మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్
మహబూబ్‌నగర్ క్రైం : ఈ పోలీస్‌స్టేషన్ పరిధి ఎక్కువ.. నిత్యం ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతాయి. ఇద్దరు ఎస్‌ఐలు అక్కడ అవసరమవుతారు. కానీ ఒక్క ఎస్‌ఐ కూడా లేకుండా గత పది రోజుల నుంచి పోలీస్ స్టేషన్ నడిపిస్తున్న పరిస్థితి ఉంది. జిల్లాకేంద్రంలోని రూరల్ పోలీస్‌స్టేషన్‌లో పదిరోజుల నుంచి ఎస్‌ఐ స్థాయి అధికారి లేకుండానే పోలీస్ వ్యవహారాలు నడుస్తున్నాయి. గతంలో పనిచేస్తున్న ఎస్‌ఐ పది రోజుల నుంచి దీర్ఘకాలిక సెలవులో వెళ్లగా.. ఆయనను రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు సోమవారం రాత్రి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రూరల్ మొదటి ఎస్‌ఐ పోస్టు ఖాళీ అయ్యింది. ఈ క్రమంలో రోజువారిగా అయ్యే కేసుల దగ్గర నుంచి ఇతర నేరాలను అదుపు చేయడం బందోబస్తు, ఇతర విషయాలకు సమస్యగా మారింది. ప్రధానంగా ప్రస్తుతం దసరా సెలవులు ఉండటం వల్ల రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోరీలు అధికంగా జరిగే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో పోలీసులు బందోబస్తు ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం రూరల్ ఇద్దరు ఎస్‌ఐల పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల ఆ బాధ్యత సీఐతోపాటు ఏఎస్‌ఐలపై పడింది.
తాత్కలికంగా కేటాయిస్తారా?
రూరల్ పోలీస్ స్టేషన్‌కు తాత్కలికంగా ఓ ఎస్‌ఐని కేటాయించాలని ఇప్పటికే ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఎస్పీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే టూటౌన్‌లో పనిచేసే ఓ ఎస్‌ఐని రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తాత్కాలిక ఎస్‌ఐగా నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. రెగ్యులర్ ఎస్‌ఐ వచ్చే వరకు తాత్కాలిక ఎస్‌ఐకి బాధ్యతలు అప్పాగిస్తారా.. లేకుంటే రెగ్యులర్ ఎస్‌ఐనే నియామకం చేస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి రూరల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న వారిపై చాలా ఆరోపణలు రావడం జరుగుతుంది.
చాలాకాలం నుంచి అక్కడే..
పట్టణంలో ఉన్న పోలీస్ స్టేషన్‌లలో చాలాకాలం ఒకే స్టేషన్‌లో పనిచేస్తున్న రైటర్లతోపాటు డ్రైవర్లు ఉన్నారు. దాదాపు 13, 8, ఆరేళ్ల నుంచి కూడా ఒకే పోలీస్‌స్టేషన్‌లో పని చేయడం వల్ల స్థానికంగా పట్టు సాధించి స్టేషన్ వ్యవహారాలు పూర్తిగా వారి చేతులోకి తీసుకుంటున్నారు. ఇలా ఒకే పోలీస్ స్టేషన్‌లో పాతుకుపోవడం వల్ల పోలీస్‌స్టేషన్‌కు సంబంధించిన ప్రతి విషయంలో వారికి తెలియకుండా ముందుకు సాగడం లేదు. ఒక పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే రైటర్లు ఎస్‌ఐ అందుబాటులో లేకుంటే జీడీతోపాటు డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ చెప్పిన స్టేట్‌మెంట్, రికార్డులు రాయడం, పంచనామాలు, రిజిష్టర్‌లలో వివరాలు నమోదు చేయడం చేస్తారు. దీంట్లో పంచనామాలు రాయడానికి రైటర్లు క్షేత్రస్థాయికి వెళ్లిన సమయంలో బాధితుల నుంచి మామూళ్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా బుధవారం సాయంత్రం తాత్కాలిక ఎస్‌ఐగా రాజేందర్ బాధ్యతలు చేపట్టారు.