నంద్యాల టౌన్ : నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు.. అన్నట్లుగా ఉంది నంద్యాలలోని పోలీసు అధికారుల తీరు. నంద్యాలలో కొత్తగా నిర్మించిన త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌ను ఏడాది క్రితం అధికారులు ప్రారంభించారు. అప్పటి నుంచి స్టేషన్‌లో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. కానీ హోం శాఖ మంత్రి చిన్నరాజప్ప మెప్పు పొందడానికి పోలీస్ అధికారులు మళ్లీ ఈనెల 8వ తేదీన ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు. బొమ్మలసత్రం సమీపంలోని డీఎస్పీ బంగ్లా వద్ద త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌ను రూ.60 లక్షల వ్యయంతో నిర్మించారు. 2013 మార్చి నాటికి పనులు పూర్తయ్యాయి.
దీన్ని అప్పటి మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డితో ప్రారంభించాలని అధికారులు ఏర్పాట్లు చేసినా చివరి నిమిషంలో వాయిదా పడింది. ఎన్నికలు సమీపించడంతో స్టేసన్ అవసరం ఏర్పడింది. దీంతో అధికారులు స్టేషన్‌ను ప్రారంభించి కార్యకలాపాలు మొదలుపెట్టారు. ఏడాది నుంచి స్టేషన్ పని చేస్తూనే ఉంది. ఏఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ పలుమార్లు మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించారు. కానీ హోం మంత్రి జిల్లా పర్యటనకు వస్తుండడంతో మళ్లీ ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 8వ తేదీ మధ్యాహ్నం మంత్రి స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. ఏడాది నుండి నడుస్తున్న స్టేషన్‌ను హోంమంత్రితో ప్రారంభిస్తుండటంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.
పర్యటన ఖరారు..
హోంమంత్రి చిన్నరాజప్ప నంద్యాల పర్యటన ఖరారైందని త్రీటౌన్ సీఐ దైవప్రసాద్ తెలిపారు. ఆయన 8వ తేదీ మధ్యాహ్నం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారని, తర్వాత దొర్నిపాడుకు వెళ్లి అక్కడ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారని చెప్పారు. అదే రోజు రాత్రి నంద్యాల చేరుకొని అమరావతి ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడకు వెళ్తారని తెలిపారు.
ఔరా..!
Published Thu, Feb 5 2015 2:33 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement