DIET college
-
డైట్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ అరెస్టు
సాక్షి, అనకాపల్లి : అధికార పార్టీకి సంబంధించినవైతే చాలు పోలీసులు ఎలాంటి ఘోరాలు, నేరాలు అయినా నోరు మెదపడంలేదు. టీడీపీ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కుమారుడు రత్నాకర్ అనకాపల్లిలో నడుపుతున్న దాడి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (డైట్) అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆగడాలే ఇందుకు ఉదాహరణ. మెంటార్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ మురళి తనను వేధిస్తున్నాడని ఇంజినీరింగ్ సెకండియర్ విద్యార్థిని చాలాకాలంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎట్టకేలకు అరెస్టుచేసి శుక్రవారం రిమాండ్‌కు పంపారు. కానీ, ఈ విషయాన్ని అనకాపల్లి టౌన్ పోలీసులు చాలా గోప్యత పాటిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మెంటార్ మురళి ఏడాది కాలంగా వేధిస్తున్నాడని బాధితురాలు పేర్కొంటోంది. ప్రతిరోజు రాత్రులు తనకు ఫోన్‌చేసి మాట్లాడాలని, వాట్సాప్ మెసేజ్‌లు చేయాలని, కళాశాలకు వచ్చినప్పుడు తనను కలవాలని, హగ్ చేసుకోవాలని రకరకాలుగా వేధిస్తుండటంతో ఆమె నరకం అనుభవిస్తోంది. అతని వేధింపులు భరించలేక తన స్నేహితుడికి సమస్యలు వివరించడంతో.. ఇటీవల ఆ యువకుడు మురళిని ప్రశ్నించగా ‘నీకేందుకురా పో’.. అంటూ అసిస్టెంట్ ప్రొఫెసర్ దురుసుగా ప్రవర్తించాడు. మీ ఇద్దరి మధ్య వేరే సంబంధం ఉందని మీ తల్లిదండ్రులకు చెబుతానని బెదిరించాడు. అధ్యాపకుడి ఫోన్‌కాల్ రికార్డింగ్ ఆధారంగా కళాశాలలో ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో బాధిత విద్యార్థిని జిల్లా పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు సైతం ఈ విషయాలను రహస్యంగా ఉంచడం విస్మయం కలిగిస్తోంది. మరోవైపు.. తమ కుమార్తెపట్ల అసిస్టెంట్ ప్రొఫెసర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు బాధితురాలి తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. నిందితుడ్ని 14రోజులపాటు రిమాండ్ విధించినట్లు విశ్వసనీయ సమాచారం. కానీ, ఈ విషయం సీఐ వెల్లడించకపోవడం గమనార్హం. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ మురళి గతంలో చాలామందిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, కళాశాలలో మెంటర్ కావడంతో విద్యార్థులు మౌనంగా భరిస్తున్నారని ఇతర విద్యార్థులు చెబుతున్నారు. -
10న ఆదిలాబాద్‌లో అమిత్ షా సభ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 10న మధ్యాహ్నం ఒంటి గంటకు ఆదిలాబాద్‌లోని డైట్ కాలేజీ గ్రౌండ్స్‌లో జరగనున్న బహిరంగసభలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొనున్నారు. ఇప్పటికే ఈ నెల 1న మహబూబ్‌నగర్, 3న నిజామాబాద్‌లో నిర్వహించిన సభల ద్వారా రాష్ట్రంలో పార్టీపరంగా ప్రధాని మోదీ ఎన్నికల శంఖాన్ని పూరించిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా అమిత్ షా సభను బీజేపీ నిర్వహించనుంది. 10న రాజేంద్రనగర్ నియోజకవర్గపరిధిలోని శంషాబాద్‌లో అదేరోజు సాయంత్రం అమిత్ షా సభ నిర్వహించాలని తొలుత భావించింది. అయితే ఈ సభ రద్దు అయింది. దీనికి బదులు సికింద్రాబాద్ సిఖ్ విలేజీలోని ఇంపీరియల్ గార్డెన్లో జరిగే మేధావుల సదస్సులో అమిత్ షా పాల్గొనున్నారు. మేధావుల సదస్సు సక్సెస్‌పై ఆదివారం సాయంత్రం బీజేపీ కార్యాలయంలో లీగల్ సెల్‌తోపాటు ఇతర మేధావులతో కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు. సదస్సుకు అన్ని వర్గాల మేధావులను ఆహ్వనించి మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై వారి నుంచి బీజేపీ సలహాలు తీసుకోనుంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో ఆదిలాబాద్ సభలో అమిత్ షా వివ రిస్తారని అన్నారు. కేసీఆర్‌కు హఠావో, బీజేపీకో జీతావో.. తెలంగాణకో బచావో... అనేదే బీజేపీ నినాదామని చెప్పారు. ప్రధాని మోదీ దిష్టిబోమ్మలను ఎందుకు దగ్ధం చేస్తున్నారో కాంగ్రెస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘రాష్ట్రాభివృద్ధి కోసం రూ.9 లక్షల కోట్లు ఇచ్చినందుకా, ఇటీవల రాష్ట్రానికి పసుపుబోర్డు, గిరిజన వర్సిటీ వంటివి ప్రకటించినందుకా, కృష్ణానదీలో తెలంగాణ నీటి వాటా ఖరారుకు ట్రిబ్యునల్ వేసినందుకా.. మోదీ దిష్టిబో మ్మలు దగ్ధం చేస్తున్నారు’అని నిలదీశారు. -
కొలువుల చదువు.. భవితకు నెలవు
గిరి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతూ రంపచోడవరం ఉపాధ్యాయ శిక్షణ సంస్థ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. బోధనకు అవసరమైన నైపుణ్యం, విజ్ఞానం అందిస్తూ శిక్షణ ఇస్తోంది. వారు కొలువులు సాధించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. రాష్ట్రంలోనే గిరిజన ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే ఏకైక కళాశాల ఇదే. ఏటా 50 మంది విద్యార్థులు ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్నారు. రంపచోడవరం: రెవెన్యూ డివిజన్ కేంద్రమైన రంపచోడవరంలోని ఉపాధ్యాయ శిక్షణ కళాశాల (డైట్ కళాశాల) గిరి విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇచ్చి ఉపాధ్యాయులుగా కొలువులు సాధించడంలో ఎంతో దోహదపడుతోంది. నూరుశాతం ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. 15 ఏళ్లుగా గురువులుగా తీర్చిదిద్దుతూ... రంపచోడవరంలో ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను 2008లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏటా డైట్ ద్వారా 50 మంది గిరి విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు కళాశాలలో 520 మంది విద్యార్థులు శిక్షణ పొంది బయటకు వెళ్లారు. ► 2008 –2101 విద్యా సంవత్సరానికి సంబంధించి 82 శాతం ఉత్తీర్ణత సాధించింది. 2009 నుంచి 2014 వరకు 96శాతం ఉత్తీర్ణత సాధించింది. 2013 నుంచి 2020 వరకు ఆరు బ్యాచ్‌లు నూరుశాతం ఫలితాలు సాధించాయి. అలాగే 2021 బ్యాచ్ నూరు శాతం ఫలితాలు సాధించాయి. చక్కని వసతి సదుపాయం ► రాష్ట్రంలోని రంపచోడవరం, చింతూరు, పాడేరు, పార్వతీపురం, కన్నపురం ఐటీడీఏల పరిధిలోని విద్యార్థులు ఉపాధ్యాయ శిక్షణ నిమిత్తం రంపచోడవరం ఉపాధ్యాయ శిక్షణ కళాశాలకు రావాల్సిందే. రంపచోడవరం డైట్ కళాశాలకు అనుబంధంగా హాస్టల్ వసతి కల్పించారు. బాలురకు కళాశాల ఆవరణలోనే హాస్టల్ వసతి ఉంది. బాలికలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని వసతి గృహంలో కల్పించారు. మెరుగైన శిక్షణ రంపచోడరంలోని డైట్ కళాశాలలో మెరుగైన శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ తరువాత ఉద్యోగం సాధిస్తామనే భరోసా ఉంది. ఏజెన్సీలో గిరిజన విద్యార్థులకు ప్రత్యేకంగా కళాశాల ఏర్పాటుతో ఎంతో మేలు కలుగుతుంది. –కల్యాణ్, విద్యార్థి డైట్ కళాశాల, రంపచోడవరం మెరిట్ విద్యార్థులకే ప్రవేశం రంపచోడవరం డైట్ కళాశాలలో ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధించిన విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారు. రెండేళ్ల పాటు చదువుకునేందుకు అన్ని సదుపాయాలతో వసతి సమకూరుస్తున్నారు. ఇక్కడ చదివిన అనేక మంది విద్యారంగంలో స్థిరపడ్డారు. –కోసు ఠాగూర్దొర, డైట్ కళాశాల విద్యార్ధి. నూరుశాతం ఫలితాలు తమ కళాశాలలో చేరిన విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇస్తున్నాం. వారు బాగా చదివేందుకు అవసరమైన వాతావరణం కల్పిస్తున్నాం. కళాశాల నూరుశాతం ఫలితాలు సాధిస్తూ ముందంజలో ఉంది. –సీహెచ్ చిన్నబాబు, ప్రిన్సిపాల్, డైట్ కళాశాల, రంపచోడవరం -
ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా విడుదల
సాక్షి, మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ : బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులకు సంబంధించి సీనియార్టీ జాబితాను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఈమేరకు ఉపాధ్యాయులు ఎవరికి ఎన్ని పాయింట్లు వచ్చాయో పరిశీలిస్తూ తమ స్థానాన్ని వెతుక్కునే పనిలో పడ్డారు. ఇంకోపక్క వివిధ ప్రిపరెన్షియల్ కేటగిరీల్లో దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు సమర్పించిన పత్రాలు సరైనవేనా అని పరిశీలించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇక తక్కువ పాయింట్లు వచ్చినా, పూర్తి స్తాయిలో పాయింట్లు రాకపోయినా ఉపాధ్యాయులు అధికారులకు మళ్లీ దరఖాస్తులు చేసుకుంటున్నారు. చాలా మంది తమకు నాలుగో కేటగిరీ పాఠశాలలకు సంబంధించి పాయింట్లు కలపలేదని చెబుతుండగా.. స్పౌజ్ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్నా తక్కువ పాయింట్లు కలిపిన నేపథ్యంలో మరికొందరు దరఖాస్తు వెనక్కి తీసుకుంటున్నారు. కాగా, జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల కంప్యూటర్ ల్యాబ్‌లో అధికారులు ఉపాధ్యాయులకు నమోదైన పాయింట్ల వివరాలను పరిశీలిస్తున్నారు. -
కడపలో మరో కాలేజీ మోసం
సాక్షి, వైఎస్సార్ జిల్లా : కడప జిల్లాలో మరో విద్యా సంస్థ మోసం బయట పడింది. ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థులకు జరిగిన మోసాన్ని మరవక ముందే జిల్లాలో మరో దారుణం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రేస్ డైట్ కళాశాల యాజమాన్యం కాలేజీని కేవలం కాగితాలకు మాత్రమే పరిమితం చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది. ఫీజుల పేరుతో విద్యార్థుల నుంచి కోట్ల రూపాయల మేర వసూలు చేసింది. తీర పరీక్షలు సమీపించడంతో వారిని రాజంపేట పిలిపించింది. ఆపై హాల్ టికెట్లు ఇవ్వకుండా యాజమాన్యం విద్యార్థులను వేధించింది. దీంతో తమ భవిష్యత్ ఏంటని 110 మంది విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఉపాధ్యాయ ‘మిథ్య’
డైట్ కాలేజీల్లో కుంటుపడుతున్న బోధన - ఒకే గదిలో తెలుగు, ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు పాఠాలు - తెలుగు మీడియంలోనే బోధన.. ఇంగ్లిష్ మీడియం వారికి గందరగోళం - ఇలా తెలుగులో డీఎడ్ చేస్తే.. ఇంగ్లిష్‌లో బోధించేదెలా? - పట్టించుకోని ప్రభుత్వం, డైరెక్టు రిక్రూట్ మెంట్ పోస్టులనైనా భర్తీ చేయని వైనం - అధ్యాపకుల కొరతతో ఇబ్బందులు.. 80% పోస్టులు ఖాళీ ఇది మహబూబ్‌నగర్‌లోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్)లోని తరగతి గది. డీఎడ్ కోర్సు చదువుతున్న ఈ విద్యార్థుల్లో ఒక వైపు ఉన్నది తెలుగు మీడియం వారుకాగా.. మరోవైపు ఉన్నది ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు. రెండు మీడియంల వారికి ఒకే తరగతి గదిలో తెలుగులోనే బోధన జరుగుతోంది. బోధించే అంశాలు అర్థంకావట్లేదు నేను ఏడో తరగతి నుంచి పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోనే చదువుకున్నా. ఉపాధ్యాయ శిక్షణకు ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశం పొందాను. కాని రెండు మీడియంల విద్యార్థులను కలిపి కూర్చోబెట్టి.. తెలుగులో బోధించడంతో ఇబ్బంది పడాల్సి వస్తోంది. సరిగా అర్థం కావడం లేదు కూడా.. - కె.చరణ్, వరంగల్ ఇంగ్లిష్ మీడియం విద్యార్థి ప్రత్యేకంగా బోధించేలా చర్యలు.. ఇంగ్లిష్ మీడియంలో బోధనకు ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నాం. గెస్ట్ లెక్చరర్లను నియమిస్తాం. అక్టోబర్, నవంబర్లలో ఓరియంటేషన్ తరగతులను నిర్వహించబోతున్నాం. ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్ అమల్లోకి వచ్చాక పదోన్నతులు ఇవ్వాలని, రెగ్యులర్ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది..’’ – బి.శేషుకుమారి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఆదరాబాదరాగా మొదలు రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రారంభించింది. భవిష్యత్తులో వాటిల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధించే ఉపాధ్యాయ అభ్యర్థుల అవసరాన్ని గుర్తించి.. ఈసారి నుంచి ఇంగ్లిష్ మీడియంలోనూ డీఎడ్ కోర్సును ప్రారంభించింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు కూడా చేరారు. కానీ అధ్యాపకుల కొరత కారణంగా ఇంగ్లిష్ మీడియంలో బోధన జరపలేని పరిస్థితి నెలకొంది. తెలుగులోనే బోధన కొనసాగుతోంది. దీంతో ఈ అభ్యర్థులు ఇంగ్లిష్ మీడియం టీచర్లు ఎలా అవుతారు, విద్యార్థులకు ఎలా బోధిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొత్తగా ఒక్క పోస్టూ ఇవ్వని వైనం రాష్ట్రంలో ప్రైవేటు డీఎడ్ కాలేజీలు కాకుండా 10 డైట్లు ఉన్నాయి. ఒక్కో డైట్లో 100 డీఎడ్ సీట్లు ఉన్నాయి. 2017–18 విద్యా సంవత్సరానికిగాను వీటిలో 50 సీట్లను తెలుగు మీడియం విద్యార్థులతో, మరో 50 సీట్లను ఇంగ్లిష్ మీడియం విద్యార్థులతో భర్తీ చేశారు. కానీ ఇంగ్లిష్ మీడియం బోధనకు అధ్యాపకులను ఇవ్వడం మరచిపోయారు. విద్యాశాఖ ఆ కోర్సును బోధించేందుకు అవసరమైన అదనపు పోస్టులను మంజూరు చేయలేదు. ఇప్పటికే అరకొరగా ఉన్న తెలుగు మీడియం లెక్చరర్లతోనే నెట్టుకొస్తోంది. కనీసం ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయడం లేదు. వాస్తవానికి డైట్ లెక్చరర్లుగా పదోన్నతి కల్పించాల్సిన పోస్టులకు సర్వీసు రూల్స్ సమస్య ఉంది. ఈ సమస్య లేని డైరెక్టు రిక్రూట్మెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ పోస్టులనైనా భర్తీ చేయాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) మొత్తుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనీసం సరిపడా తాత్కాలిక లెక్చరర్లనైనా నియమించలేదు. దీంతో ఇంగ్లిష్ మీడియం డీఎడ్‌ను ప్రవేశపెట్టినా ఫలితం లేని పరిస్థితి నెలకొంది. వరంగల్‌లోని డైట్ తరగతి గది ఇది. ఇక్కడా ఓవైపు తెలుగు మీడియం, మరోవైపు ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు. లెక్చరర్ బోధిస్తున్నది తెలుగులోనే. రాష్ట్రంలోని డైట్ కాలేజీల్లో నెలకొన్న దుస్థితి ఇది. ప్రత్యేకంగా ఇంగ్లిష్ మీడియంలో డీఎడ్ కోర్సు చేసేందుకు వచ్చిన అభ్యర్థులకు కూడా తెలుగు మీడియమే దిక్కవుతోంది. డైట్ కాలేజీల్లో అధ్యాపకుల కొరతే దీనికి కారణమవుతోంది. అంతేకాదు ఏకంగా 80 శాతం ఖాళీలు ఉండడంతో తెలుగు మీడియంలో బోధన కూడా అంతంత మాత్రంగానే సాగుతోంది. ఎస్సీఈఆర్టీ దృష్టికి తీసుకెళ్లాం అధ్యాపకుల కొరత కారణంగా తెలుగు, ఇంగ్లిష్ మీడియంల విద్యార్థులను ఒకే గదిలో కూర్చోబెట్టి బోధిం చాల్సిన పరిస్థితి ఉంది. ఇంగ్లిష్ మీడియంలో విద్యా బో«ధనకు 16 మంది కావాలి. ఎంత సర్దుబాటు చేసినా 8 మంది అయినా అవసరం. కానీ అందుబాటులో లేరు. రెండు మీడియంల విద్యార్థులతో కంబైన్డ్ క్లాస్‌లు నిర్వహించాలని విద్యాశాఖ చేసిన సూచన మేరకు బోధన కొనసాగిస్తున్నాం.. రవికుమార్ వరంగల్ డైట్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ -
డీఈఓగా డైట్ ప్రిన్సిపాల్ రాఘవరెడ్డి?
– జిల్లాకు డీఈఓగా వచ్చేందుకు ఆసక్తి చూపని అధికారులు – పీఓగా తాహెరా సుల్తానాను నియమించే అవకాశం? కర్నూలు సిటీ: జిల్లా విద్యాశాఖ అధికారిగా పదోన్నతుల ద్వారా వచ్చేందుకు అధికారులు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. గతంలో జరిగిన సంఘటనలు, కొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకుల తీరు, రాజకీయ నాయకుల జోక్యం అధికంగా ఉండడమే అందుకు కారణమనే విమర్శలున్నాయి. అయితే నిన్న, మొన్నటి వరకు డీఈఓగా గతంలో జిల్లాలో డిప్యూటీ ఈఓగా పని చేసిన సుబ్బారావు వస్తారని విద్యాశాఖ వర్గాల్లో చర్చ జరిగింది. ఇక్కడికి డీఈఓగా రావాలంటే అమరావతిలోని అధికారి పార్టీ నేతలకు కనీసం రూ.25 లక్షలు చెల్లించాలనే షరతు పెట్టడంతో అంతా మొత్తంలో చెల్లించలేనని చెప్పినట్లు తెలిసింది. కడప, అనంతపురం జిల్లాల్లో ఏదో ఓ జిల్లాకు ఆయన డీఈఓగా వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. 28మందికి పదోన్నతులకు ఆమోదం డిప్యూటీ ఈఓ, ప్రభుత్వ డైట్, బీఈడీ కాలేజీ ప్రిన్సిపాళ్లకు డీఈఓలుగా పదోన్నతులు కల్పించేందుకు మంగళవారం విజయవాడలో జరిగిన మంత్రి సమావేశంలో 28 మంది జాబితాతో డీపీసీ ఆమోదం పొందింది. మొదట్లో 14 మందితో జాబితా తయారు చేశారు. అయితే సర్వశిక్ష అభియాన్ పీఓలుగా కూడా డీఈఓ స్థాయి అధికారులుగా పని చేయాలనే ఉద్దేశం, విద్యాశాఖతో సంబంధంలేని వారు పీఓలుగా వస్తుండడం వల్ల ప్రయోజనం ఉండడం లేదని, అందుకే విద్యాశాఖతో సంబంధం ఉన్న వారిని డీఈఓ స్థాయి వారిని పీఓలుగా నియమించేందుకు మరో 14 మంది జాబితాను తయారు చేసి మొత్తంగా 28 మందికి డీపీసీ ఆమోదం తెలిపింది. ఈ కారణంతోనే ప్రస్తుత డీఈఓ ఎస్.తాహెరా సుల్తానా మంగళవారం విజయవాడకు వెళ్లారు. డైట్ ప్రిన్సిపాల్ రాఘవరెడ్డికి పదోన్నతి అధికార పార్టీ నేతలు నిర్ణయించినంత సొమ్ము ఇచ్చి డీఈఓగా జిల్లాకు వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో పదోన్నతుల జాబితాలో ఉన్నటువంటి కర్నూలు ప్రభుత్వ డైట్ ప్రిన్సిపాల్ రాఘవరెడ్డిని డీఈఓగా నియమించేందుకు ప్రిన్సిపల్ సెక్రటరీ అంగీకరించినట్లు సమాచారం. అయితే మంత్రి మరో రెండు రోజులు వేచి చూసి నిర్ణయించుదామని చెప్పినట్లు తెలిసింది. కాగా ప్రస్తుత డీఈఓ తాహెరా సుల్తానా కూడా తననే కొనసాగించాలని అధికార పార్టీ నాయకుల ద్వారా ప్రయత్నించినా, అధికారులు మాత్రం పీఓగా నియమించేందుకే నిర్ణయించినట్లు చర్చ జరుగుతోంది. ఏదిఏమైనా రెండు, మూడు రోజుల్లో కొత్త డీఈఓ నియమాకంపై ఉత్తర్వులు రానున్నాయి. -
వేడుకగా కళాఉత్సవ్ పోటీలు
మెదక్‌రూరల్: మెదక్ మండలం హవేళిఘణాపూర్ గ్రామంలోని డైట్ కళాశాలలో గురువారం రెండోరోజు కళాఉత్సవ్ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా దృశ్య కళలు, నాటకీకరణ విభాగాల్లో జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. పోటీల్లో జిల్లా వ్యాప్తంగా నాటకీకరణంలో 10 పాఠశాలలు, దృశ్యకళల పోటీల్లో 16 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నట్లు ప్రిన్సినాల్ రమేష్‌బాబు తెలిపారు. కాగా నాటకీకరణ విభాగంలో సిద్దిపేటలోని గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రథమ బహుమతి, మెదక్‌పట్టణంలోని టీఎస్డబ్య్లుఆర్ఎస్ విద్యార్థులు ద్వితీయ బహుమతి, మెదక్ పట్టణంలోని టీఎస్ఆర్ఎస్ బాలికల పాఠశాల తృతీయ బహుమతులు సాధించాయి. అలాగే దృశ్యకళల విభాగంలో లక్డారం జెడ్పీహెచ్ఎస్ ప్రథమ బహుమతి, సిద్దిపేటలోని టీఎస్ఆర్ఎస్ ద్వితీయ బహుమతి, మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల తృతీయ బహుమతి సాధించాయి. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను ప్రిన్సిపాల్ రమేష్‌బాబు అందజేశారు. -
డైట్ అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట : హన్మకొండలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ అయ్యంగార్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు ఎన్సీటీఈ మార్గదర్శకాలకు అనుగుణంగా సంబంధిత సబ్జెక్టులో (పీజీ, ఎంఈడీ) కనీసం 50 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు. సంబంధిత హెచ్ఎంలు, ఎంఈఓల ఆమోదంతో రేషనలైజేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఒక సబ్జెక్టుకు ఒకరి కన్నా ఎక్కువ ఉంటేనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 26లోగా ప్రిన్సిపాల్ ప్రభుత్వ డైట్ కళాశాలకు దరఖాస్తులు అందజేయాలన్నారు. తెలుగు మీడియంలో తెలుగు, సైన్స్, సోషల్ మెథడ్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ టెక్నాలజీ, లైబ్రేరియన్, ల్యాబ్ టెక్నిషియన్, ఆర్ట్ ఎడ్యుకేషన్ పోస్టులతో పాటు ఉర్దూ మీడియంలో ఉర్దూ, ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్మెథడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇతర వివరాలకు, దరఖాస్తు ఫారాల కోసం డైట్ కళాశాలలోని సురేష్‌కుమార్‌ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. -
డైట్ కళాశాల ఎదుట ధర్నా
విద్యారణ్యపురి : డీఈడీ అభ్యర్థులను గురుకుల పాఠశాలల్లో టీజీపీ ఉపాధ్యాయులుగా నియమించాలని, డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు మంగళవారం హన్మకొండలోని డైట్ కళాశాల ఎదుట మంగళవారం ధర్నా చేశారు. గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకానికి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిందని, అందులో డీఈడీ అభ్యర్థులకు టీజీపీగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. డైట్ కళాశాలలో డీఈడీ అభ్యర్థులకు మెస్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ ధర్నాలో డీఎస్సీ అభ్యర్థులు ధరావత్ రవి, రామ్మోహన్‌రెడ్డి, శ్రీనునాయక్, అనిల్, కోటె, ప్రవళిక, కవిత, మౌనిక, తదితరులు పాల్గొన్నారు. -
గ్రీన్ డైట్
పచ్చదనాన్ని పరిచుకున్న డైట్ కళాశాల పాతికేళ్లుగా డ్రిప్‌తో మొక్కల పెంపకం పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న సిబ్బంది మెదక్ : ‘వృక్షో రక్షితి.. రక్షితహ’.. ఈ సామెతను కొందరు అధికారులు అక్షరసత్యం చేస్తున్నారు. ఛాత్రోపాధ్యాయులకు పాఠాలు బోధించడమే కాకుండా.. పర్యావరణ పరిరక్షణలో వారిని భాగస్వాములు చేస్తున్నారు. ఫలితంగా మెదక్ మండల పరిధిలోని హవేళిఘణపూర్ శివారులోని డైట్ కాలేజీలో పచ్చదనం ఉట్టిపడుతోంది. 18 ఎకరాల్లో... ఘణపూర్ శివారులో 18 ఎకరాల స్థలంలో 1990లో డైట్ కాలేజీ ఏర్పాౖటెంది. ఇందులో ఉర్దూ, ఇంగ్లిష్ మీడియంలకు సంబంధించిన సుమారు 300లకు పైగా ఛాత్రోపాధ్యాయులు ఏటా శిక్షణ పొందుతున్నారు. విశాలమైన స్థలం ఉండటంతో పాతికేళ్ల క్రితమే అధ్యాపక సిబ్బంది విరివిగా మొక్కలు నాటారు. బోరుబావి తవ్వించి డ్రిప్ పద్ధతిలో నీరు పెడుతున్నారు. దీంతో డైట్కాలేజీ గ్రీనరీని సొంతం చేసుకుంది. కళాశాల గదులు రెండు ఎకరాల్లో నిర్మించగా మిగతా 16 ఎకరాల్లో పచ్చదనం పరుచుకుంది. జిల్లాలోని పచ్చదనం ఉన్న ఏకైక కాలేజీకి పేరుగడించింది. పలు రకాల చెట్లు ఇక్కడ ముఖ్యంగా వేప, మామిడి, అల్లనేరేడు, అశోక, షో ట్రీస్, ఉసిరిచెట్లతో పాటు పలు రకాల పూలమొక్కలు ఏపుగా పెరిగాయి. స్వాగత తోరణం నుంచి దారికి ఇరువైపులా పొడవాటి చెట్లు స్వాగతం పలుకుతాయి. ఇంకొంచెం ముందుకెళ్తే కాలేజీ పరిసరాలు అడవిని స్ఫురింపజేస్తాయి. గత సంవత్సరం హరితహారంలో పథకంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్‌తో పాటు పలువురు డైట్కాలేజీలో మొక్కలు నాటారు. మొక్కల దత్తతు మొక్కలను నాటి వాటిని సంర క్షించినవారే తమ తల్లిదండ్రులతో పాటు సమాజాభివృద్ధికి తోడ్పడతారు. నిత్యం ఛాత్రోపాధ్యాయులకు పాఠాలతో పాటు పర్యావరణ రక్షణ గురించి ప్రాక్టికల్‌గా మొక్కలు నాటి, వాటిని వారికి దత్తత ఇస్తున్నాం. సిబ్బందితో పాటు అభ్యర్థుల కృషితో కాలేజీ ఆవరణ వనంలా మారింది. – రమేశ్‌బాబు, ప్రిన్సిపాల్ -
స్పెషల్ అసిస్టెంట్లు కరువు!
► ‘పది’ స్పాట్లో సగం మంది కూడా లేరు ► ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనివిద్యాశాఖ విద్యార్థుల జీవితాలతో చెలగాటం అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి జవాబు పత్రాలు మూల్యాంకనం చేయడం ఎంత ముఖ్యమో...వచ్చిన మార్కులు టోటలింగ్ చేయడం, మార్కుల పోస్టింగులు పరిశీలించడం అంతే ముఖ్యం. అయితే నగరంలోని కేఎస్ఆర్ బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి మూల్యాంకనంలో స్పెషల్ అసిస్టెంట్లు కరువయ్యారు. ప్రతి ముగ్గురు ఏఈ (అసిస్టెంట్ ఎగ్జామినర్)లకు ఒక స్పెషల్ అసిస్టెంట్ (ఎస్ఏ)ను ఇవ్వాల్సి ఉంది. ఈ లెక్కన రోజుకు 300 మందికి పైచిలుకు స్పెషల్ అసిస్టెంట్లు హాజరుకావాల్సి ఉంది. అయితే ఇందులో సగం మంది మాత్రమే వస్తున్నారు. దీంతో ఉన్నవారిపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఇవీ స్పెషల్ అసిస్టెంట్లు చేయాల్సిన పనులు అసిస్టెంట్ ఎగ్జామినర్లు పేపర్లు దిద్ది మార్కులు వేసిన తర్వాత స్పెషల్ అసిస్టెంట్లు జవాబుపత్రం తీసుకుని మార్కుల పోస్టింగులు, మార్కుల టోటలింగ్ పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏఈలు జవాబుపత్రాలు దిద్దుతున్న కంగారులో మార్కుల టోటలింగ్‌లో ఏవైనా తప్పులు జరిగే అవకాశం ఉంది. దీంతో మరోసారి స్పెషల్ అసిస్టెంట్లు వాటిని పరిశీలించి మార్కుల వివరాలను ధ్రువీకరిస్తారు. పొరబాటున ఏఈల చేతుల్లో టోటలింగ్‌లో తక్కువ వచ్చిన అంశాన్ని స్పెషల్ అసిస్టెంట్లు గుర్తించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. చాలీచాలని రెమ్యూనరేషన్ మూల్యాంకనం విధుల్లో పాల్గొంటున్న ఇతర అన్ని కేడర్ల కంటే కూడా స్పెషల్ అసిస్టెంట్లకే రెమ్యూనరేషన్ తక్కువ. ఏఈలకు డీఏ, పేపర్లు దిద్దినందుకుగాను రోజుకు సగటున రూ. 500 దాకా వస్తుంది. చీప్ ఎగ్జామినర్లకు ఇంతమాత్రతం వస్తుంది. అయితే స్పెషల్ అసిస్టెంట్లకు కేవలం రూ. 150తో సరిపెడుతున్నారు. డీఏ ఇవ్వడం లేదు. మండుతున్న ఎండలకు తోడు ఆశించిన స్థాయిలో రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడం వల్ల చాలామంది స్పెషల్ అసిస్టెంట్లుగా వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని విద్యాశాఖ కారణాలు ఏవైనా, ఎవరు వచ్చినా రాకపోయినా మూల్యాంకనం ఆగకూడదు. ఇదే సమయంలో స్పెషల్ అసిస్టెంట్లను తీసుకోవడానికి విద్యాశాఖ నిర్లక్ష్యం చేస్తోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదు. వచ్చిన 150 మంది స్పెషల్ అసిస్టెంట్లతోనే 300 మంది పని చేయిస్తున్నారు. ఇదిలా ఉండగా సమాచారం తెలియజేయడంలోనూ విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం క్యాంపు ఆఫీసరు డీఈఓ ఎం. అంజయ్య ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. డెప్యూటీ క్యాంపు అడ్మినిస్ట్రేటర్, డైట్ కళాశాల ప్రిన్సిపల్ మునెయ్య, స్ట్రాంగ్‌రూం ఇన్చార్జ్గా ఏసీ గోవిందునాయక్ ఆధ్వర్యంలో క్యాంపు నడిచింది. స్పెషల్ అసిస్టెంట్లు ఎంతమంది హాజరవుతున్నారని డెప్యూటీ క్యాంపు అడ్మినిస్ట్రేటర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా....పక్కనే ఉన్న స్ట్రాంగ్‌రూం ఇన్చార్జ్ గోవిందునాయక్కు సూచించారు. ఆయన ఏమాత్రం స్పందించకుండా ఫోన్లో మాట్లాడుకుంటూ నింపాదిగా గడిపారు. ‘స్పాట్’లో హల్‘సెల్’ పదో తరగతి జవాబు పత్రాలు మూల్యాంకనం విద్యార్థుల జీవితాలకు ముడిపడిన అంశం. ఇక్కడ ఏమాత్రం అజాగ్రత్త, నిర్లక్ష్యం, పొరబాటు చేసినా ఆ ప్రభా వం విద్యార్థులపై పడుతుంది. ఇంతటి ప్రాధాన్యతను గుర్తించే స్పాట్ కేంద్రంలో సెల్ఫోన్లు ఉపయోగించడాన్ని ప్రభుత్వం నిషేధించింది. ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులు పదేపదే చెబుతున్నారు. అయితే కేఎస్ఆర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో జరుగుతున్న స్పాట్లో ఏఈలు ఓ వైపు పేపర్లు దిద్దుతూనే మధ్యమధ్యలో ఎంచక్కా ఫోన్లలో మాట్లాడారు. -
30 మందికి ఐదుగురే!
డైట్లో తగ్గుతున్న లెక్చరర్ల సంఖ్య - కళాశాలలో కుంటుపడుతున్న విద్యాబోధన - ఆందోళనలలో విద్యార్థులు - పట్టించుకోని ప్రభుత్వం మెదక్ రూరల్: జిల్లాలోని ఏకైక డైట్ కళాశాలలో బోధకులు లేక చదువులు కుంటుపడుతున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ డైట్ కళాశాల హవేళిఘనపూర్ గ్రామ శివారులో ఉంది. ప్రస్తుతం కళాశాలలో తెలుగు, ఉర్దూ మీడియం కొనసాగుతుండగా తెలుగులో 100 మంది చాత్రోపాధ్యాయులు (అభ్యర్థులు) ఉండగా ఉర్దూ మీడియంలో 47 మంది ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తెలుగు మీడియం బోధించే లెక్చరర్లు ప్రిన్సిపాల్‌తో పాటు 25 మంది ఉండాలి. ఉర్దూ మీడియంలో ఐదుగురు లెక్చరర్లు ఉండాలి. ఈలెక్కన 30 మంది లెక్చరర్లు నిబంధనల ప్రకారం బోధించాలి. కాగా తెలుగు మీడియంలో ఇద్దరు పర్మనెంట్ లెక్చరర్లతో పాటు మరొకరు డిప్యూటేషన్‌పై వచ్చారు. అంటే తెలుగు మీడియంలో ముగ్గురు మాత్రమే ఉన్నారు. అలాగే ఉర్దూ మీడియంలో ఒకరు పర్మనెంట్ లెక్చరర్ ఉండగా మరొకరు డిప్యుటేషన్‌పై వచ్చారు. అంటే ఇద్దరు ఉన్నారు. తెలుగు, ఉర్దూ మీడియంలో ఐదుగురు మాత్రమే బోధిస్తున్నారు. గౌరవప్రదమైన ఉపాధ్యాయవృత్తిని ఎంచుకుని కష్టపడి చదివిన అభ్యర్థులు అసలు ఈ వృత్తిని ఎందుకు ఎంచుకున్నామా...అంటు ఆవేదన చెందుతున్నారు. సీటు సంపాదించుకున్నామే కానీ, బోధించేవారు లేక పోవటంతో మేము ఏం నేర్చుకోవాలి.. విద్యార్థులకు ఎలా బోధించాలి..అనే తికమకలో పడ్డామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రెండేళ్ల చదువు ఒకేసారి
దూబచర్ల (నల్లజర్ల రూరల్) :వారంతా డీఎడ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు. వారికి ఆ తరగతులు ప్రారంభమై మూడు నెలలవుతోంది. ఇంకా ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహించలేదు. కొత్తగా ప్రథమ సంవత్సరం విద్యార్థులు వచ్చి కళాశాలలో చేరారు. ద్వితీయ సంవత్సరం తరగతులు చదువుతున్నా ప్రథమ సంవత్సరం పరీక్షలు రాయకపోవడంతో తాము ద్వితీయ సంవత్సర విద్యార్థులమా? కాదా? అన్న సందేహం వారిలో వ్యక్తం అవుతోంది. ఇది దూబచర్లలో డైట్ కళాశాల ద్వితీయ సంవత్సర విద్యార్థుల ఆందోళన.. జిల్లాలో దూబచర్ల డైట్‌తో పాటు 30 ప్రైవేటు కళాశాలలున్నాయి. వీటిలో దాదాపు రెండువేల మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులున్నారు. వీరందరికీ అక్టోబరు 6న మొదటి సంవత్సరం సిలబస్ పూర్తయింది. అప్పుడే పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఎట్టకేలకు డిసెంబర్ 29 నుంచి పరీక్షలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం ఏకారణంగానో వాయిదా వేసింది. దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యా సంవత్సరం క్యాలెండర్ ప్రకారం పూర్తయితే త్వరలో నిర్వహించే డీఎస్సీకి అర్హత సాధించే వారమంటున్నారు. విద్యా సంవత్సరంలో తీవ్ర కాలయాపన జరగడంతో డీఎస్సీకి అర్హత కోల్పోయామంటున్నారు. ఇది మా భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. మొదటి సంవత్సర సిలబస్ గుర్తుంచుకుంటూ రెండవ సంవత్సరం చదవటం ఇబ్బందికరంగా ఉందంటున్నారు. రెండు సిలబస్‌లు చదవాల్సి వస్తోంది ఏ విద్యార్థి అయినా ఏ సంవత్సరం సిలబస్ ఆ సంవత్సరం చదువుతారు. కాని మేం రెండు సిలబస్‌లను చదవాల్సి వస్తోంది. రెండేళ్ల సిలబస్‌ను గుర్తుంచుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. - కె.కనక మహలక్ష్మీ. డీ.ఎడ్.విద్యార్థిని, దూబచర్ల డైట్. టీఎల్ ఎం చేయాలంటే కుదరడం లేదు టీపీకి వెళ్లాలంటే ముందుగా మేం విద్యార్థులకు బోధించేందుకు వీలుగా కృత్యాధార బోధనోపకరణాలు తయారు చేసుకుంటాం. దీన్ని కొన్నిరోజులు పాటు సిలబస్ షెడ్యూల్‌కు అనుగుణంగా తయారు చేసుకోవాలి. ప్రథమ సంవత్సరం పరీక్షలు ఆలస్యం కావడంతో వాటితో పాటు ద్వితీయ సంవత్సరం సిలబస్ చదువుకునేందుకే సమయం సరిపోతోంది. దీంతో టి.ఎల్.ఎం. తయారు చేయలేదు. ఇది టీపీపై ప్రభావం చూపుతుంది. - కోరాడ తిరుపతి. డీఎడ్ విద్యార్థి. దూబచర్ల డైట్. -
ప్రశాంతంగా ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్ష
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగిన ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్షకు 8,168 మంది విద్యార్థులు హాజరు కావల్సి ఉండగా 755 మంది గైర్హాజరు అయ్యారు. 7,413 మంది హాజరయ్యారు. ఏపీఆర్డీసీ ప్రవేశ పరీక్షకు 521 మంది విద్యార్థులు హాజరు కావల్సి ఉండగా 476 మంది విద్యార్థులు హాజరయ్యారు. 45 మంది గైర్హాజరు అయ్యారు. మొత్తం 8689 మంది విద్యార్థులు హాజరు కావల్సి ఉండగా 7,889 మంది విద్యార్థులు హాజరయ్యారు. 800మంది గైర్హాజరు అయ్యారు. మహబూబ్‌నగర్ గ్రామర్ స్కూల్, డైట్ కళాశాల తది తర పరీక్ష కేంద్రాలను డీఈఓ చంద్రమోహన్ తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.