేసుకున్నారు.) ఆయనేమన్నారంటే.. మారుమూల పల్లెటూర్ల నుంచే విద్యా కుసుమాలు విరబూసేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి భవిష్యత్తు తరాలు ఆశ్యర్యపరిచేలా కడప నుంచే శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను తయా రు చేస్తాం.. ప్రత్యేకంగా విద్యార్థులు ఎలా చదువుతున్నారో పరిశీలించడంతోపాటు ఇంటి దగ్గరికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడేలా ‘నైట్‌విజన్’ అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రధానోపాధ్యాయులతో మానిటరింగ్ చేయిస్తున్నాం. 10 లో గతంలో కంటే కూడా అత్యుత్తమ మార్కులతోపాటు ర్యాంక్‌లను సాధించేలా ఇప్పటి నుంచే కృషి చేస్తున్నాం. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నాం. -
మాయం
బ్రహ్మంగారిమఠం: ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా 145 పాస్ పుస్తకాలు మాయం అయ్యాయి. మండలంలో ఈ విషయం చర్చనీయాంశమైంది. రేకులకుంట గ్రామ పంచాయితీ పరిధిలోని జెడ్.కొత్తపల్లె గ్రామంలో ప్రభుత్వ బంజరు భూమి పట్టాలు పొందిన లబ్ధిదారులకు సంబంధించిన 145 పట్టాదారు పాసుపుస్తకాలు స్థానిక వీఆర్ఓ ప్రతాప్‌రెడ్డి స్వాధీనంలో ఉండేవి. మూడు రోజుల క్రితం రెవెన్యూ కార్యాలయంలోని ఆయన ట్రంకుపెట్టెలో నుంచి ఇవి మాయమైనట్లు సమాచారం. ఇవి చోరీకి గురయ్యాయా.. లేక మాయం చేశారా అనేది తెలియాల్సి ఉంది. బ్రహ్మంసాగర్ ముంపు గ్రామాలకు చెందిన వారికి డీకేటీ పట్టాలు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన లబ్ధిదారులకు ఇవ్వటానికి పట్టాదారు పాసుపుస్తకాలు సిధ్దం చేశారు. భూములు చూపించిన అనంతరం పాసుపుస్తకాలు పంపిణీ చేసేందుకు తహశీల్దార్ సుబ్బరామయ్య సిద్ధంగా ఉండగా ఒక్కసారిగా ఇవి మాయమయ్యాయి. -
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం
కోల్‌సిటీ, న్యూస్‌లైన్: హైదరాబాద్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గోదావరిఖనిలోని ఎల్బీనగర్కు చెందిన ఒకరు మృతిచెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా బీటెక్ చదువుతున్నారు. ఎల్బీనగర్లో ఫొటో, వీడియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న సిగిరి ప్రతాప్‌రెడ్డి కుమారుడు సాయిచరణ్(21) హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చాడు. వీరి ఇంటి సమీపంలోనే అభిషేక్‌రాజ్, హరీశ్ నివసిస్తున్నారు. అభిషేక్‌రాజ్ నల్గొండలో, హరీశ్ హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చదువుతున్నారు. వీరు కూడా ఓటు వేసేందుకు ఇంటికొచ్చారు. ప్రాజెక్ట్ వర్క్ ఉందని గోదావరిఖని నుంచి శనివారం ఉదయమే సంపర్క్క్రాంత్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లేందుకు ముగ్గురు రామగుండం రైల్వేస్టేషన్‌కు వెళ్లి అక్కడినుంచి హైదరాబాద్ వెళ్లారు. వీరు ముగ్గురూ హైదరాబాద్‌లో ఒకే బైక్‌పై, ఈసీఐఎల్ ప్రాంతంలోని రోడ్డుపై ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. సాయిచరణ్ అక్కడికక్కడే మృతిచెందగా, హరీశ్, అభిషేక్‌రాజ్ తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసి ముగ్గురు విద్యార్థుల కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌కు వెళ్లారు. విషాదంలో సాయిచరణ్ కుటుంబ సభ్యులు సాయిచరణ్ మృతితో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ప్రతాప్‌రెడ్డి శనివారం భూపాలపల్లిలో ఓ వేడుకకు వీడియో,ఫొటోలు తీసేందుకు వెళ్లాడు. హైదరాబాద్ వెళ్తున్నా నని చెప్పిన కొడుకు రైలు దిగాక తండ్రికి ఫోన్ చేశాడు. ఇంతలోనే కొడుకు చనిపోయాడని తెలియడంతో ప్రతాప్‌రెడ్డి షాక్‌కు గురయ్యాడు. కెనడాలో ఉంటున్న పెద్దకొడుకు మహేందర్‌రెడ్డి కూడా ఈ విషయం తెలిసి హైదరాబాద్ బయలుదేరాడు. -
జాతీయ కరాటే క్రీడాకారుల ఎంపిక
నెల్లూరు (బృందావనం), న్యూస్‌లైన్: అంతర్జాతీయ కుంగ్-పూ, కరాటే పోటీ ల్లో పాల్గొనే జాతీయస్థాయి క్రీడాకారుల ఎంపిక నెల్లూరులో జరిగింది. షొవొలిల్ టెంపుల్ కుంగ్-పూ స్కూల్ ఇండియా రాష్ర్టశాఖ ఆధ్వర్యంలో స్థానిక మనుమసిద్ధినగర్లోని తీర్థహైస్కూల్లో ఆదివా రం నేషనల్ ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్-14 పోటీలు నిర్వహించారు. పోటీలను వికాస్ స్కూల్ కరస్పాండెంట్ కర్తం ప్రతాప్‌రెడ్డి ప్రారంభించారు. ని ర్వాహకుడు మాస్టర్ ప్రభాకర్ మాట్లాడు తూ అసోం, అరుణాచలప్రదేశ్, రాజ స్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ తదితర 17 రాష్ట్రాల నుంచి 315 మంది క్రీడాకారులు ఎంపికలకు హాజరయ్యారన్నారు. 18 నుంచి 70 కిలోల విభాగం లో ఎంపికలు నిర్వహించామన్నారు. వి జేతలుగా నిలిచిన వారు నవంబర్ 23, 24 తేదీల్లో జరిగే టోర్నీలో పాల్గొంటారన్నారు. విజేతలకు పెనుబల్లి చంద్రశేఖరరెడ్డి, ఎం.సాయికుమారి, శ్రీనివాసులు, ద్వారకానాథ్ బహుమతులు అందచేశారు. న్యాయనిర్ణేతలుగా కరాటే మా స్టర్లు దత్త, ఉదయ్, పృధ్వీ, బాలాజీ, ఎ లెంగో వ్యవహరించారు. టోర్నీలో 18-21 కిలోల విభాగంలో టి.తేజ, కళ్యాణ్, సొహెల్, 22-25 కిలోల విభాగంలో ఎండి.సినాన్, సూర్య, తాహిల్, 26-30కిలోల విభాగంలో రాకేష్, ప్రేమ్‌కుమార్, ఆలీ మొదటి మూడుస్థానాల్లో నిలిచారని ప్రభాకర్ తెలిపారు. -
అంతా...హస్తినకు...!
పునర్విభజన అంకం జిల్లా రాజకీయాలనూ రసవత్తరంగా మారుస్తోంది. బిల్లు ‘ఢిల్లీ’కి వెళ్లడంతో అక్కడి కథ ఏమిటో తెలుసుకునేందుకు ఇక్కడి నేతలూ ‘చలో హస్తిన’ అంటూ కదిలారు. ఇందులో కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముందుండగా ఇతర పక్షాల వారు తామూ ఉన్నామని అంటున్నారు. తెలుగు తమ్ముళ్లు మాత్రం జిల్లాకో, రాజధానికో పరిమితమై ‘బాబు’పై భారం వేసి తమ కార్యక్రమాల్లో తిరుగుతున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రాష్ట్ర పునర్విభజన బిల్లు ఢిల్లీకి చేరుకోవడంతో జిల్లా నేతలందరూ దేశ రాజధాని బాట పట్టారు. బిల్లుకు మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నట్లు చెప్తున్నారు. మంత్రి డీకే అరుణతో పాటు షాద్‌నగర్ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం మూడు రోజులగా ఢిల్లీలోనే మకాం వేశారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ ఎంపీ కేసీఆర్‌తో పాటు మరో ఎంపీ జగన్నాథం, పార్టీ ఏకైక ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు జాతీయ పార్టీల నేతలను కలుస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉండగా, నాగం జనార్దన్ రెడ్డి రెండు రోజుల కిందటే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఓ వైపు సీమాంధ్ర ప్రాంత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు దేశ రాజధానిలో చంద్రబాబుతో కలిసి హడావుడి సృష్టిస్తున్నారు. జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఒకరిద్దరు మినహా మిగతా ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనో, సొంత నియోజకవర్గంలోనో గడుపుతున్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ హస్తినలో ఉండగా, మిగతా ఎమ్మెల్యేలు ఎం.చంద్రశేఖర్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కొత్తకోట దయాకర్‌రెడ్డి, సీత, రేవంత్‌రెడ్డి, ఎల్లారెడ్డి స్థానిక కార్యక్రమాల్లో పొల్గొంటున్నారు. నేడు తిరుగుముఖం? రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో అన్ని పార్టీలు అభ్యర్థులను నిలపడంతో ఫిబ్రవరి 7వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. ఆరు రాజ్యసభ స్థానాలకు గాను ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలవడంతో ఓటింగ్ అనివార్యంగా మారింది. దీంతో ఓటింగ్‌లో పాల్గొనేందుకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రానికల్లా హైదరాబాద్‌కు చేరుకునే ప్రయత్నాల్లో వున్నారు. రాజ్యసభ ఎన్నికల పోలింగ్ తర్వాత తిరిగి పరిస్థితులను బట్టి ఢిల్లీకి వెళ్లేది లేనిదీ తేల్చుకుంటామని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు ప్రకటించారు.