టీచర్లు సరిగా రావట్లేదు
♦ పాఠశాల విద్య టోల్ ఫ్రీకి ఫిర్యాదుల వెల్లువ
♦ ఎప్పటికప్పుడు పరిష్కారానికి చర్యలు
♦ పాఠశాల విద్య డెరైక్టర్ కిషన్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యా శాఖ టోల్ ఫ్రీ నంబరుకు మంచి స్పందన వస్తోంది. పాఠశాలల్లో సమస్యలపై ఫిర్యాదులకు, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టేందుకు టోల్ ఫ్రీ నంబరు (18004257462)ను అందుబాటులోకి తెచ్చిన సోమవారంనాడే 50కిపైగా ఫిర్యాదులు వచ్చాయి. పాఠశాలల్లో మౌలిక వసతులు, ఇతర సమస్యలతోపాటు ఉపాధ్యాయులు సరిగా బడికి రావడం లేద ని ఫిర్యాదులు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎదురయ్యే సమస్యలపై తల్లిదండ్రులు, విద్యావంతులు, మరెవరైనా ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని పాఠశాల విద్య డెరైక్టర్ కిషన్ వెల్లడించారు. వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే జవాబుదారీతనం పెంచేందుకు ఫిర్యాదు చేసిన వారి ఫోన్ నంబర్లు నమోదు చేసుకొని, వారికి ఆ సమస్య పరిష్కార వివరాలను తెలిపేలా చర్యలు చేపడతామన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని...
నల్లగొండ జిల్లా దేవరకొండ, కందమల్ల జిల్లా పరిషత్ పాఠశాలలో 1,400 మంది విద్యార్థులున్నా టాయిలెట్లు లేవు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రభుత్వ పాఠశాలకు ఉపాధ్యాయులు సరిగా రావడంలేదు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టాయిలెట్లు లేవు. నీటి సదుపాయం లేదు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పరిధిలోని వెంకటేశ్వర్ల పల్లి ప్రాథమిక పాఠశాలకు టీచర్లు సకాలంలో రావట్లేదు. మధ్యాహ్న భోజనం అమలు కావడం లేదు. కరీంనగర్ జిల్లా ఎలగందుల మండల మోడల్ స్కూల్‌కు సంబంధించిన హాస్టల్ భవనం పూర్తయినప్పటికీ బాలికలకు ఇంకా ప్రవేశాలు కల్పించలేదు. ఆదిలాబాద్ జిల్లా కాసిపేట మండల మోడల్ స్కూల్‌కు కేంద్రం 2009లో అనుమతిచ్చినా ఇంతవరకు భవన నిర్మాణం చేపట్టలేదు. జిల్లా రెవెన్యూ అధికారులు స్కూల్ కోసం భూమిని కేటాయించారు. కానీ అది సాంఘిక సంక్షేమ శాఖ స్థలం కావడం వల్ల భూమి సేకరణపై వివాదం ఏర్పడింది.