రేషనలైజేషన్ చేద్దామా? వద్దా?
సందిగ్ధంలో విద్యాశాఖ..
- చేస్తే ఉన్న పోస్టులకు ఎసరు
- ప్రకటించిన 7,892 పోస్టుల్లో సగం వరకు కోత!
- డీఎస్సీ నష్టపోయిన వారికి ఇస్తే మిగిలేవీ అంతంతే!
- ఏం చేయాలో అర్థంకాని స్థితిలో అధికారులు
సాక్షి, హైదరాబాద్: ప్రతి ఏటా వేసవి వస్తుందనగానే స్కూళ్లు, టీచర్ల హేతుబద్ధీకరణ చేస్తాం.. పిల్లలు ఉన్న చోటికి టీచర్లను పంపుతాం... పిల్లలు లేని స్కూళ్లను సమీప పాఠశాలల్లో విలీనం చేస్తాం.. అంటూ మూడేళ్లుగా చెబుతూ వస్తున్న విద్యాశాఖ ఈసారి మాత్రం ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో పడింది. హేతుబద్ధీకరణ చేయలా? వద్దా? తేల్చుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 7,892 ఉపాధ్యాయ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తాం.. అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్వయంగా ఇటీవల అసెంబ్లీలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఏం చేయాలన్న అంశంపై విద్యా శాఖ అధికారులు ఆలోచనల్లో పడ్డారు. హేతుబద్ధీకరణ కనుక చేస్తే ప్రకటించిన పోస్టులకు కోత పడే ప్రమాదం ఉంది.
విద్యార్థులు ఉన్న స్కూళ్లకు టీచర్లను పంపించడం, విద్యార్థులు లేని పాఠశాలలను విలీనం చేయడం వంటి ప్రక్రియ చేపట్టడం ద్వారా 7,892 పోస్టుల్లో సగం వరకు పోస్టులు తగ్గిపోయే పరిస్థితులు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు వివిధ డీఎస్సీలలో నష్టపోయిన వారికి 6,900 పోస్టులు అవసరం అని విద్యాశాఖ లెక్కలు వేసింది. అయితే వారికి పోస్టులు ఇవ్వడం కుదరదని సాధారణ పరిపాలన శాఖ ఇప్పటికే తేల్చిచెప్పినట్లు సమాచారం. సీఎం కె.చంద్రశేఖరరావు ఆయా అభ్యర్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు కనుక పోస్టులు ఇచ్చేందుకు చర్యలు చేపడితే కొత్త నోటిఫికేషన్‌లో పోస్టులు భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశం ఉంది.
ఇక హేతుబద్ధీకరణ చేయకపోతే ఒక్క విద్యార్థి లేని పాఠశాలలు, 10 మందిలోపే విద్యార్థులు ఉన్న 1,660 పాఠశాలలకు కూడా టీచర్లను కేటాయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో హేతుబద్ధీకరణపై పాఠశాల విద్యాశాఖ ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో పడింది. అయితే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ప్రకారం రాష్ట్రంలో సరిపడా టీచర్లు ఉన్నట్లు విద్యా శాఖ చెబుతున్నా.. మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ప్రకారమే టీచర్లను ఇస్తామనడం సరికాదన్నది విద్యావేత్తల అభిప్రాయం.
ట్రాన్స్‌పోర్టా...టీచర్లా...?
అనేక ప్రాంతాల్లో పలు ఆవాసాలకు కిలోమీటరు పరిధిలో కాదు.. మూడు నాలుగు కిలోమీటర్ల పరిధిలోనూ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు లేవు. పది మంది లోపు విద్యార్థులున్న స్కూళ్లే కాదు.. 20 మందిలోపు విద్యార్థులు ఉన్న 3 వేల పాఠ శాలల్లో చాలా స్కూళ్లకు నిర్ణీత పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు లేవు. దీంతో వాటిని సమీప పాఠశాలల్లో విలీనం చేసే అవకాశం లేదు. పోనీ అక్కడి విద్యార్థులు అందరికి ట్రాన్స్‌పోర్టు సదుపా యం కల్పించాలా? లేదా రెగ్యులర్ టీచర్లనే ఇవ్వాలా? అన్నది తేల్చాల్సి ఉంది.