తమాషా చేస్తున్నారా? : కలెక్టర్‌ ఫైర్‌ | Collector Fires On Market Officials In Mahabubnagar | Sakshi
Sakshi News home page

తమాషా చేస్తున్నారా?

Published Tue, Oct 1 2019 11:44 AM | Last Updated on Tue, Oct 1 2019 11:44 AM

Collector Fires On Market Officials In Mahabubnagar - Sakshi

సమావేశంలో పాల్గొన్న అధికారులు

సాక్షి, నారాయణపేట: పొద్దస్తమానం కష్టపడి రైతులు పంటలు పండిస్తే వారికి మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో దళారులతో పంటను ఎలా కొనుగోలు చేస్తారు..? ఇది ఎంతవరకు సమంజసం అని కలెక్టర్‌ ఫైర్‌ అయ్యారు. సోమవారం “పెసర పంచాయితీ’పై స్థానిక కలెక్టరేట్‌లో మార్క్‌ఫెడ్‌ అధికారులు, వ్యవసాయశాఖ అధికారులు, ఉట్కూర్‌ పీఏసీఎస్‌ నిర్వాహకులపై కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. అధికార వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం.. మార్క్‌ఫెడ్‌ అధికారులపై కలెక్టర్‌ బాగానే సీరియస్‌ అయినట్లు తెలిసింది. అసలు కొనుగోలు కేంద్రంలోకి మార్కెట్‌ పాలకవర్గం వారికి పనేంటీ..? వారు ఎందుకు వచ్చారో చెప్పాలని సూటిగా అడిగినట్లు సమాచారం. మార్కెట్‌ పాలకవర్గంలోని ఒకరిద్దరు ప్రతినిధులు హడావుడి చేస్తూ టోకెన్లు ఇప్పించి పెసరను కొనుగోలు చేయించడంలో అంతర్యమేమిటో చెప్పాలని గట్టిగా నిలదీసినట్లు తెలిసింది.

తేమ శాతం చూడకుండానే విక్రయాలా? 
కొనుగోలు కేంద్రాన్ని విక్రయించేందుకు వచ్చే రైతులు తెచ్చిన పెసరను ముందుగా తేమశాతం పరిశీలించకుండా ఎలా కొన్నారని.. లోడింగ్‌ చేసి వాపస్‌ వచ్చిన లారీల పరిస్థితి ఏంటీ అని మార్క్‌ఫెడ్‌ అధికారులపై కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. వెంటనే లారీల్లోని సరుకును సరిచూసి ఆరబెట్టి వాటిని తిరిగి పంపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. మంగళవారం సాయంత్రం వరకు ఇప్పటి వరకు తీసుకువచ్చిన పెసరను కొనుగోలు చేయాలని, అందులో ఏవరైనా దళారులు తెచ్చినట్లు తెలితే వారిపై క్రిమినల్‌కేసులు పెట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిసించినట్లు తెలుస్తోంది.

నివేదికలు వచ్చాక చర్యలు 
ఈ విషయంపై క్షేత్రస్థాయిలో విచారణ జరుగుతోందని, పూర్తిస్థాయిలో నివేదికలు వచ్చిన తర్వాత ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకుని చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించినట్లు తెలిసింది. ఇకపై మార్కెట్‌ పాలకవర్గం వారు ఎవరైనా కొనుగోలు కేంద్రంలో కాలు పెడితే బాగుండదని, కేవలం ఊట్కూర్‌ పీఏసీఎస్‌ వారితో మాత్రమే కొనుగోలు చేయించుకోండని హెచ్చరించినట్లు సమాచారం. సమీక్ష సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్‌సుధాకర్, మార్క్‌ఫెడ్‌ డీఎం హన్మంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ అధికారులు ఉన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement