స్పెషల్ అసిస్టెంట్లు కరువు! | Special Assistants drought! | Sakshi
Sakshi News home page

స్పెషల్ అసిస్టెంట్లు కరువు!

Published Mon, Apr 11 2016 3:52 AM | Last Updated on Sun, Sep 3 2017 9:38 PM

స్పెషల్ అసిస్టెంట్లు కరువు!

స్పెషల్ అసిస్టెంట్లు కరువు!

‘పది’ స్పాట్‌లో సగం మంది కూడా లేరు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనివిద్యాశాఖ విద్యార్థుల జీవితాలతో చెలగాటం
 

 
అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి జవాబు పత్రాలు మూల్యాంకనం చేయడం ఎంత ముఖ్యమో...వచ్చిన మార్కులు టోటలింగ్ చేయడం, మార్కుల పోస్టింగులు పరిశీలించడం అంతే ముఖ్యం. అయితే నగరంలోని కేఎస్‌ఆర్ బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి మూల్యాంకనంలో స్పెషల్ అసిస్టెంట్లు కరువయ్యారు. ప్రతి ముగ్గురు ఏఈ (అసిస్టెంట్ ఎగ్జామినర్)లకు ఒక స్పెషల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ)ను ఇవ్వాల్సి ఉంది. ఈ లెక్కన రోజుకు 300 మందికి పైచిలుకు స్పెషల్ అసిస్టెంట్లు హాజరుకావాల్సి ఉంది. అయితే ఇందులో సగం మంది మాత్రమే వస్తున్నారు. దీంతో ఉన్నవారిపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది.

 ఇవీ స్పెషల్ అసిస్టెంట్లు చేయాల్సిన పనులు
అసిస్టెంట్ ఎగ్జామినర్లు పేపర్లు దిద్ది మార్కులు వేసిన తర్వాత స్పెషల్ అసిస్టెంట్లు జవాబుపత్రం తీసుకుని మార్కుల పోస్టింగులు, మార్కుల టోటలింగ్ పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏఈలు జవాబుపత్రాలు దిద్దుతున్న కంగారులో మార్కుల టోటలింగ్‌లో ఏవైనా తప్పులు జరిగే అవకాశం ఉంది. దీంతో మరోసారి స్పెషల్ అసిస్టెంట్లు వాటిని పరిశీలించి మార్కుల వివరాలను ధ్రువీకరిస్తారు. పొరబాటున ఏఈల చేతుల్లో టోటలింగ్‌లో తక్కువ వచ్చిన అంశాన్ని స్పెషల్ అసిస్టెంట్లు గుర్తించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

 చాలీచాలని రెమ్యూనరేషన్
మూల్యాంకనం విధుల్లో పాల్గొంటున్న ఇతర అన్ని కేడర్ల  కంటే కూడా స్పెషల్ అసిస్టెంట్లకే రెమ్యూనరేషన్ తక్కువ. ఏఈలకు డీఏ, పేపర్లు దిద్దినందుకుగాను రోజుకు సగటున రూ. 500 దాకా వస్తుంది. చీప్ ఎగ్జామినర్లకు ఇంతమాత్రతం వస్తుంది. అయితే స్పెషల్ అసిస్టెంట్లకు కేవలం రూ. 150తో సరిపెడుతున్నారు. డీఏ ఇవ్వడం లేదు. మండుతున్న ఎండలకు తోడు ఆశించిన స్థాయిలో రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడం వల్ల చాలామంది స్పెషల్ అసిస్టెంట్లుగా వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.

 ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని విద్యాశాఖ
కారణాలు ఏవైనా, ఎవరు వచ్చినా రాకపోయినా మూల్యాంకనం ఆగకూడదు. ఇదే సమయంలో స్పెషల్ అసిస్టెంట్లను తీసుకోవడానికి విద్యాశాఖ నిర్లక్ష్యం చేస్తోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదు. వచ్చిన 150 మంది స్పెషల్ అసిస్టెంట్లతోనే 300  మంది పని చేయిస్తున్నారు.

 ఇదిలా ఉండగా సమాచారం తెలియజేయడంలోనూ విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం క్యాంపు ఆఫీసరు డీఈఓ ఎం. అంజయ్య ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. డెప్యూటీ క్యాంపు అడ్మినిస్ట్రేటర్, డైట్ కళాశాల ప్రిన్సిపల్ మునెయ్య, స్ట్రాంగ్‌రూం ఇన్‌చార్జ్‌గా ఏసీ గోవిందునాయక్ ఆధ్వర్యంలో క్యాంపు నడిచింది. స్పెషల్ అసిస్టెంట్లు ఎంతమంది హాజరవుతున్నారని డెప్యూటీ క్యాంపు అడ్మినిస్ట్రేటర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా....పక్కనే ఉన్న స్ట్రాంగ్‌రూం ఇన్‌చార్జ్ గోవిందునాయక్‌కు సూచించారు. ఆయన ఏమాత్రం స్పందించకుండా ఫోన్‌లో మాట్లాడుకుంటూ నింపాదిగా గడిపారు.
 
 ‘స్పాట్’లో హల్‌‘సెల్’
పదో తరగతి జవాబు పత్రాలు మూల్యాంకనం విద్యార్థుల జీవితాలకు ముడిపడిన అంశం. ఇక్కడ ఏమాత్రం అజాగ్రత్త, నిర్లక్ష్యం, పొరబాటు చేసినా ఆ ప్రభా వం విద్యార్థులపై పడుతుంది. ఇంతటి ప్రాధాన్యతను గుర్తించే స్పాట్ కేంద్రంలో సెల్‌ఫోన్లు ఉపయోగించడాన్ని ప్రభుత్వం నిషేధించింది. ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులు పదేపదే చెబుతున్నారు. అయితే కేఎస్‌ఆర్ ప్రభుత్వ బాలికల  పాఠశాలలో జరుగుతున్న స్పాట్‌లో ఏఈలు ఓ వైపు పేపర్లు  దిద్దుతూనే మధ్యమధ్యలో ఎంచక్కా ఫోన్లలో మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement