సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ మున్సిపల్ ఎన్నికల్లో తమ భవితవ్యంపై ప్రధా న రాజకీయ పక్షాలు గంపెడాశ పెట్టుకున్నాయి. సుమారు తొమ్మిదేళ్ల తర్వాత పురపాలక సంఘాలకు ఎన్నికలు జరుగుతుండటంతో పట్టు సాధించేందుకు అన్ని పార్టీలు యత్నిస్తున్నాయి. ఐదు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లోని 206 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ 199, టీఆర్‌ఎస్ 198 వార్డుల్లో అభ్యర్థులను బరిలోకి దించాయి. పార్టీ నుంచి ముఖ్య నేతలు ఇతర పార్టీలకు వలస వెళ్లడంతో తెలుగుదేశం పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది.
146 వార్డుల్లో అభ్యర్థులను బరిలోకి దించినా చాలా చోట్ల నామమాత్ర పోటీకే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కల్వకర్తి మున్సిపాలిటీలో టీడీపీ కేవలం ఒక వార్డులో మాత్రమే పోటీకి పరిమితం కావడం గమనార్హం. 142 వార్డుల్లో పోటీ చేస్తున్న బీజేపీ కేడర్‌కు బలమున్న చోటే అభ్యర్థులను పోటీకి నిలిపింది. సాధారణ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్దపడుతుండటంతో మున్పిపల్ ఎన్నికల్లో వీలైనంత మందిని బరిలోకి దింపే ప్రయత్నం చేసింది.
52 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ
తొలిసారిగా మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 52 వార్డుల్లో అభ్యర్థులను నిలిపింది. మహబూబ్‌నగర్, షాద్‌నగర్, కల్వకుర్తి, నాగర్‌కర్నూలులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు సాధించే ఫలితాలు కీలకం కానున్నాయి. ఎంఐం 52, సీపీఎం 16, సీపీఐ 11, బీఎస్పీ 04, లోక్‌సత్తా 03 వార్డుల్లో అభ్యర్థులకు బీ ఫారాలిచ్చాయి. మున్సిపల్ ఎన్నికల్లో మహిళలకు తొలిసారిగా 50శాతం స్థానాలు రిజర్వు చేశారు.
ఎన్నికల వేళ అయోమయం
సాధార ణ ఎన్నికల నేపథ్యంలో మున్పిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో అన్ని రాజకీయ పక్షాల్లో గందరగోళం నెలకొంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తమపై ప్రతికూల ప్రభావం చూపుతాయనే ఆందోళనతో ముఖ్య నేతలు ప్రచారానికి దూరంగా ఉన్నారు. అన్ని పార్టీల నుంచి తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉండటంతో వారిని బరి నుంచి తప్పించేందుకు కీలక నేతలెవరూ చొరవ తీసుకునేందుకు సాహసించలేదు.
మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల ప్రకటనపైనా అన్ని పార్టీలు గోప్యత పాటిస్తున్నాయి. అభ్యర్థిని ముందే ప్రకటిస్తే కౌన్సిలర్ స్థాయిలోనే ప్రత్యర్థులతో పాటు, సొంత పార్టీ అసంతృప్తులు ఓడించే అవకాశముందనే అంచనా పార్టీల్లో కనిపిస్తోంది. గెలుపు కీలకంగా భావిస్తున్న అభ్యర్థులు ప్రలోభాల పర్వాన్ని మార్గంగా ఎంచుకున్నారు. ఎన్నికల వ్యయంపై ఎన్నికల సంఘం నిఘా పెంచడంతో అభ్యర్థులు లోలోన ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మద్యం, డబ్బు పంపిణీ వ్యవహారం గుంభనంగా సాగుతున్నట్లు సమాచారం.
ఏమైతదో...!
Published Sun, Mar 30 2014 3:25 AM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
Advertisement
Advertisement