ముప్పేట ఎన్నికలతో రాజకీయ వేడి
టికెట్ల కోసం నేతల ఉరుకులు పరుగులు
గెలుపు గుర్రాల కోసం పార్టీల తంటాలు
కేడర్ చేజారకుండా ఔత్సాహికుల వ్యూహం
‘ఖర్చు’పై చేతులెత్తేస్తున్న నాయక గణం
‘ ఈ ఎన్నికలు ఎవరి నెత్తిమీదకొచ్చినట్లు. ఎలా గట్టెక్కుతామన్నట్లు. టికెట్ ఎవరికివ్వాలె. ఖర్చు ఎవరు పెట్టుకోవాలె. అలాగని ఒకటా, రెండా...మూడు గండాలు గట్టెక్కాల. అదీ నెలా..ఇరవరోజుల్లోనే..ఇవేం రాజకీయాలో..’ ఇదీ ఇప్పుడు అన్ని రాజకీయ పక్షాల నేతల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు. ముప్పేట ఎన్నికల దాడితో వేడెక్కుతున్న రాజకీయం. ఒక ఎన్నిక ప్రభావం మరో ఎన్నికపై ఉండడంతో ఎలా ఎత్తుగడలు వేసి పరువు నిలుపుకోవాలా అన్న సందేహాలు. అనుభవాన్ని రంగరించి అన్ని స్థాయిల్లో జరుగుతున్న కసరత్తులు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ముప్పేట ఎన్నికలు ముంచుకు రావడంతో రాజకీయ పక్షాలు, నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. టికెట్ల వేటలో నేతలు పార్టీలు మారుతుండటంతో జిల్లా రాజకీయ ముఖ చిత్రం శరవేగంగా మారుతోంది. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల వేటలో ఉన్న నేతలు తమ అనుచర గణం భవితవ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎలాగైనా ఎన్నికల బరిలో ఉండాలనే పట్టుదలతో ఉన్న కేడర్ చేజారి పోకుండా ఉండేందుకు కీలక నేతలు తంటాలు పడుతున్నారు. సాధారణ, మున్సిపల్, స్థానిక సంస్థలు కేవలం నెలా 20 రోజుల వ్యవధిలో జరుగుతుండటంతో అన్ని పార్టీల్లోనూ టికెట్ల వేట జోరుగా సాగుతోంది. రొటేషన్ పద్దతిలో రిజర్వేషన్లు మారడంతో చాలా చోట్ల పార్టీలకు అభ్యర్థుల ఎంపిక కష్టతరంగా తయారైంది.
ఎంపికకు కమిటీలు..
అన్ని పార్టీలు ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. కమిటీల నియామకంతో అభ్యర్థులను ఎంపిక చేసేలా పార్టీలు ప్రణాళికలు సిద్దం చేశాయి. వార్డుల్లో పర్యటిస్తూ, తటస్టుల నుంచి సమాచారం సేకరిస్తూ గెలుపు గుర్రాలను బరిలో నిలిపేలా కసరత్తు జరుగుతోంది. టికెట్ దక్కని ఔత్సాహికులు చివరి ఘడియల్లో పార్టీ మారే అవకాశముందనే ప్రచా రం కీలక నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. మున్సిపాలిటీల్లో నామినేషన్ల స్వీకరణకు మార్చి 14 చివరి తేదీ కాగా, అన్ని పార్టీలు చివరి క్షణాల్లోనే బీ ఫారాలు ఇస్తామని ఔత్సాహిక నేతలకు చెప్తున్నాయి. దీంతో బీ ఫారాలపై ఆశతో నామినేషన్లు దాఖలు చేసేందుకు ఔత్సాహిక అభ్యర్థులు సిద్దమవుతున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై పార్టీల్లో స్పష్టత లేకపోవడంతో స్థానిక సంస్థల అభ్యర్థుల ఎంపికలో టికెట్లు ఆశిస్తున్న నేతలు ఎవరికి వారుగా జాబితాలు సిద్దం చేసుకుంటున్నారు. తలో జాబితా సమర్పిస్తుండటంతో ఎవరిని ఎంపిక చేయాలో తెలియక పార్టీ పరిశీలకులు తలలు పట్టుకుంటున్నారు.
చేతులెత్తేస్తున్న నేతలు
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల టిక్కెట్లు ఇచ్చేందుకు గీటు రాయి అంటూ ప్రధాన పార్టీలు తెగేసి చెప్తున్నాయి. పార్టీ గుర్తులపైనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండటంతో ఆ ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు తామే ముందుండి ప్రచారం చేసేలా వ్యూహం సిద్దం చేసుకుంటున్నారు.
గద్వాలకు చెందిన ఓ మాజీ మంత్రి ఎన్నికల వ్యయం భరించడం తన వల్ల కాదని తేల్చి చెప్పడంతో అనుచరగణం సొంత దారి వెతుక్కుంటున్నట్లు సమాచారం. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అత్యధికంగా ఎనిమిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ భవిష్యత్‌పై డోలాయమానంలో ఉన్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కేడర్‌లోఅయోమయం కనిపిస్తోంది. చెక్‌పోస్టులు, ఫ్లైయింగ్ స్క్వాడ్ లు తనిఖీలు ముమ్మరం చేయడంతో నోట్ల కట్టలు బయట పడుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ పూర్తయితే ప్రలోభాల పర్వం ముమ్మరమయ్యే సూచన కనిపిస్తోంది. పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా ‘ఎన్నికల ఫీవర్’ పట్టుకోవడంతో జిల్లా రాజకీయం వేడెక్కుతోంది.
ఉక్కిరి బిక్కిరి
Published Tue, Mar 11 2014 4:02 AM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
Advertisement
Advertisement