30 మందికి ఐదుగురే!
డైట్‌లో తగ్గుతున్న లెక్చరర్ల సంఖ్య
- కళాశాలలో కుంటుపడుతున్న విద్యాబోధన
- ఆందోళనలలో విద్యార్థులు
- పట్టించుకోని ప్రభుత్వం
మెదక్ రూరల్: జిల్లాలోని ఏకైక డైట్ కళాశాలలో బోధకులు లేక చదువులు కుంటుపడుతున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ డైట్ కళాశాల హవేళిఘనపూర్ గ్రామ శివారులో ఉంది. ప్రస్తుతం కళాశాలలో తెలుగు, ఉర్దూ మీడియం కొనసాగుతుండగా తెలుగులో 100 మంది చాత్రోపాధ్యాయులు (అభ్యర్థులు) ఉండగా ఉర్దూ మీడియంలో 47 మంది ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తెలుగు మీడియం బోధించే లెక్చరర్లు ప్రిన్సిపాల్‌తో పాటు 25 మంది ఉండాలి. ఉర్దూ మీడియంలో ఐదుగురు లెక్చరర్లు ఉండాలి.
ఈలెక్కన 30 మంది లెక్చరర్లు నిబంధనల ప్రకారం బోధించాలి. కాగా తెలుగు మీడియంలో ఇద్దరు పర్మనెంట్ లెక్చరర్లతో పాటు మరొకరు డిప్యూటేషన్‌పై వచ్చారు. అంటే తెలుగు మీడియంలో ముగ్గురు మాత్రమే ఉన్నారు. అలాగే ఉర్దూ మీడియంలో ఒకరు పర్మనెంట్ లెక్చరర్ ఉండగా మరొకరు డిప్యుటేషన్‌పై వచ్చారు. అంటే ఇద్దరు ఉన్నారు. తెలుగు, ఉర్దూ మీడియంలో ఐదుగురు మాత్రమే బోధిస్తున్నారు.
గౌరవప్రదమైన ఉపాధ్యాయవృత్తిని ఎంచుకుని కష్టపడి చదివిన అభ్యర్థులు అసలు ఈ వృత్తిని ఎందుకు ఎంచుకున్నామా...అంటు ఆవేదన చెందుతున్నారు. సీటు సంపాదించుకున్నామే కానీ, బోధించేవారు లేక పోవటంతో మేము ఏం నేర్చుకోవాలి.. విద్యార్థులకు ఎలా బోధించాలి..అనే తికమకలో పడ్డామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.