గోదావరి వరదలకు శాశ్వత పరిష్కారం | CM Jagan In Review Meeting officers of both Godavari districts | Sakshi
Sakshi News home page

గోదావరి వరదలకు శాశ్వత పరిష్కారం

Published Wed, Jul 27 2022 4:37 AM | Last Updated on Wed, Jul 27 2022 4:37 AM

CM Jagan In Review Meeting officers of both Godavari districts - Sakshi

అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఏటా గోదావరికి వచ్చే వరదలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. గోదావరి వరద ప్రభావిత జిల్లాల మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో మంగళవారం రాత్రి సీఎం రాజమహేంద్రవరంలో సమీక్షించారు. 1986 వరదల తర్వాత ఆ స్థాయిలో గోదావరికి దాదాపుగా 28 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఈ ఏడాది వచ్చిందని.. భవిష్యత్తులో ఇందుకు అనుగుణంగా నియంత్రణ చర్యలు ఉండాలని సీఎం ఆదేశించారు. ఏటిగట్లు ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నాయో గుర్తించాలని, శాశ్వత చర్యలపై దృషిŠ?ట్పట్టి నవంబరుకల్లా టెండర్లు పూర్తిచేస్తే పనులు మొదలుపెడదామన్నారు. కరకట్టల ఆధునీకరణపై కూడా వెంటనే ప్రతిపాదనలు సిద్ధంచేయాలన్నారు. డెల్టా ఆధునీకరణ, గోదావరి వరదల నుంచి శాశ్వత పరిష్కారం కోసం అందజేసిన డీపీఆర్‌పై టెక్నికల్‌ ఎస్టిమేట్స్‌ తయారుచేసి వెంటనే నివేదించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే, అన్ని లంక గ్రామాలలో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేస్తే విపత్తు సమయంలో వాటిని పునరావాస కేంద్రాలుగా వినియోగించుకోవచ్చునని సూచించారు.

పారదర్శకంగా నష్టాల నమోదు
ఇక నష్టాల నమోదు వెంటనే ప్రారంభించాలని.. ఈ విషయంలో అంతా పారదర్శకంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తిచేశాక సామాజిక తనిఖీ నిర్వహించాలని, దీనివల్ల అర్హత ఉండి సాయాన్ని అందుకోలేని వారికి తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు. రెండు వారాల్లో నష్టాల నమోదును పూర్తిచేద్దామన్నారు. పారదర్శకంగా ఉండడంలో దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తున్నామన్నారు. ఏ సీజన్‌లో జరిగిన నష్టం ఆ సీజన్ ముగిసేలోగా ఇవ్వగలిగితే ప్రజలు మరింత సంతోషిస్తారని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. మరోవైపు సచివాలయ సిబ్బంది, వలంటీర్లు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ముంపు ప్రమాదం ఉన్నవారిని అప్రమత్తం చేశారంటూ సీఎం ప్రశంసించారు. వలంటీర్, సచివాలయం వ్యవస్థ ఫలితాలు ఇప్పుడు అందరికీ అందుతున్నాయన్నారు. 

అధికారులకు సీఎం అభినందనలు
లంక గ్రామాల్లో నష్టతీవ్రత వివరాలను సీఎం అధికారులను అడిగి తీసుకున్నారు. గతంలో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలప్పుడు కొంతమంది అధికారులను బాధ్యులుగా చేసి సస్పెండ్‌చేసి హడావిడి చేసేవారని ఆయన గుర్తుచేశారు. విపత్తుల సమయంలో అధికారులు నాయకుల చుట్టూ తిరుగుతుండడంవల్ల పునరావాస పనుల్లో జాప్యం జరుగుతుందన్నారు. కానీ, అన్నీ జరిగాక తాను రావడంవల్ల అవి సవ్యంగా జరిగాయా? లేదా? అని తెలుసుకుంటున్నానని.. తాను కూడా వరదల సమయంలో వచ్చి, మిమ్మల్ని నా చుట్టూ తిప్పుకుని నలుగురిని సస్పెండ్‌ చేస్తే ఏమవుతుంది? ఫైనల్‌గా ప్రజలకు మంచి జరగాలి, వారికి సాయం అందాలి కదా అని ముఖ్యమంత్రి అన్నారు. అధికారులంతా బ్రహ్మండంగా పనిచేశారు కాబట్టే ‘చాలా బాగా చూసుకున్నార’న్న మాట ఈరోజు ప్రజల నుంచి వినిపిస్తోందంటూ సీఎం జగన్‌ వారికి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఈ మంచి పేరు నిలబెట్టుకునేలా ముందుకెళ్దామన్నారు. ఇందులో ప్రజాప్రతినిధులను కూడా మమేకం చేసినప్పుడే ప్రజలకు మరింత దగ్గరవుతారన్నారు. వరద ప్రాంతాల్లో శానిటేషన్, ప్రజారోగ్యంపై దృష్టిపెట్టాలని సీఎం సూచించారు.

విద్యుత్‌పై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి
వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ పునరుద్ధరణపైనా అధికారులతో సీఎం జగన్‌ సమీక్షించారు. ఈ విషయంలో ఎక్కడైనా జాప్యం జరిగిందా అని అడిగి తెలుసుకున్నారు. ఒకవేళ తప్పులు జరిగితే సరిదిద్దుకోవాలని.. లేదంటే ఆ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. మనం యుద్ధం చేస్తున్నది టీడీపీ, చంద్రబాబుతో కాదని.. నెగిటివ్‌ మీడియాతో యుద్ధం చేస్తున్నామని వైఎస్‌ జగన్‌ వారికి గుర్తుచేశారు. ఆ మీడియా సంస్థలు కూడా చొక్కాలిప్పుకుని ఒక పార్టీ అధికారం కోసం పనిచేస్తున్నాయని, వాస్తవాలను ప్రజలకు వివరించి వాటి దుష్ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు.  

రాజమహేంద్రవరంలోకి వరదనీరు రాకుండా..
ఇక రాజమహేంద్రవరం అవ డ్రెయిన్‌ ఏర్పాటుచేయడంపై నిపుణుల అభిప్రాయాలు తీసుకుని అంచనాలు సిద్ధంచేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. పట్టణంలోకి ఎలాంటి వరదనీరు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రమైన నివేదిక రాగానే చర్యలు ప్రారంభిస్తామన్నారు. నిపుణులతో కూడిన టెక్నికల్‌ కమిటీని నియమించి ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. 

మీ తోడ్పాటుతోనే నాణ్యమైన సేవలు..    
సహాయక కార్యక్రమాల కోసం నిధులను వెంటనే సమకూర్చడంతో నాణ్యమైన సేవలందించగలిగామని అధికారులు సీఎంకు వివరించారు. పశువులకు కూడా వెంటనే గ్రాసం అందజేశామన్నారు. వైద్య శిబిరాలు ముందుగా ఏర్పాటుచేయడంతో జ్వరాలు వంటి వాటిని నివారించగలిగామని, బాధితులకు సహాయం చేయడంలో ఉదారంగా ఉండాలన్న సీఎం సూచనలవల్లే ఎక్కువ సాయం చేయగలిగామన్నారు. గ్రామ సచివాలయ, వలంటీర్‌ వ్యవస్థ లేకుండా ఉంటే ఈ రకమైన సేవలు అందించలేకపోయే వాళ్లమన్నారు. ఇక పునరావాస కేంద్రాల్లో బాధితులకు నాణ్యమైన భోజనం అందజేశామన్నారు.

గతంలో ఏ ప్రభుత్వాలు మీలా ముందస్తుగా పునరావాసాల కోసం సాయం అందించలేదన్నారు. సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్‌నాథ్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సీఎం జగన్‌ రాజమహేంద్రవరం ఆర్‌ అండ్‌ బి అతిథిగృహంలో రాత్రి బసచేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement