పురపాలక సంఘాల ఎన్నికలకు నగారా మోగడంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. ‘కోడ్’ను అమలు పరిచే చర్యలకు ఉపక్రమించింది. పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఇక రాజకీయ పక్షాలూ సమర సన్నాహాల్లో తలమునకలవుతున్నాయి. ఎవరిని ఎక్కడ నిలపాలనే కసరత్తు ప్రారంభించాయి.
మహబూబ్‌నగర్:
పురపాలక సంస్థలకు నాలుగో సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేయడంతో జిల్లాలో పురపాలక సమరానికి అన్ని పక్షాలు సిద్ధమవుతున్నాయి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలతో పాటు నాలుగు నగర పంచాయతీల పరిధిలోని 206 వార్డుల్లో ఈ నెల 30న పోలింగ్ నిర్వహిస్తారు. వార్డుల పునర్విభజనకు సంబంధించి కేసులు కోర్టు విచారణలో ఉండటంతో జడ్చర్ల, అచ్చంపేట, కొల్లాపూర్ నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడలేదు. మిగతా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఈ నెల పదో తేదీన ఓటరు జాబితా ప్రదర్శన, నామినేషన్ల స్వీకరణతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. ఏప్రిల్ రెండో తేదీన ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలా ఎన్నికల షెడ్యూలును రూపొందించారు.
ఇప్పటికే మున్సిపల్ చైర్మన్ పదవులకు సంబంధించిన రిజర్వేషన్లు రాష్ట్ర స్థాయిలో ఖరారు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపాలిటీల్లో వార్డుల వారీ రిజర్వేషన్లు గత ఏడాది జూన్‌లో ఖరారు చేశారు. నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో అధికారులు వార్డులవారీగా రిజర్వేషన్ వివరాలు వెల్లడించారు. మున్సిపాలీటీలు, నగర పంచాయతీ చైర్మన్లు గతంలో మాదిరిగానే పరోక్ష పద్దతిలో మెజార్టీ కౌన్సిలర్ల మద్దతుతో ఎన్నికవుతారు. గ్రామ పంచాయతీ ఎన్నికల తరహాలో మున్సిపల్ ఎన్నికల్లోనూ మహిళలకు 50శాతం వార్డులు కేటాయించారు. 2005లో జరిగిన ఎన్నికల్లో 33శాతం మాత్రమే మహిళలకు రిజర్వు చేశారు. మున్సిపాలిటీల నాలుగో సాధారణ ఎన్నికల్లో జిల్లాలో 3.80లక్షలకు పైగా పట్టణ ప్రాంత ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
‘
కోడ్’ కూసింది..
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం నుంచే ఎన్నికల కోడ్ (ఎన్నికల ప్రవర్తన నియమావళి) అమల్లోకి వచ్చింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిబంధనలు అమలయ్యేలా చూడాలని కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి నవీన్ మిట్టల్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ గిరిజా శంకర్ ఎన్నికల్ కోడ్‌ను అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను అప్రమత్తం చేశారు. గోడలపై రాతలను తుడిపి వేయించడం, ఫ్లెక్సీలు, కటౌట్ల తొలగింపు, అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్ల వినియోగం, మతాలకు సంబంధించిన సమావేశాలు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం వంటి అంశాలపై కలెక్టర్ పలు సూచనలు చేశారు.
సర్వం సన్నద్దం
- గిరిజా శంకర్, జిల్లా కలెక్టర్
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వ సన్నద్దంగా ఉంది. వార్డుల వారీగా ఓటర్ల విభజన పూర్తయింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించాం. 344 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓటింగ్ కోసం 420 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను సిద్దం చేశాం. ఓటరు ఫోటో గుర్తింపు కార్డుల ముద్రణ, ప్రచురణ నిబంధనల మేరకు పూర్తి చేశాం.