ప్యాకేజీ-1లో ఇంజనీర్ల మధ్య కుదరని ఏకాభిప్రాయం
సాక్షి, హైదరాబాద్: పాలమూరు ప్రాజెక్టు ఒకటో ప్యాకేజీలో మార్పులపై సందిగ్ధత కొనసాగుతోంది. అందులో మార్పులు చేయాలని పలువురు ఇంజనీర్లతోపాటు కాంట్రాక్టు సంస్థ చెబుతుండగా.. ఆ అవసరం లేదని మరికొందరు వాదిస్తున్నారు. దీనిపై ఇంజనీర్లు బుధవారం మరోసారి చర్చించి నా.. ఏకాభిప్రాయం రాకపోవడంతో ఉన్నతాధికారుల నిర్ణయానికి వదిలేశారు. ఒకటో ప్యాకేజీలో ఉన్న పంపుహౌస్ ప్రాంతంలో 287 ఎకరాల అటవీ భూమి ఉంది. దాంతో పంపింగ్ స్టేషన్ నిర్మాణ స్థలాన్ని మార్చాలని కాంట్రాక్టు ఏజెన్సీ ప్రభుత్వానికి నివేదిం చింది. లేకపోతే అధికారులు ప్రతిపాదించినట్లుగా భూగర్భ పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి అనుమతించాలని కోరింది.
ఈ ప్రతిపాదనలను అధికారులు తిరస్కరించారు. నిర్మాణ ప్రాంతాన్ని మార్చి, బ్లాస్టింగ్ వంటివి చేస్తే 300 మీటర్ల దూరంలోనే ఉన్న కల్వకుర్తి పంప్‌హౌస్ పునాదులు బీటలు వారే అవకాశం ఉంటుందన్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌కు దగ్గరగా భూగర్భంలో పంప్‌హౌస్ నిర్మిస్తే సీపేజీ నష్టాలు ఉంటాయని, వరదల సమయంలో పంప్‌హౌస్ మునిగే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. పంపుహౌస్ నుంచి అప్రోచ్ చానల్ వీలైనంత దగ్గరగా ఉండాలన్నారు. కాంట్రాక్టు సంస్థ చెప్పినట్లు మారిస్తే అది 1.5 కి.మీ. నుంచి 2.5 కి.మీ.కు పెరుగుతుందని, దీంతో పూడిక పెరిగే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
అయితే మరికొందరు ఇంజనీర్లు దీనితో విభేదిస్తున్నారు. ప్యాకేజీ-1 పనులను యధావిధిగా కొనసాగిస్తే అటవీ శాఖ నుంచి ఇబ్బందులు తప్పవని.. ఎలాంటి అనుమతులు లేకుండా పనులు చేపట్టడం అటవీ చట్టాలను ఉల్లఘించడమేనని స్పష్టం చేస్తున్నారు. ప్రాజెక్టుకు ఇదే మొదటి పంపుహౌస్ అయినందున.. దీని నిర్మాణం ఆగితే మొత్తం ప్రాజెక్టు ఆగుతుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పంపుహౌస్‌ను భూగర్భంలో నిర్మించడమే సమంజసమని అంటున్నారు.