మహబూబ్‌నగర్ మునిసిపాలిటీ, న్యూస్‌లైన్: నిధుల్లేక మునిసిపాలిటీలు ఏ చిన్న సమస్యను తీర్చాలన్నా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు మూడేళ్ల తరువాత నిధుల వరద పారింది. 13వ ఆర్థికసంఘం నిధుల కింద జిల్లాకు రూ.10.49కోట్లను మంజూరుచేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని మంత్రి డీకే అరుణ గురువారం వెల్లడించారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో మునిసిపాలిటీలకు ఈనిధులు చాలావరకు ఊపిరిపోసినట్టేనని తెలుస్తోంది.
ఇక ఈ నిధుల విషయానికొస్తే కౌన్సిల్ లేని కారణంగా నిధులు వెనక్కి వెళ్లే అవకాశం ఉందని స్వయంగా మునిసిపల్ రీజినల్ డెరైక్టర్ సత్యనారాయణ జిల్లాకు వచ్చినప్పుడు ప్రకటించారు. దీంతో కౌన్సిల్ ఏర్పాటు అయ్యేంత వరకు ఈ నిధులు రావని భావించిన తరుణంలోనే మంజూరుకావడం మునిసిపాలిటీలను గట్టెక్కించినట్లయింది. మూడేళ్లుగా మునిసిపాలిటీలకు పైసా గ్రాంట్ లేని కారణంగా వసూలైన పన్నులతోనే అరకొరగా అభివృద్ధి పనులు చేపట్టాల్సి వచ్చింది. ఇక ఆ పరిస్థితికి విముక్తి కలిగినట్లే. ఇక ఈనిధులతో డ్రైనేజీలతో పాటు సీసీరోడ్ల నిర్మాణాలను చేపట్టాల్సి ఉంటుంది. దీంతోపాటు తాగునీటి పైప్‌లైన్లు, పారిశుధ్య నిర్వాహణ, వీధి దీపాల మరమ్మతులను పూర్తిచేయాలి.
మంజూరైన నిధులు ఇలా..
మహబూబ్‌నగర్ మునిసిపాలిటీకి రూ.3.65కోట్లు, గద్వాలకు రూ.1.23 కోట్లు, నారాయణపేటకు రూ.1.90కోట్లు, షాద్‌నగర్‌కు రూ.89లక్షలు, వ నపర్తికి రూ.84లక్షలు, అయిజకు రూ.51లక్షలు, కొల్లాపూర్‌కు రూ.51లక్ష లు, కల్వకుర్తికి రూ.48లక్షలు, నాగర్‌కర్నూల్ మునిసిపాలిటీకి రూ.35లక్ష ల చొప్పున కేటాయించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను మునిసిపల్‌శాఖ సంబంధిత మునిసిపాలిటీలకు ఆదేశాలను జారీచేసింది. ఇక జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల కంటే మహబూబ్‌నగర్ మునిసిపాలిటీకే అధిక నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతోనైనా మునిసిపాలిటీల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. ఈ నిధులను సకాలంలో వినియోగిస్తారా? లేక ఖాతాకే పరిమితం చేస్తారో వేచిచూడాలి.
నిధుల కొరత తీరింది!
Published Fri, Nov 15 2013 3:11 AM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM
Advertisement
Advertisement