ఉపాధ్యాయ ‘మిథ్య’ | Shortage of teachers at district Educational Institution | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ ‘మిథ్య’

Published Mon, Sep 18 2017 2:00 AM | Last Updated on Fri, Sep 28 2018 4:43 PM

ఉపాధ్యాయ ‘మిథ్య’ - Sakshi

ఉపాధ్యాయ ‘మిథ్య’

డైట్‌ కాలేజీల్లో కుంటుపడుతున్న బోధన
- ఒకే గదిలో తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం  విద్యార్థులకు పాఠాలు
తెలుగు మీడియంలోనే బోధన.. ఇంగ్లిష్‌ మీడియం వారికి గందరగోళం
ఇలా తెలుగులో డీఎడ్‌ చేస్తే.. ఇంగ్లిష్‌లో బోధించేదెలా?
పట్టించుకోని ప్రభుత్వం, డైరెక్టు రిక్రూట్‌ మెంట్‌ పోస్టులనైనా భర్తీ చేయని వైనం  
అధ్యాపకుల కొరతతో ఇబ్బందులు..   80% పోస్టులు ఖాళీ
 
ఇది మహబూబ్‌నగర్‌లోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్‌)లోని తరగతి గది. డీఎడ్‌ కోర్సు చదువుతున్న ఈ విద్యార్థుల్లో ఒక వైపు ఉన్నది తెలుగు మీడియం వారుకాగా.. మరోవైపు ఉన్నది ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థులు. రెండు మీడియంల వారికి ఒకే తరగతి గదిలో తెలుగులోనే బోధన జరుగుతోంది.
 
బోధించే అంశాలు అర్థంకావట్లేదు 
నేను ఏడో తరగతి నుంచి పూర్తిగా ఇంగ్లిష్‌ మీడియంలోనే చదువుకున్నా. ఉపాధ్యాయ శిక్షణకు ఇంగ్లిష్‌ మీడియంలో ప్రవేశం పొందాను. కాని రెండు మీడియంల విద్యార్థులను కలిపి కూర్చోబెట్టి.. తెలుగులో బోధించడంతో ఇబ్బంది పడాల్సి వస్తోంది. సరిగా అర్థం కావడం లేదు కూడా.. 
- కె.చరణ్, వరంగల్‌ ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థి
 
ప్రత్యేకంగా బోధించేలా చర్యలు..
ఇంగ్లిష్‌ మీడియంలో బోధనకు ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నాం. గెస్ట్‌ లెక్చరర్లను నియమిస్తాం. అక్టోబర్, నవంబర్‌లలో ఓరియంటేషన్‌ తరగతులను నిర్వహించబోతున్నాం. ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్‌ అమల్లోకి వచ్చాక పదోన్నతులు ఇవ్వాలని, రెగ్యులర్‌ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది..’’ 
– బి.శేషుకుమారి, ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌ 
 
ఆదరాబాదరాగా మొదలు 
రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను ప్రారంభించింది. భవిష్యత్తులో వాటిల్లో ఇంగ్లిష్‌ మీడియంలో బోధించే ఉపాధ్యాయ అభ్యర్థుల అవసరాన్ని గుర్తించి.. ఈసారి నుంచి ఇంగ్లిష్‌ మీడియంలోనూ డీఎడ్‌ కోర్సును ప్రారంభించింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు కూడా చేరారు. కానీ అధ్యాపకుల కొరత కారణంగా ఇంగ్లిష్‌ మీడియంలో బోధన జరపలేని పరిస్థితి నెలకొంది. తెలుగులోనే బోధన కొనసాగుతోంది. దీంతో ఈ అభ్యర్థులు ఇంగ్లిష్‌ మీడియం టీచర్లు ఎలా అవుతారు, విద్యార్థులకు ఎలా బోధిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 
 
కొత్తగా ఒక్క పోస్టూ ఇవ్వని వైనం 
రాష్ట్రంలో ప్రైవేటు డీఎడ్‌ కాలేజీలు కాకుండా 10 డైట్‌లు ఉన్నాయి. ఒక్కో డైట్‌లో 100 డీఎడ్‌ సీట్లు ఉన్నాయి. 2017–18 విద్యా సంవత్సరానికిగాను వీటిలో 50 సీట్లను తెలుగు మీడియం విద్యార్థులతో, మరో 50 సీట్లను ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థులతో భర్తీ చేశారు. కానీ ఇంగ్లిష్‌ మీడియం బోధనకు అధ్యాపకులను ఇవ్వడం మరచిపోయారు. విద్యాశాఖ ఆ కోర్సును బోధించేందుకు అవసరమైన అదనపు పోస్టులను మంజూరు చేయలేదు. ఇప్పటికే అరకొరగా ఉన్న తెలుగు మీడియం లెక్చరర్లతోనే నెట్టుకొస్తోంది. కనీసం ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయడం లేదు. వాస్తవానికి డైట్‌ లెక్చరర్లుగా పదోన్నతి కల్పించాల్సిన పోస్టులకు సర్వీసు రూల్స్‌ సమస్య ఉంది. ఈ సమస్య లేని డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ పోస్టులనైనా భర్తీ చేయాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) మొత్తుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనీసం సరిపడా తాత్కాలిక లెక్చరర్లనైనా నియమించలేదు. దీంతో ఇంగ్లిష్‌ మీడియం డీఎడ్‌ను ప్రవేశపెట్టినా ఫలితం లేని పరిస్థితి నెలకొంది. 
 
వరంగల్‌లోని డైట్‌ తరగతి గది ఇది. ఇక్కడా ఓవైపు తెలుగు మీడియం, మరోవైపు ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థులు. లెక్చరర్‌ బోధిస్తున్నది తెలుగులోనే. 
 
రాష్ట్రంలోని డైట్‌ కాలేజీల్లో నెలకొన్న దుస్థితి ఇది. ప్రత్యేకంగా ఇంగ్లిష్‌ మీడియంలో డీఎడ్‌ కోర్సు చేసేందుకు వచ్చిన అభ్యర్థులకు కూడా తెలుగు మీడియమే దిక్కవుతోంది. డైట్‌ కాలేజీల్లో అధ్యాపకుల కొరతే దీనికి కారణమవుతోంది. అంతేకాదు ఏకంగా 80 శాతం ఖాళీలు ఉండడంతో తెలుగు మీడియంలో బోధన కూడా అంతంత మాత్రంగానే సాగుతోంది. 
 
ఎస్‌సీఈఆర్టీ దృష్టికి తీసుకెళ్లాం 
అధ్యాపకుల కొరత కారణంగా తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంల విద్యార్థులను ఒకే గదిలో కూర్చోబెట్టి బోధిం చాల్సిన పరిస్థితి ఉంది. ఇంగ్లిష్‌ మీడియంలో విద్యా బో«ధనకు 16 మంది కావాలి. ఎంత సర్దుబాటు చేసినా 8 మంది అయినా అవసరం. కానీ అందుబాటులో లేరు. రెండు మీడియంల విద్యార్థులతో కంబైన్డ్‌ క్లాస్‌లు నిర్వహించాలని విద్యాశాఖ చేసిన సూచన మేరకు బోధన కొనసాగిస్తున్నాం..
రవికుమార్‌ వరంగల్‌ డైట్‌ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement