మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో అవినీతి జరిగినట్లు చెబుతుండగా.. ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మున్సిపాలిటీలో రూ.100కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఓ స్వచ్ఛంద సంస్థ బాధ్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో పాటూ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఏసీబీ అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. ఇక స్థానిక మున్సిపల్ చైర్‌పర్సన్‌పాటు కొందరు కౌన్సిలర్లు మున్సిపాలిటీలో 2005 నుంచి 2015 వరకు జరిగిన పనులపై విచారణ జరిపించాలని కొద్దిరోజుల క్రితం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు చేశారు. ఇదంతా జరుగుతుండగానే.. ఇప్పటికే తాము పని ఒత్తిడి ఎదుర్కొంటుండగా.. విచారణలు, నివేదికలు మొదలైతే పనిభారం పెరుగుతుందని చెబుతూ తమను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే దీర్ఘకాలిక సెలవులో వెళ్తామని పేర్కొంటూ బుధవారం ఒక రోజు పెన్‌డౌన్ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ అంశంపై మంగళవారం మున్సిపల్ చైర్‌పర్సన్ రాధకు నోటీసు అందజేశారు.
రాజకీయ కారణాలు..
రాజకీయ కారణాలతో ప్రజాప్రతినిధులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటుండడంతో తాము నలిగిపోతున్నామని మున్సిపల్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తీవ్రమైన పనిఒత్తిడితో అనారోగ్యం బారిన పడుతున్నామని చెబుతున్నారు. ఈ క్రమంలో విచారణల పేరుతో మరింత భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని విచారణ జరిగే వరకు తమను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యను ప్రభుత్వంతో అధికారులకు తెలియజేసేందుకు ఒక్కరోజు పెన్‌డౌన్‌కు పిలుపునిచ్చామని మున్సిపల్ ఉద్యోగులు వెల్లడించారు. అవసరమైతే దీర్ఘకాలిక సెలవులో వెళ్లేందుకు వెనకాడేది లేదని పోటీసులు ఇచ్చిన అనంతరం ఎంఈ సత్యనారాయణ, ఏసీపీ విద్యాసాగర్, మేనేజర్ రమేష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ మోహినోద్దిన్, ఆర్‌ఐ శశిధర్ వెల్లడించారు.
రోజుకో ట్విస్ట్
మునిసిపాలిటీలో అక్రమాలు జరిగాయనే అంశంపై రోజురోజుకు పరిణామాలు మారుతున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ నగర పంచాయతీలో రూ.88లక్షల అక్రమాల వ్యవహరం బయటికి పొక్కడంతో ఎనిమిది మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అందులో అయిజ నగర పంచాయతీలో కొద్దికాలం పనిచేసిన ప్రస్తుత మహబూబ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ బి.దేవ్‌సింగ్‌పై ఏ–8 నిందితుడుగా, అసిస్టెంట్ కమిషనర్ వెంకన్నపై ఏ–6 నిందితుడిగా ఉన్నారు. దీంతో మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో కూడా కమిషనర్‌గా దేవ్‌సింగ్ అనేక అక్రమాలకు పాల్పడ్డాడంటూ కౌన్సిలర్లు, నాయకులు ఆందోళనలు చేపట్టారు. అలాగే, రూ.100 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తు ‘వాచ్’ స్వచ్ఛంద సంస్థ గత నెలలో ఏసీబీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు హైకోర్టుకు వెళ్లింది.
ఈ ఫిర్యాదుల వెనక విపక్ష నాయకుల హస్తం ఉందని భావించిన మున్సిపల్ చైర్‌పర్సన్ రాధ తదితరులు కొద్దిరోజుల క్రితం 2005 నుంచి 2015 వరకు జరిగిన పనులపై విచారణ జరపాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలా పార్టీలు, నేతల మధ్య జరిగే గొడవల కారణంగా తాము నలిగిపోతున్నామని చెబుతూ మున్సిపల్ ఉద్యోగులు తిరుగుబాటు బావుట ఎగురవేశారు. ఇందులో భాగంగా బుధవారం ఒక్కరోజు పెన్‌డౌన్ చేపట్టనున్నట్లు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment