డాక్టర్లు, వైద్య సిబ్బంది సేవలు అసమానం: సీఎం జగన్‌ | AP: CM YS Jagan Mohan Reddy Review With Collectors | Sakshi
Sakshi News home page

వైద్యులు, వైద్య సిబ్బందికి సీఎం జగన్‌ ధన్యవాదాలు

Published Wed, May 26 2021 1:38 PM | Last Updated on Wed, May 26 2021 9:07 PM

AP: CM YS Jagan Mohan Reddy Review With Collectors - Sakshi

సాక్షి, అమరావతి: వైద్యులు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు అసమానం.. ఒక తల్లి మాదిరి సేవలు చేస్తున్న మీకు ధన్యవాదాలు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రాణాంతకం అని తెలిసినా రోగులకు సేవలు అందిస్తున్నారని వైద్యులు, వైద్య సిబ్బంది సేవలను కొనియాడారు. ఎలాంటి సహాయ, సహకారం కావాలన్నా అందించేందుకు సిద్దమని ప్రకటించారు. వైద్యులు, వైద్య సిబ్బందితో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం సీఎం జగన్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన వైద్యులు, వైద్య సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కలెక్టర్లతో జరిగిన సమావేశంలో వైఎస్సార్ జలకళ, ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాల ప్రగతిని సీఎం జగన్‌ తెలుసుకున్నారు.

సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ విధంగా మాట్లాడారు. ‘కోవిడ్‌పై పోరాటంలో నిమగ్నమైన సిబ్బందికి అభినందనలు. మన రాష్ట్రానికి మహా నగరాలు లేవు, అంత పెద్ద మౌలిక సదుపాయాల్లేవు కానీ.. గట్టి కృషి ద్వారా కోవిడ్‌పై పోరాటం చేస్తున్నారు. వైద్యులు, నర్సులు, వలంటీర్లు, ఆశా కార్యకర్తలు, పారిశుద్ధ సిబ్బందితో పాటు.. ప్రతి ఒక్కరూ అద్భుతంగా పనిచేస్తున్నారు. కొద్ది రోజులుగా జిల్లాల్లో కేసులు తగ్గుతున్నాయి. ఇది సానుకూల పరిస్థితి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు ఎక్కువగా సారించాలి. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. కరోనా సోకినవారిలో 70 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తున్నాం. 50 శాతం బెడ్లు కచ్చితంగా ఆరోగ్యశ్రీ పేషెంట్లు ఇవ్వాలి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిబంధనలు కచ్చితంగా అమలు కావాలి. ఆరోగ్యమిత్రలు, సీసీ కెమెరాలు సమర్థవంతంగా పనిచేయాలి’ అని వైద్యులు, వైద్య సిబ్బందికి సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు.


అధిక చార్జీలు వసూలు చేసే ఆస్ప‌త్రుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు
అధిక చార్జీలు వసూలు చేసే ఆస్ప‌త్రుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు‘అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలి. ఇది మహమ్మారి సమయం, ప్రతి పేదవాడికి సేవలు చేయాల్సిన సమయం. 104 కాల్‌సెంటర్ వన్‌ స్టాప్ సొల్యూషన్‌గా పెట్టాం. మన బంధువులే మనకు ఫోన్‌ చేస్తే ఎలా స్పందిస్తామో.. 104కు ఎవరైనా ఫోన్ చేస్తే అలాగే స్పందించాలి. జర్మన్ హేంగర్లపై కలెక్టర్లు, జేసీలు దృష్టి పెట్టాలి. ఆక్సిజన్‌ ఎయిర్ కండిషన్ పెట్టాలి, శానిటేషన్ బాగుండాలి. రోగులకు మంచి ఆహారం అందించాలి. ఆక్సిజన్ సరఫరా 330 టన్నుల నుంచి 600 టన్నుల సామర్థ్యానికి పెంచాం. కనీసం రెండ్రోజులకు సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచాం. ఆక్సిజన్ వినియోగంపై ఎప్పటికప్పుడు ఆడిటింగ్ జరగాలి. ప్రతి ఆస్పత్రిలో ఆక్సిజన్ నిల్వలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు ఇస్తున్నాం’ అని సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు.

అనంతరం వైఎస్సార్ అర్బన్, రూరల్ హెల్త్‌ క్లినిక్స్, గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాలపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షించారు. అనంతరం ఖరీఫ్ సన్నద్ధత, ఎరువులు, విత్తనాల అందుబాటుపై అధికారులతో సీఎం జగన్‌ చర్చించారు. ఖరీఫ్‌లో వ్యవసాయ రుణాలపై సమీక్షించారు. వీటితో రాష్ట్రంలో కోవిడ్ నివారణ చర్యలపై అధికారులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు ఆళ్లనాని, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, డీజీపీ గౌతమ్ సవాంగ్‌, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

జులై 8న వైఎస్ఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్బీకేలు ప్రారంభం
జులై 8న వైఎస్ఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్బీకేలు ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు. కొత్తగా నిర్మాణం చేపట్టనున్న మెడికల్ కాలేజీలకు 30న శంకుస్థాపన చేస్తామన్నారు. వచ్చే ఉగాది నాటికి పట్టణాలు, నగరాల్లో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలకే ప్లాట్లు అందిస్తామన్నారు. దాదాపు 17 వేల ఎకరాలు అవసరం అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. రకరకాల కేటగిరిల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భూముల సేకరణ జరుగుతుందన్నారు. దాదాపు 3 లక్షల మందికి ప్లాట్లు అందిస్తామన్నారు. వివాదాల్లేని ప్లాట్లు రిజిస్ట్రేషన్‌, లాభాపేక్ష లేకుండా అర్హులకు ప్లాట్లు పంపిణీ చేస్తామన్నారు. లే అవుట్‌ను కూడా అభివృద్ధి చేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

జూన్‌లో అమలు కానున్న పథకాలు..
జూన్‌లో అమలు కానున్న పథకాలను సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. జూన్ 8న జగనన్న తోడు పథకం, జూన్‌ 15న వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం, జూన్ 22న వైఎస్ఆర్ చేయూత పథకం అమలు చేస్తామని సీఎం తెలిపారు. గ్రామ సచివాలయాల్లో జాబితాలను డిస్‌ప్లే చేసి.. సోషల్ ఆడిట్ తర్వాత మార్పులు, చేర్పులు చేయాలన్నారు. జూన్‌ 31న ప.గో జిల్లాలో అమూల్‌-ఏపీ పాల ప్రాజెక్ట్‌ ప్రారంభిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement