డైట్‌ కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అరెస్టు | Diet college assistant professor arrested | Sakshi
Sakshi News home page

డైట్‌ కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అరెస్టు

Published Sat, Aug 31 2024 5:01 AM | Last Updated on Sat, Aug 31 2024 5:01 AM

Diet college assistant professor arrested

ఏడాది కాలంగా విద్యార్థినికి వేధింపులు

అరెస్టు, రిమాండ్‌ను గోప్యంగా ఉంచిన అనకాపల్లి పోలీసులు

సాక్షి, అనకాపల్లి :  అధికార పార్టీకి సంబంధించినవైతే చాలు పోలీసులు ఎలాంటి ఘోరాలు, నేరాలు అయినా నోరు మెదపడంలేదు. టీడీపీ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కుమారుడు రత్నాకర్‌ అనకాపల్లిలో నడుపుతున్న దాడి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (డైట్‌) అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆగడాలే ఇందుకు ఉదాహరణ. మెంటార్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్‌ మురళి తనను వేధిస్తున్నాడని ఇంజినీరింగ్‌ సెకండియర్‌ విద్యార్థిని చాలాకాలంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎట్టకేలకు అరెస్టుచేసి శుక్రవారం రిమాండ్‌కు పంపారు. 

కానీ, ఈ విషయాన్ని అనకాపల్లి టౌన్‌ పోలీసులు చాలా గోప్యత పాటిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం..  మెంటార్‌ మురళి ఏడాది కాలంగా వేధిస్తున్నాడని బాధితురాలు పేర్కొంటోంది. ప్రతిరోజు రాత్రులు తనకు ఫోన్‌చేసి మాట్లాడాలని, వాట్సాప్‌ మెసేజ్‌లు చేయాలని, కళాశాలకు వచ్చినప్పుడు తనను కలవాలని, హగ్‌ చేసుకోవాలని రకరకాలుగా వేధిస్తుండటంతో ఆమె నరకం అనుభవిస్తోంది. అతని వేధింపులు భరించలేక తన స్నేహితుడికి సమస్యలు వివరించడంతో.. ఇటీవల ఆ యువకుడు మురళిని ప్రశ్నించగా ‘నీకేందుకురా పో’.. అంటూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ దురుసుగా ప్రవర్తించాడు. 

మీ ఇద్దరి మధ్య వేరే సంబంధం ఉందని మీ తల్లిదండ్రులకు చెబుతానని బెదిరించాడు. అధ్యాపకుడి ఫోన్‌కాల్‌ రికార్డింగ్‌ ఆధారంగా కళాశాలలో ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో బాధిత విద్యార్థిని జిల్లా పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు సైతం ఈ విషయాలను రహస్యంగా ఉంచడం విస్మయం కలిగిస్తోంది. మరోవైపు.. తమ కుమార్తెపట్ల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు బాధితురాలి తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు­చేశారు. దీంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న­ట్లు సీఐ చెప్పారు. 

నిందితుడ్ని 14రోజులపాటు రిమాండ్‌ విధించినట్లు విశ్వసనీయ సమాచారం. కానీ, ఈ విషయం సీఐ వెల్లడించకపోవడం గమనార్హం. ఇక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మురళి గతంలో చాలామందిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, కళాశాలలో మెంటర్‌ కావడంతో విద్యార్థులు మౌనంగా భరిస్తున్నారని ఇతర విద్యార్థులు చెబుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement