సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల్లో ఆలోచన, అవగాహన, సృజనాత్మకత పెంపొందించేందుకు కొత్తగా అమల్లోకి తెచ్చిన నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)లో సమస్యలు తలెత్తుతున్నాయి. దీన్ని పక్కాగా అమలు చేయలేక టీచర్లు ఆపసోపాలు పడుతున్నారు. సీసీఈ అమలుతో సాధించాల్సిన లక్ష్యాలపై వారికే అవగాహన లేకుండా పోయింది. బట్టీ విధానానికి స్వస్తి చెప్పి సొంతంగా పరీక్షల్లో ఆలోచించి జవాబులు రాయాల్సిన విద్యార్థులు గైడ్లు చూసే రాస్తున్నారు. సమయమంతా ప్రాజెక్టులు, రాత పనులకే పోతుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఇటీవలి విద్యా శాఖ సర్వేలోనే వెల్లడైంది. సీసీఈతో టీచర్లపైనా తీవ్ర పని భారం పడుతోంది. దాంతో ప్రత్యామ్నాయాలపై, వచ్చే విద్యా సంవత్సరంలో తేవాల్సిన మార్పులపై శాఖ దృష్టి సారించింది.
సీసీఈ అమలులో సమస్యలివీ...
- అన్ని సబ్జెక్టుల టీచర్లూ ఒకేసారి ప్రాజెక్టు పనులు, పుస్తక సమీక్షలు, రాత పనులు ఇవ్వడంతో విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
- పదో తరగతిలో సహ పాఠ్య కార్యక్రమాలు నిర్వహించకుండానే మార్కులు వేస్తున్నారు.
- 6, 7 తరగతుల్లో సహ పాఠ్య కార్యక్రమాలు నిర్వహించడమూ లేదు, ఆ మార్కులు వేయడమూ లేదు. నమోదూ చేయడం లేదు. ప్రాథమిక పాఠశాలల్లోనూ అంతే.
- చాలా స్కూళ్లలో సైన్స్ ప్రయోగాలు చేయించకుండానే మూస పద్ధతిలో ల్యాబ్ రికార్డులు రాయిస్తున్నారు.
- 9, 10 తరగతుల్లోనూ ప్రాజెక్టు పని నివేదికలను ఎంతమంది విద్యార్థులు సొంతంగా రాస్తున్నారో పట్టించుకోవడం లేదు.
- ప్రాజెక్టు పనులతో పిల్లలు చదవడం కంటే రాయడానికే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోంది.
- ఏ తరగతిలోనూ విద్యార్థులు పరీక్షల్లో సొంతంగా ఆలోచించకుండా, చాలావరకు గైడ్లలో చూసి జవాబులు రాస్తున్నారు. అయినా టీచర్లు మార్కులు వేస్తున్నారు.
- పిల్లల భాగస్వామ్యం అంశంలో.. సాంఘిక శాస్త్రంలో సమకాలీన అంశాలపై ప్రతిస్పందన రాయడంపై చాలామందికి అవగాహనే ఉండటం లేదు.
- 6, 7 తరగతుల్లో పుస్తక సమీక్షలు నామ మాత్రంగా నిర్వహిస్తున్నారు. ప్రాథమిక వివరాలు రాసినా మార్కులేస్తున్నారు.
ప్రత్యామ్నాయాలపై దృష్టి
ఈ సమస్యల నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై విద్యా శాఖ దృష్టి సారించింది. విద్యా శాఖ కమిటీలు క్షేత్రస్థాయిలో అధ్యయనంతో చేసిన సిఫార్సులను పరిశీలిస్తోంది.
- వచ్చే విద్యా సంవత్సరంలో ప్రాజెక్టు పనులను తగ్గించే యోచన చేస్తోంది. తెలుగు, ఇంగ్లిష్, హిందీల్లో ప్రాజెక్టు పనులు లేకుండా చూడాలని భావిస్తోంది.
- 6, 7 తరగతుల్లో విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రం; 8, 9, 10 తరగతుల్లో భౌతిక, రసాయన, జీవ, సాంఘిక శాస్త్రాల అభ్యాసాల్లో ప్రశ్నలను తగ్గిస్తే రాత భారం తగ్గుతుందని భావిస్తోంది.
- ఏటా నాలుగుసార్లు నిర్వహించే నిర్మాణాత్మక మూల్యాంకనం (ఫామేటివ్ అసెస్‌మెంట్–ఎఫ్‌ఏ) విద్యార్థులకు భారం కాకుండా తగిన మార్పులు చేయాలని భావిస్తోంది. వీటిలో పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనలకు 10 మార్కులు, రాత పనులకు 5, లఘు పరీక్షకు 5, మొత్తం 20 మార్కులు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment