చౌలపల్లి ప్రతాపరెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్ టికెట్ల పంపిణీ వ్యవహారం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఒకరే పోటీపడుతున్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను తొలి జాబితాలోనే ప్రకటించిన ఆ పార్టీ.. మలి విడత జాబితాపై మాత్రం సస్పెన్స్ కొనసాగిస్తోంది. భాగస్వామ్య పక్షాల ఒత్తిడి, సామాజిక సమతూకం, ఇతరత్రా అంశాలు అభ్యర్థుల ఖరారుపై ప్రభావం చూపుతున్నాయి. వికారాబాద్ జిల్లాలోని మొత్తం స్థానాలకు, మేడ్చల్‌లో కేవలం కుత్భుల్లాపూర్ సెగ్మెంట్, రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం, కల్వకుర్తి, చేవెళ్ల నియోజకవర్గాలకు అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం సోమవారం రాత్రి ఖరారు చేసింది.
మిగతా సెగ్మెంట్ల విషయంలో మహాకూటమి భాగస్వామ్య పక్షాల నుంచి అభ్యంతరాలు, డిమాండ్లు వస్తుండడంతో పెండింగ్‌లో పెట్టింది. ఈ నేపథ్యంలో పెండింగ్ స్థానాల విషయంలో ఆయా పార్టీలు పెడుతున్న మడత పేచీతో కాంగ్రెస్ తలబొప్పికడుతోంది. ముఖ్యంగా టీడీపీ ప్రతిపాదిస్తున్న సీట్లపై పీటముడి నెలకొంది. నిన్నటి వరకు కేవలం మూడు స్థానాలకే తెలుగుదేశం పరిమితమవుతుందన్న చర్చలు కాస్తా తాజాగా మరిన్ని నియోజకవర్గాలకు పాకడం చర్చనీయాంశంగా మారింది.
తాజాగా ఇబ్రహీంపట్నం కూడా..
ఇప్పటికే ఉప్పల్, శేరిలింగంపల్లి స్థానాలు టీడీపీ ఖాతాలో చేరిపోయాయి. వీటికి ఆ పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించింది. కాగా, తాజాగా కూకట్‌పల్లి, రాజేంద్రనగర్, ఎల్‌బీనగర్ లేదా ఇబ్రహీంపట్నం సీటును కూడా సర్దుబాటు చేయాలని తెలుగుదేశం ఒత్తిడి పెంచింది. ఢిల్లీ స్థాయిలో ఆ పార్టీ అధినాయకత్వం కాంగ్రెస్ హైకమాండ్‌కు ఈమేరకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. దీంతో రాజకీయ సమీకరణలు దాదాపుగా మారిపోతున్నాయి. సీట్ల పంపకాలలో కూకట్‌పల్లిని టీడీపీకి వదలాలని మొదట్నుంచి కాంగ్రెస్ అనుకుంటోంది. మరోవైపు సబిత తనయుడు కార్తీక్‌రెడ్డి ఆశిస్తున్న రాజేంద్రనగర్ సీటుకు కూడా టీడీపీ ఎసరు తెస్తోంది. ఇప్పటికే ఒక కుటుంబానికి ఒకటే టికెట్ నిబంధనతో కార్తీక్‌కు ముప్పు పొంచి ఉండగా.. తాజా పరిణామం మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఇదిలాఉండగా, ఎల్‌బీనగర్ స్థానంపై టీడీపీ గట్టిగా పట్టుపడుతోంది. ఈ స్థానం నుంచి సామ రంగారెడ్డిని బరిలో దించాలని కృతనిశ్చయంతో ఉంది. అయితే ఈ సెగ్మెంట్‌ను మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి బలంగా ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లో వదలుకోవద్దని కాంగ్రెస్ భావిస్తోంది. ఒకవేళ పొత్తులో ఈ సీటు దక్కకపోతే ఇబ్రహీంపట్నం సీటును అడగాలని దేశం నాయకత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా ప్రతిపాదనలను ఏఐసీసీ ముందుంచుంది. ఈ సెగ్మెంట్ నుంచి సామ రంగారెడ్డి లేదా రొక్కం భీంరెడ్డిని బరిలోకి దించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ తాజా పరిణామాలు కాంగ్రెస్ ఆశావహులను ఆత్మరక్షణలో పడేసింది. ఈ సీటును ఆశిస్తున్న డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్‌కు, మల్‌రెడ్డి బ్రదర్స్‌కు మింగుడుపడడంలేదు.
ప్రతాపరెడ్డికీ డౌటేనా..?
షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి అభ్యర్థిత్వం కూడా కష్టమేనని తెలుస్తోంది. మొదటి జాబితాలోనే ఆయన పేరు ఉంటుందని భావించినా.. పెండింగ్ పెట్టడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది. షాద్‌నగర్ నుంచి కాంగ్రెస్ తరపున బలమైన అభ్యర్థిగా కేవలం ప్రతాపరెడ్డే ఉన్నారు. ఒకరే పోటీపడుతున్న స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధినాయకత్వం ఈ సెగ్మెంట్‌ను పక్కన పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ స్థానాన్ని టీజేఎస్‌కు ఇచ్చే అంశంపై కూడా పరిశీలన జరుగుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ వీర్లపల్లి శంకర్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. టీజేఎస్ టికెట్ కోసం తెరవెనుక మంతనాలు సాగిస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే ప్రతాపరెడ్డి పేరును పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.
కిచ్చెన్నకు ఇచ్చేనా..?
మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆశిస్తున్న మేడ్చల్ టికెట్‌పై ఇంకా స్పష్టత రావడంలేదు. ఈయన అభ్యర్థిత్వానికి పీసీసీ ముఖ్యులు మోకాలడ్డుతున్నట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయనపై ఏఐసీసీకి నివేదిక సమర్పించిన పీసీసీ పెద్దలు టికెట్ రాకుండా పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్‌రెడ్డితో పాటు పార్టీలో చేరిన తోటకూర జంగయ్యయాదవ్‌కు టికెట్ దక్కేలా సామాజిక సమతుల్యతను తెరమీదకు తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు వీరిరువురికి కాకుండా టీజేఎస్ కోటాలో మేడ్చల్‌ను కేటాయిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment