సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఫీవర్ సర్వే నిరంతరాయంగా జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. జ్వరం లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేసి, వైద్య సేవలందించాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. నోటిఫై చేసిన ఆస్పత్రులను పర్యవేక్షించాలని, ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పందన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 104 కాల్ సెంటర్.. వన్ స్టాప్ సొల్యూషన్ కావాలని, థర్డ్‌వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ సెకండ్ డోస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
నకిలీ విత్తనాలను అడ్డుకోవడానికి గట్టి చర్యలు
జులై 9 నుంచి 23 వరకు రైతు భరోసా చైతన్య యాత్రలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఆర్‌బీకేల విధివిధానాలు, సీఎం యాప్ పనితీరు, ఈ-క్రాపింగ్, వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని సీఎం జగన్ తెలిపారు. విత్తనాల నాణ్యత విషయంలో ఎప్పటికప్పుడు పరిశీలనలు చేయాలని, నకిలీ విత్తనాలను అడ్డుకోవడానికి గట్టి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
విరివిగా మొక్కలు నాటే కార్యక్రమం
జగనన్న పచ్చతోరణం కార్యక్రమంపై దృష్టి పెట్టాలని, విరివిగా మొక్కలు నాటే కార్యక్రమం చురుగ్గా సాగాలని సీఎం జగన్ పేర్కొన్నారు. డిసెంబర్‌కల్లా 4,024 గ్రామాలకు ఫైబర్ కనెక్షన్ అందుతుందని, ఆ సమయానికల్లా ఆయా పంచాయతీల్లో డిజిటల్ లైబ్రరీలు సిద్ధం కావాలన్నారు. పట్టణాల్లో మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమంపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అర్హులైన వారికి 90 రోజుల్లోగా ఇంటి పట్టాలు ఇవ్వాలని సూచించారు.
ఈనెల 8న రైతు దినోత్సవం నిర్వహిస్తున్నాం
ఆర్‌వోఎఫ్‌ఆర్ కింద పంపిణీ చేసిన భూముల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, హార్టికల్చర్, సెరికల్చర్‌లు ఆయా భూముల్లో సాగయ్యేలా చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈనెల 8న రైతు దినోత్సవం నిర్వహిస్తున్నామని, 22న వైఎస్‌ఆర్ కాపునేస్తం, 29న జగనన్న విద్యాదీవెన అమలు చేస్తామని సీఎం జగన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment