అచ్చంపేట నగరపంచాయతీ కార్యాలయం
అచ్చంపేట: 2017–18 ఆర్థిక సంవత్సరానికిగాను మున్సిపల్ శాఖ రాష్ట్రంలోని 16మున్సిపాలిటీలకు మొత్తం రూ.270కోట్ల నిధులు తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీయూఎఫ్‌ఐడీసీ) కింద విడుదల చేసింది. ఫిబ్రవరి 17న జీఓ నంబర్436 ద్వారా పలు మున్సిపాలిటీలకు పరిపాలన అనుమతులు జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. కౌన్సిల్ తీర్మానం మేరకు ఈ నిధులను అప్పు కింద ఇచ్చారు.
ఇందులో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏడు మున్సిపాలిటీలకు రూ.115కోట్లు మంజూరయ్యాయి. ఏడాదికాలంగా మున్సిపాలిటీలకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని వేచి చూస్తుండగా.. ఇప్పుడు అప్పు కింద ఇవ్వడంతో పాలకవర్గాలకు నిరాశే మిగిలింది. ఈ పరిస్థితితో అభివృద్ధి చేస్తామని కౌన్సిలర్లు ప్రజలకు ఇచ్చినమాట ఇప్పట్లో నేరవేరే విధంగా కనిపించడం లేదు.
రెండేళ్లుగా ఎదురుచూపు
అచ్చంపేట నగరపంచాయతీ ఏర్పడిన తర్వాత 2016 మార్చిలో పాలకవర్గ ఎన్నికలు జరిగాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్‌ఎస్ పార్టీ ఇక్కడ మొత్తం 20వార్డుల్లో గెలుపొందింది. అప్పటి నుంచే పట్టణానికి ప్రత్యేక నిధులు తెస్తామని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెబుతూవచ్చారు. కానీ రెండేళ్ల తర్వాతప్రభుత్వం అప్పు కింద అచ్చంపేటకు రూ.15కోట్లు ఇచ్చింది. నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ నగరపంచాయతీలకు గతంలో సీసీ రోడ్లు, మురుగుకాల్వల నిర్మాణాలకు ప్రభుత్వం గ్రాంటు కింద నిధులు విడుదల చేసింది.
క్లిన్ స్వీప్ చేశామని చెప్పుకుంటున్న ఇక్కడి నేతలకు మాత్రం ప్రత్యేకంగా ఇచ్చిన నిధులు ఏమీలేదు. అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయని ఆశించి పట్టణవాసులు ఒకే పార్టీకి ఓటువేస్తే రేండేళ్లయినా ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. చివరకు రుణం మంజూరు చేయడంతో పాలకవర్గాలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నాయి. అచ్చంపేటకు ప్రత్యేక నిధులు సాధించామని చెబుతున్న నేతల మాటలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు.
దేనికి ఉపయోగిస్తారంటే...
మున్సిపాలిటీలకు ఆదాయం సమాకూర్చే షాపింగ్ కాంప్లెక్స్, రైతు బజార్, టౌన్‌హాల్స్ ఏర్పాటు వంటి వాటికి ఖర్చు చేయాలని ఆంక్షలు విధించారు. డీపీఆర్ రూపొందించి ఆడ్మినిస్ట్రేషన్ మంజూరు తీసుకున్న తర్వాత టెండర్లు పిలుస్తారు. ఈ పని మొత్తం పూర్తి కావాలంటే ఇంకా రెండు నెలల వ్యవధి పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ ని«ధులను పట్టణాల్లో కనీస అవసరాల కల్పనకు వినియోగించే అవకాశం లేకండాపోయింది.
ఉమ్మడి జిల్లాలోని విడుదలైన నిధులు (లక్షల్లో)
మున్సిపాలిటీ/ నిధులు
నగరపంచాయతీ
బాదేపల్లి 1000
వనపర్తి 2000
అయిజ 1500
కొల్లాపూర్ 2500
అచ్చంపేట 1500
కల్వకుర్తి 1500
మహబూబ్‌నగర్ 2000
Comments
Please login to add a commentAdd a comment