డీఈఓ ఇచ్చిన హామీలు | DEO assurances | Sakshi
Sakshi News home page

డీఈఓ ఇచ్చిన హామీలు

Published Mon, Dec 29 2014 3:30 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 PM

డీఈఓ ఇచ్చిన హామీలు

డీఈఓ ఇచ్చిన హామీలు

2013లో  మూడో స్థానం..
 2014లో రెండో స్థానం..
 2015లో  అగ్రస్థానం
 వచ్చేలా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.. పదవతరగతి పరీక్షా ఫలితాలలో గతంలో కంటే మెరుగైన స్థానంలో ఉండేలా డీఈఓ ప్రతాపరెడ్డి ఉపాధ్యాయులు, సిబ్బందికి మార్గ
 నిర్ధేశనం చేస్తున్నారు.. పాఠశాలల్లో మౌలికవసతులు  ఎలా ఉన్నాయన్న  విషయాలను పరిశీలించేందుకు వీఐపీ రిపోర్టర్‌గా మారారు.. ప్రొద్దుటూరులోని నడింపల్లె మున్సిపల్ హైస్కూల్‌ను తనిఖీ చేశారు..పాఠాలకు సంబంధించిన ప్రశ్నలను అడిగి విద్యార్థుల  నుంచి సమాధానాలను  రాబట్టారు.. తానూ పాఠాలు చెప్పారు.. పాఠశాలలను అభివృద్ధిపథంలో  నడిపించడమే తన ధ్యేయమని పేర్కొన్నారు.
 
 డీఈఓ ప్రతాప్‌రెడ్డి:  మీ పాఠశాలల్లో పదో తరగతికి సంబంధించి సబ్జెక్టులు పూర్తయ్యాయా?
 విద్యార్థి (మహ్మద్ ఇమ్రాన్): అన్ని సబ్జెక్టులల్లో దాదాపు 85 శాతం పూర్తయ్యాయి. మళ్లీ టీచర్లు కొన్ని సబ్జెక్టులను రివిజన్ చేస్తున్నారు.
 
 డీఈఓ: భవిష్యత్తు శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ఇన్‌స్పైర్ కార్యక్రమాలు నిర్వహించారా? ఎలా చేస్తే బాగుంటుంది, ఎక్కడికైనా వెళ్లారా?
 ఫర్హిన్: మా పాఠశాలలో ఇంకా నిర్వహించలేద్సార్. పలు చోట్ల నిర్వహించిన ఇన్‌స్పైర్ కార్యక్రమాలకు వెళ్లాం. మేధావులు చెబుతున్న వాటిని ఆలకించడం ద్వారా మాలో కొంత స్ఫూర్తి పెరుగుతోంది. ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం.  
 
 డీఈఓ: పదో తరగతిలో మొత్తం ఎంత మంది ఉన్నారు... ఇంగ్లీషు మీడియమా.. తెలుగు మీడియమా... గణితంలో త్రికోణమితి గురించి తెలుసా?
 ఖాదర్‌వల్లి: పాఠశాలల్లో మొత్తం 76 మంది విద్యార్థులు ఉన్నాం. అందులో ఏ సెక్షన్, బీ సెక్షన్ కింద విభజించి చదువు బోధిస్తున్నారు. ఇంగ్లీషు మీడియం, తెలుగు మీడి యం వేర్వేరుగా నిర్వహిస్తున్నా రు. త్రికోణమితి గురించి తెలుసు సార్. ఇప్పటికే త్రికోణమితికి సంబంధించిన అధ్యాయం కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో డీఈఓ త్రికోణమితి అధ్యాయంలోని సైన్ టీటా, కాస్ టీటాకు సంబంధించిన ఒక లెక్కను విద్యార్థులకు సులభరీతిలో బోర్డుపై బోధిస్తూ వివరించారు.
 
 డీఈఓ: తెలుగులో సందులు, సమాసాలు వచ్చా? సోషియల్‌లో మ్యాప్ పాయింట్‌లో అరేబియా సముద్రం ఎక్కడ ఉంది? స్పోర్ట్స్‌లో ఎవరైనా రాణించారా?
 ఖలందర్: సందులు, సమాసాలు తెలుసు సార్ (సవర్ణదీర్ఘ సంది గురించి వివరిస్తూ). సోషియల్ మ్యాప్‌లో అరేబియా సముద్రాన్ని చూపించిన అనంతరం స్పోర్ట్స్‌లో కబడ్డీలో మంచి ప్రతిభకనబరిచా.
 
 డీఈఓ: కొన్ని చోట్ల విద్యార్థుల పట్ల ఆకతాయిల వేధింపులు, ఇతర సమస్యలు ఎదురవుతున్నాయి. మీకేమైనా సమస్యలు ఎదురవుతున్నాయా?
 రేష్మా: ఇంటి నుంచి పాఠశాలకు వస్తున్నప్పుడు కానీ, లేదా ఇక్కడ కానీ మాకు ఎలాంటి సమస్యలు లేవు. ఏదైనా ఇబ్బంది
 
  జరిగినా ఇటు తల్లిదండ్రులకుగానీ, ఉపాధాయులకైనా ధైర్యంగా చెబుతాం.
 
 డీఈఓ: గత  మూల్యాంకణ  విధానానికి ప్రస్తుత విధానానికి తేడాలు ఉన్నాయి, మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా?
 ఆఫ్రిన్: అంతా దగ్గర దగ్గర ఒక్కటే కాబట్టి పెద్దగా సమస్య ఎదురుకాలేదు. పైగా సబ్జెక్టులను పూర్తి చేసుకుని మరో మారు బోధిస్తుండటంతో సమస్య ఉత్పన్నం కాలేదు.
 
 డీఈఓ: బాబు నీవు ఏం కావాలనుకుంటున్నావు?
 పవన్‌కుమార్: సార్ నేను క్రికెటర్ కావాలని ఆశ. బ్యాట్స్‌మెన్‌గా దేశస్థాయిలో ఆడాలని ఉంది. అదే నా ఆశయం. గతంలో కోచింగ్ కూడా తీసుకున్నా.
 
 డీఈఓ: (సమీపంలో కూర్చున్న విద్యార్థిని ఉద్దేశించి) చిన్నా నీ లక్ష్యం ఏమిటి?
 హరికృష్ణ: ఇంజనీర్ కావాలన్నదే నా లక్ష్యం సార్. గతంలో ఈ పాఠశాలలో చదివిన కొంత మంది ఉన్నత స్థానంలో ఉన్నారు. వారి స్ఫూర్తితోనే  నేను ఇంజనీర్ లేదా శాస్త్రవేత్తగా అవ్వాలన్నదే సంకల్పం.
 
 డీఈఓ: ఎగ్జామ్స్ వస్తున్నాయి ప్రిపేర్ అవుతున్నారా? ఏమైనా టెన్షన్ పడుతున్నారా?
 ఖయ్యుం: కొంచెం భయంగా ఉంది సార్. కష్టపడి చదువుతున్నా. పైగా స్టడీ అవర్స్ కూడా నిర్వహిస్తున్నారు. రోజు కనీసం 3, 4 గంటలు చదువుతున్నా. మంచి గ్రేడ్ తెచ్చుకుంటానన్న నమ్మకం నాకుంది.
 
 డీఈఓ: కంప్యూటర్లు ఉన్నాయి, ఆపరేటింగ్ ఎవరెవరికి వస్తుంది?
 ప్రవల్లిక: పదో తరగతి విద్యార్థులలో చాలా మందికి కంప్యూటర్ నేర్పించారు. ప్రత్యేకంగా సిబ్బంది ఉండటం వల్ల దాదాపు అందరు నేర్చుకున్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా తెలుసు.
 
 డీఈఓ: ప్రతి రోజు పీఈటీ క్లాసు కేటాయిస్తున్నారా? సాంస్కృతిక విభాగాల్లో రాణించిన వారు ఎవరైనా ఉన్నారా?
 బాలవెంకటసుబ్బయ్య: ప్రతి రోజు ఏదో ఒక సమయంలో ఆడుకోవడానికి సమయం ఇస్తారు. కాకపోతే మైదానం లేదు. సమీప ప్రాంతాల్లోకి వెళ్లి ఆడుకుంటాం. నేను పాటలు బాగా పాడుతా.  (‘మానవుడా దానవుడా’ పాట పాడుతూ..)
 డీఈఓ: (సమీపంలో ఉన్న హెడ్మాస్టర్‌ను ఉద్దేశించి) పాఠశాలకు సంబంధించి సౌకర్యాల కల్పనకు ఎవరైనా దాతలు ముందుకు వచ్చారా?
 హెడ్మాస్టర్ మునిచంద్రారెడ్డి: పాఠశాలకు సంబంధించి స్థానికంగా ఉన్న దాత ఇన్వర్టర్ అందజేశారు. మరికొంతమంది దాతలు పాఠశాలకు అవసరమైన టేబుళ్లు, ఇతర సామాగ్రి అందించారు.
 
 డీఈఓ: రాత్రి సమయంలో ఎంత సేపు చదువుతారు? సీరియల్స్ ఎంతమంది చూస్తారు?
 మహబూబ్‌బాష: సీరియల్స్ చూడం సార్. రాత్రి సమయంలో 8 నుంచి 9.30 గంటల వరకు చదువుకుంటాం. మళ్లీ తెల్లవారుజామున కూడా చదువుకోవడం అలవాటు. (నిజమా అబద్దమా అని తెలుసుకునేందుకు డీఈఓ తల్లిదండ్రులతో మాట్లాడి నిర్ధారణ చేసుకున్నారు.)
 
 ఆయనేమన్నారంటే..
  మారుమూల పల్లెటూర్ల నుంచే విద్యా కుసుమాలు విరబూసేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి భవిష్యత్తు తరాలు ఆశ్యర్యపరిచేలా కడప నుంచే శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను తయా రు చేస్తాం.. ప్రత్యేకంగా విద్యార్థులు ఎలా చదువుతున్నారో పరిశీలించడంతోపాటు ఇంటి దగ్గరికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడేలా ‘నైట్‌విజన్’ అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రధానోపాధ్యాయులతో మానిటరింగ్ చేయిస్తున్నాం. 10 లో గతంలో కంటే కూడా అత్యుత్తమ మార్కులతోపాటు ర్యాంక్‌లను సాధించేలా ఇప్పటి నుంచే కృషి చేస్తున్నాం.  పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement