నువ్వా.. నేనా..! | Tought competition between jaipal reddy and D.K Aruna | Sakshi
Sakshi News home page

నువ్వా.. నేనా..!

Published Sun, Jan 26 2014 3:45 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

నువ్వా.. నేనా..! - Sakshi

నువ్వా.. నేనా..!

నిన్న మిడ్జిల్‌లో రగిలిన ‘ఫ్లెక్సీలు’, మొన్న రథం రగడ, యాత్రల పేరిట నేతల హంగామా. సాక్షాత్తూ జిల్లా కాంగ్రెస్‌లో ప్రముఖులనుకున్నవారే ఎడమొహం, పెడమొహం. క్షేత్ర స్థాయిలో పోటా పోటీ కార్యక్రమాలు. వెరసి సార్వత్రిక ఎన్నికల్లో పట్టు సాధించుకునేందుకు వేస్తున్న ఎత్తుగడలు. చాపకింద నీరులా కిందివారిని ఎగదోసి తమ వారికి టికెట్ల కోటాలో పెద్దపీట వేయించుకొని తాము రాష్ట్రంలోనో, కేంద్రంలోనో చక్రం తిప్పాలన్న తపన..ఇదీ ‘హస్తం’ పెద్దల తీరు. వర్గాల పెంచుతున్న వైనం.
 -సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
 
 మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి డీకే అరుణ కేంద్రంగా సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం లేదా కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు మంత్రి డీకే అరుణ ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ రాజకీయాలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించే ప్రయత్నాల్లో వున్నారు. ఈ ఇద్దరు నేతలు తెలంగాణ రాష్ట్రంలో ‘కీలకమైన పదవి’ ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
 
 దీంతో వారు వచ్చే సాధారణ ఎన్నికల్లో తమ మద్దతుదారులకు టికెట్ ఇప్పించుకునే దిశగా పావులు కదుపుతున్నారు. క్షేత్ర స్థాయిలో టికెట్ ఆశిస్తున్న నేతలు కూడా ఈ ఇద్దరిలో ఎవరిదో ఒకరి ప్రాపకం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరి ఆశీస్సులు లేనిదే టికెట్ దక్కడం అసాధ్యమనే భావన పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా మిగతా చోట్ల రెండు వర్గాలకు చెందిన నాయకులు టికెట్ల వేటలో ఉండటంతో ఎన్నికలకు ముందే ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది.
 
  కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి మరోమారు టికెట్ ఆశిస్తున్నారు. డీకే అరుణతో సఖ్యత లేకపోవడంతో ఇటీవల కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డిని ఇటీవల గురునాథ్‌రెడ్డి కలిసి వచ్చినట్లు సమాచారం. డీసీసీ అధికార ప్రతినిధి సలీం, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ముదిగండ్ల కృష్ణ, మాజీ జడ్పీటీసీ మల్కిరెడ్డి తదితరులు టికెట్ ఆశిస్తున్న వారిలో వున్నారు.
 
 అవకాశం కలిసి వస్తే డీకే అరుణ సోదరుడు నారాయణపేట నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నా రు. మాజీ పీసీసీ చీఫ్ డీఎస్, మాజీ ఎంపీ విఠల్‌రావు త దితరుల సహకారంతో మరోమారు టికెట్ దక్కించుకునేందుకు సూగప్ప ఆరాట పడుతున్నారు. మాజీ ఎమ్మె ల్యే వీరారెడ్డి కూడా టికెట్ ఆశించే అవకాశం వుంది.
 
  డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, 2010 ఉప ఎన్నికలో పోటీ చేసిన ముత్యాల ప్రకాశ్ మహబూబ్‌నగర్ టికెట్  ఆశిస్తున్నారు. విద్యా సంస్థల అధిపతి కేఎస్ రవికుమార్ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ఆశీస్సులతో టికెట్ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు.
  డీకే అరుణ సహకారంతో మాజీ ఎంపీ మల్లు రవి జడ్చర్ల నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నారు. స్థానిక నినాదాన్ని తెరమీదకు తెస్తున్న బాదేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్‌రెడ్డి, పీసీసీ సంయుక్త కార్యదర్శి సాదు వెంకట్‌రెడ్డి కేంద్ర మంత్రి వర్గీయులుగా టికెట్ ఆశిస్తున్నారు.
  దేవరకద్రలో కాంగ్రెస్ అనధికార ఇంచార్జిగా డీకే అరుణ ఆశీస్సులతో డోకూరు పవన్‌కుమార్ రెడ్డి కొనసాగుతున్నారు. కొత్తకోటకు చెందిన విశ్వేశ్వర్, దేవరకద్రకు చెందిన ప్రదీప్ కుమార్ గౌడ్ కూడా టికెట్‌పై ఆశతో వున్నారు.
 
  మక్తల్ నుంచి డీకే అరుణ సోదరుడు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి లేదా అతని భార్య సుచరిత టికెట్ కోరే అవకాశం వుంది. మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్‌రెడ్డి రాజకీయ భవితవ్యంపైనా చర్చ జరుగుతోంది.
 
  మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి మళ్లీ టికెట్ ఖాయమనే ధీమాతో నియోజకవర్గంపై దృష్టి సారించారు.
 
  కాంగ్రెస్ జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న మంత్రి డీకే అరుణ గద్వాల నుంచి మరోమారు పోటీ కి సిద్దమవుతున్నారు.
 
  గతంలో చల్లా వెంకట్రాంరెడ్డి మద్దతుతో అలంపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన అబ్రహాం ప్రస్తుతం ఒంటరిపోరు చేస్తున్నారు. గతంలో మాజీ ఎంపీ విఠల్‌రావు పీఏ సంపత్‌కుమార్ కూడా టికెట్‌ను ఆశించే అవకాశం ఉంది.
 
  నాగర్‌కర్నూలు నుంచి జడ్పీ మాజీ చైర్మన్ కూచకుళ్ల దామోదర్ రెడ్డి లేదా ఆయన కుమారుడు డాక్టర్ రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వి.మోహన్‌గౌడ్, పీసీసీ కార్యదర్శి దిలీపాచారి తమ వంతు ప్రయత్నాల్లో వున్నారు.
 
  మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణకు పోటీగా అచ్చంపేట ఎస్సీ స్థానం నుంచి ఎవరూ టికెట్ అడిగే అవకాశం కనిపించకపోవడంతో గ్రూపుల ప్రభావం లేదు.
 
  జైపాల్‌రెడ్డి స్వయంగా కల్వకుర్తి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఇక్కడ రాజకీయం ఆసక్తిగా మారింది. జైపాల్‌రెడ్డి మద్దతుతో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డి, డీకే అరుణ సహకారంతో మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్ ఆశావహుల జాబితాలో ఉన్నారు.
 
  సిట్టింగ్ ఎమ్మెల్యేగా చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి వున్నా కొత్తూరు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వీర్లపల్లి శంకర్, మాజీ సర్పంచ్‌లు కడెంపల్లి శ్రీనివాస్‌గౌడ్, కొందూటి నరేందర్ టికెట్ ఆశిస్తుండటంతో విభేదాలు లోలోన భగ్గుమంటున్నాయి.
 
  కొల్లాపూర్‌లో డీకే ఆరుణ మద్దతుతో మరోమారు విష్ణువర్దన్ రెడ్డి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ ఎన్నికల అవగాహన కుదుర్చుకున్నా, విలీనమైనా కొల్లాపూర్ రాజకీయం మరోమారు ఉత్కంఠగా మారనుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement