ఎవరిదీ ‘నేరం’
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లాలో రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. చివరికి పోలీసు వ్యవస్థ పనితీరునే ప్రశ్నించే స్థాయికి చేరాయి. పోలీసు అధికారుల పోస్టింగుల్లో రాజకీయ ఒత్తిళ్లు సిబ్బంది పనితీరును ప్రభావితం చేస్తున్నాయి. క్షేత్రస్థాయి అధికారులు ఆదాయ మార్గాలపైనే దృష్టిసారిస్తూ శాంతిభద్రతల పరిరక్షణ గాలికొదిలేస్తున్నారు. సమాచార సేకరణ, నేరాల నిరోధం, కేసుల విచారణ వంటి కీలక అంశాలపై శ్రద్ధ చూపడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గత మూడేళ్లుగా నమోదవుతున్న కేసుల సంఖ్యను పరిశీలిస్తే ఈ విషయాలే స్పష్టమవుతున్నాయి. ప్రతిపాదనలు ఉన్నచోట కొత్త పోలీస్‌స్టేషన్లు పట్టాలెక్కడం లేదు.
జిల్లాలో ఉన్న 20 పోలీసు సర్కిళ్ల పరిధిలో 74 పోలీస్‌స్టేషన్లు పనిచేస్తున్నాయి. వీటితో పాటు సీసీఎస్, మహిళా, ట్రాఫిక్ పోలీసు విభాగాలు ఉన్నాయి. జిల్లాలో హత్యలు, చోరీలు, దోపిడీలు, కిడ్నాప్‌లు, అత్యాచారాలు, మహిళలపై లైంగిక వేధింపులు.. ఇలా ఏ కేటగిరీని తీసుకున్నా అదేస్థాయిలో ఉన్నాయి. నేరాలను నియంత్రించాల్సిన పోలీసు యంత్రాంగం పనితీరు పలు విమర్శలకు తావిస్తోంది. గతంతో పోలిస్తే జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా తగ్గినా.. ఇతర నేరాల నియంత్రణలో పోలీసుశాఖ పనితీరుపై ఆరోపణలు వ స్తున్నాయి. తాము కోరుకున్న చోట పోస్టింగులు తెచ్చు కోవడంపై ఉన్న శ్రద్ధ నేరపరిశోధన, నియంత్రణపై చూపడం లేదనే విమర్శలు కోకొల్లలు.
పోస్టింగుల్లో రాజకీయ జోక్యంతో కొందరు అధికారులు డబ్బు సంపాదనే ధ్యేయంగా పావులు కదుపుతున్నారు. ఇసు క, క్వారీలు, బెల్టు షాపులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం వంటి దందాలు పెద్దఎత్తున జరిగే పోలీసుస్టేషన్ల పరిధిలో పోస్టింగులకు మంచి డిమాండ్ ఉంది. ‘గబ్బర్‌సింగ్’లా మారిన కొందరు అధికారులు పోలీసు విధుల నిర్వహణపై కనీసదృష్టి పెట్టడంలేదని సొంతశాఖలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. నెలలో ఒకసారైనా తమ పరిధిలోని గ్రామాలను సందర్శించకపోవడం, సమాచార వ్యవస్థపై దృష్టిసారించకపోవడం, నేరచరితులు, శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై నిఘా లేకపోవడం వంటి అంశాలు పోలీసుల పనితీరుకు అద్దం పడుతున్నాయి. క్షేత్రస్థాయి నుంచి సరైన సమాచారం ఇచ్చే వ్యవస్థ లేకపోవడంతో నేర పరిశోధన, నియంత్రణపై పోలీసు యంత్రాంగం పట్టు కోల్పోతోంది.
పునర్‌వ్యవస్థీకరణ ఎప్పుడో?
జిల్లాలోని కొన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో పని ఒత్తిడి కూడా శాంతి భద్రతల పరిరక్షణపై ప్రభావం చూపుతోంది. జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్ పట్టణాల్లో జనాభా వేగంగా పెరగడం, ఇతరత్రా వ్యాపారాలు పుంజుకోవడంతో నేరాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. అయితే జనాభాకు అనుగుణంగా పోలీస్ స్టేషన్లు లేకపోవడంతో సిబ్బంది ఉరుకులు పరుగులు తీయాల్సి వస్తోంది. గతంలో మహబూబ్‌నగర్‌లో త్రీటౌన్, జడ్చర్ల, వనపర్తి, కొత్తకోట, గద్వాలలో టూ టౌన్ పోలీసు స్టేషన్ల ఏర్పాటుకు పోలీసు ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపారు. కొత్తకోట కేంద్రంగా మరో సర్కిల్ కూడా ఏర్పాటు చేయాల్సిందిగా ప్రతిపాదించారు. కొత్త పోలీసుస్టేషన్ల ఏర్పాటు ప్రతిపాదనలు రాష్ట్ర స్థాయిలో పరిశీలనలో ఉన్నట్లు హైదరాబాద్ రేంజ్ డీఐజీ, జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ టీవీ శశిధర్‌రెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు.
సొంతగూటికి చేరేదెప్పుడో?
మావోయిస్టుల కార్యకలాపాలు ముమ్మరంగా సాగిన కాలంలో పోలీసు స్టేషన్ల రక్షణను దృష్టిలో పెట్టుకుని సమీప పట్టణాలకు తరలించారు. సిద్దాపూర్, ఉప్పునుంతల స్టేషన్లు అచ్చంపేటకు, ఈగలపెంట స్టేషన్‌ను అమ్రాబాద్‌కు, తలకొండపల్లి స్టేషన్‌ను ఆమనగల్లుకు, కోడేరు స్టేషన్‌ను కొల్లాపూర్‌కు తరలించారు. తర్వాతి కాలంలో సిద్దాపూర్, ఈగలపెంట మినహా మిగతా పోలీసు స్టేషన్లు స్వస్థలాలకు తరలివెళ్లాయి. నూతన భవనం నిర్మిస్తున్నారనే కారణంతో సిద్దాపూర్ స్టేషన్‌ను అచ్చంపేటలోనే కొనసాగిస్తున్నారు. తెలంగాణ ఏర్పా టు నేపథ్యంలో ఈగలపెంట పోలీసు స్టేషన్‌ను తరలిం చాల్సి ఉన్నా ఇంకా అమ్రాబాద్‌లోనే కొనసాగిస్తున్నారు.