పునర్విభజన అంకం జిల్లా రాజకీయాలనూ రసవత్తరంగా మారుస్తోంది. బిల్లు ‘ఢిల్లీ’కి వెళ్లడంతో అక్కడి కథ ఏమిటో తెలుసుకునేందుకు ఇక్కడి నేతలూ ‘చలో హస్తిన’ అంటూ కదిలారు. ఇందులో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ముందుండగా ఇతర పక్షాల వారు తామూ ఉన్నామని అంటున్నారు. తెలుగు తమ్ముళ్లు మాత్రం జిల్లాకో, రాజధానికో పరిమితమై ‘బాబు’పై భారం వేసి తమ కార్యక్రమాల్లో తిరుగుతున్నారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రాష్ట్ర పునర్విభజన బిల్లు ఢిల్లీకి చేరుకోవడంతో జిల్లా నేతలందరూ దేశ రాజధాని బాట పట్టారు. బిల్లుకు మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నట్లు చెప్తున్నారు. మంత్రి డీకే అరుణతో పాటు షాద్‌నగర్ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం మూడు రోజులగా ఢిల్లీలోనే మకాం వేశారు. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ ఎంపీ కేసీఆర్‌తో పాటు మరో ఎంపీ జగన్నాథం, పార్టీ ఏకైక ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు జాతీయ పార్టీల నేతలను కలుస్తున్నారు.
బీజేపీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉండగా, నాగం జనార్దన్ రెడ్డి రెండు రోజుల కిందటే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఓ వైపు సీమాంధ్ర ప్రాంత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు దేశ రాజధానిలో చంద్రబాబుతో కలిసి హడావుడి సృష్టిస్తున్నారు. జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఒకరిద్దరు మినహా మిగతా ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనో, సొంత నియోజకవర్గంలోనో గడుపుతున్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ హస్తినలో ఉండగా, మిగతా ఎమ్మెల్యేలు ఎం.చంద్రశేఖర్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కొత్తకోట దయాకర్‌రెడ్డి, సీత, రేవంత్‌రెడ్డి, ఎల్లారెడ్డి స్థానిక కార్యక్రమాల్లో పొల్గొంటున్నారు.
నేడు తిరుగుముఖం?
రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో అన్ని పార్టీలు అభ్యర్థులను నిలపడంతో ఫిబ్రవరి 7వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. ఆరు రాజ్యసభ స్థానాలకు గాను ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలవడంతో ఓటింగ్ అనివార్యంగా మారింది. దీంతో ఓటింగ్‌లో పాల్గొనేందుకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రానికల్లా హైదరాబాద్‌కు చేరుకునే ప్రయత్నాల్లో వున్నారు. రాజ్యసభ ఎన్నికల పోలింగ్ తర్వాత తిరిగి పరిస్థితులను బట్టి ఢిల్లీకి వెళ్లేది లేనిదీ తేల్చుకుంటామని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు ప్రకటించారు.
అంతా...హస్తినకు...!
Published Thu, Feb 6 2014 4:08 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement