vigilance ad
-
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు అవాస్తవం: ప్రతాప్‌రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు అవాస్తవమని విజిలెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం కొత్తగా ఎవరికీ మైనింగ్ లైసెన్స్ ఇవ్వలేదని తెలిపారు. కోర్టు అనుమతితో ఇచ్చిన లైసెన్స్ మేరకు లెట్‌రైట్ తవ్వకాలు మాత్రమే జరుగుతున్నాయని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడినవారి లైసెన్స్‌లు రద్దు చేశామన్నారు. అక్రమ మైనింగ్‌పై రేపటి నుంచి అనకాపల్లి ఏరియాలో ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామని వెల్లడించారు. 3 జిల్లాల్లో కలిపి అక్రమ మైనింగ్‌పై రూ.250 కోట్ల వరకు ఫైన్ విధించామని తెలిపారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. -
అక్రమార్కులపై ‘ప్రతాపం’
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. మైనింగ్ శాఖలో తన ‘ప్రతాపం’ చూపిస్తున్నారు. వందల కోట్ల రూపాయలను కొల్లగొట్టిన ‘ఘనుల’ బాగోతం బయటపెడుతున్నారు. గత ప్రభుత్వంలో దాచి పెట్టిన, దోచుకున్న సొమ్మును లెక్క కట్టి చూపిస్తున్నారు. తన, తమ భేదం లేదు. తప్పు చేసిన వాడి నుంచి ప్రభుత్వానికి ఫైన్ చెల్లించేలా పనిచేసి మైనింగ్ శాఖను హడలెత్తిసున్నారు. ఈ వ్యవహారాలను గమనిస్తున్నవారికి ఆయనెవరో ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది. ఆయనే మైనింగ్ శాఖ విజిలెన్స్ స్క్వాడ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.ప్రతాప్‌రెడ్డి. ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మైనింగ్ అక్రమార్కుల్లో దడ పుట్టిస్తున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి ఏరియాలో జరిగిన వేల టన్నుల అక్రమ మైనింగ్ గుట్టు రట్టు చేశారు. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి తదితర ప్రాంతాల్లో నడుస్తున్న మాంగనీస్ ఖనిజాల అక్రమ నిల్వలు, తవ్వకాలు, అనధికార రవాణా బండారాన్ని బయటపెట్టారు. ఇక, శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి, రాజాం, ఆమదాలవలస నియోజకవర్గాల్లో వందల కోట్ల విలువైన గ్రానైట్ అక్రమాల నిగ్గు తేల్చారు. ఆయన దూకుడుని తట్టుకోలేక ఏదో ఒక ఆరోపణ చేసి ఇరికించే స్థాయికి అక్రమార్కులు దిగజారారంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వాన్ని గడగడలాడించిన వైనం గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి సన్నిహితంగా ఉన్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన రుత్విక్ సంస్థ అప్పటికే వంశధార పనులు నిర్వహిస్తోంది. పనులు జరుగుతున్న క్రమంలో మెటల్, గ్రావెల్ అక్రమంగా తవ్వకాలు చేపట్టింది. 7,774 క్యూబిక్ మీటర్ల మెటల్ అక్రమంగా తవ్వినట్టు గుర్తించి, రూ.83,57,050 జరిమానా విధించారు. 52,774 క్యూబిక్ మీటర్లు అక్రమంగా తవ్వడంతో కోటి 42 లక్షల 48 వేల 490 రూపాయల జరిమానా వేశారు. ఏ లీజు లేకుండా అక్రమంగా తవ్వినందుకు రూ.2.36 కోట్లు మేర పెనాల్టీ వేసి నోటీసు జారీ చేశారు. నాడు మంత్రిగా పనిచేసిన ఒకాయన పొందూరులో జరిపిన మైనింగ్ అక్రమాలను బయటపెట్టారు. మరో మంత్రి దేవినేనికి చెందిన మైనింగ్ అక్రమాల గుట్టు రట్టు చేశారు. ఇంకేముంది ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. కానీ వెనక్కి తగ్గలేదు. తాను బయటపెట్టిన అక్రమాలపైనే స్టాండ్ అయిపోయారు. ఎంతకీ లొంగలేదని నాటి మంత్రి ఒకరు హుటాహుటిన బదిలీ చేయించేశారు. వాస్తవానికి నాడు జిల్లాకొచ్చినప్పుడే అనంతపురం జిల్లా నుంచి బదిలీపై వచ్చారు. అక్కడ కూడా టీడీపీలో బ్రదర్స్‌గా చెలామణి అయిన నేతల అక్రమాలు బయటపెట్టారని ఇక్కడికి పంపించేశారు. తనను ఉద్దేశపూర్వకంగా బదిలీ చేశారని తెలిసినప్పటికీ వెనక్కి తగ్గకుండా శ్రీకాకుళం జిల్లాలో కూడా మైనింగ్ అక్రమాల బాగోతాన్ని బయటపెట్టారు. ఒత్తిళ్లు, బదిలీలు తనను ఆపలేవని చేతల ద్వారా చూపించారు. మొత్తానికి టీడీపీ హయాంలో బదిలీని బహుమానంగా ఇచ్చి అక్రమార్కులకు నాటి పెద్దలు అండగా నిలిచారు. ప్రభుత్వం మారింది... అక్రమాల గుట్టు రట్టయింది టీడీపీ ప్రభుత్వం దిగిపోయిన వెంటనే అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ మైనింగ్ అక్రమాలపై దృష్టి సారించింది. మైనింగ్‌లో ఉన్న లొసుగులు, అక్రమాలు తెలిసిన వ్యక్తిని రంగంలోకి దించితే గానీ బయటికి రావని గుర్తించింది. ఆ శాఖలో పనిచేస్తున్న కొందరు మైనింగ్ మాఫియాకు తొత్తులై, ముడుపులతో అక్రమాలకు యథేచ్ఛగా వదిలేస్తున్నారని నిర్ధారణకొచ్చి.. ప్రతాప్రెడ్డిలాంటి అధికారులను ప్రభుత్వం రంగంలోకి దించింది. ఇంకేముంది క్వారీల్లో చోటు చేసుకున్న అక్రమాలన్నీ బయటికొచ్చేస్తున్నాయి. వెలుగు చూసిన అక్రమాలివే.. కోటబొమ్మాళి మండలం లింగాలవలసలో ఉన్న ఎంఎస్పీ గ్రానైట్‌లో 56,009 క్యూబిక్ మీటర్ల కలర్ గ్రానైట్ అక్రమంగా తవ్వినట్టు తేల్చారు. అపరాధ రుసుంతో కలిసి రూ.215 కోట్ల 6 లక్షల 27 వేల 76 రూపాయలు ప్రభుత్వానికి ఎంఎస్పీ కంపెనీ చెల్లించాలని నోటీసు కూడా జారీ చేశారు. ►కోటబొమ్మాళి మండలం పట్టుపురంలో ఉన్న ఐశ్వర్య గ్రానైట్ అండ్ మినరల్స్‌లో 589 క్యూబిక్ మీటర్లు కలర్ గ్రానైట్ అక్రమంగా తవ్వినట్టు గుర్తించారు. లీజు వెలుపుల 321 క్యూబిక్ మీటర్లు అక్రమంగా తవ్వి సొమ్ము చేసుకున్నట్టు నిగ్గు తేల్చారు. మొత్తంగా కోటి 50 లక్షల వరకు ఫైన్ విధించారు. ►వంగర మండలం జగన్నాథపురం గ్రామంలో గల పూశ్య క్వారీ వెలుపల అనధికారికంగా 17,164 క్యూబిక్ మీటర్ల వైట్ గెలాక్సీ/కాశ్మీర్ వైట్ తవ్వకాలు జరిపినట్టు గుర్తిదంచారు. రూ.42 కోట్ల 32 లక్షల 56 వేల మేర జరిమానా విధించారు. అప్పుడు అధికారం అక్రమార్కులకు అండగా నిలిచింది. ఇప్పుడు నిజాయితీగా పనిచేసే వారికి ప్రస్తుత ప్రభుత్వం స్వేచ్ఛనివ్వడంతో అక్రమాలు బయటికొస్తున్నాయి. ఇవన్నీ గత ప్రభుత్వంలోనే దాదాపు గుర్తించారు. కానీ నాటి పాలకులే అక్రమార్కులకు తొత్తులు కావడంతో బయటికి రానివ్వలేదు. దీంతో ప్రస్తుతం ప్రతాప్‌రెడ్డి పేరు హాట్ టాపిక్ అయ్యింది. అక్రమార్కులకు సింహస్వప్నంగా నిలిచిపోయారు. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే కాదు విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కూడా రోజుకొక చోట మైనింగ్ అక్రమ తవ్వకాల గుట్టురట్టు చేస్తున్నారు. వాహనాలు సీజ్ చేయడం, అక్రమ తవ్వకాలకు సంబంధించి ఫైన్లు వేయడం చేస్తున్నారు. దీంతో మైనింగ్ శాఖలోనే కాదు మైనింగ్ అక్రమార్కుల్లో ప్రతాప్‌రెడ్డి గుబులు పట్టుకుంది. ఇంతవరకు బయటపడని అక్రమాలు వెలుగులోకి తెస్తున్నారని క్వారీ యజమానులు, జరిగిన అక్రమాలు దాచి పెట్టి ప్రభుత్వానికి నష్టపరిచిన అధికారులకు వణుకు మొదలైంది. ఎప్పుడు ఎవరి పీకకు చుట్టుకుంటుందోనన్న భయం పట్టుకుంది. -
అరాచకం
జేసీ పీఏ రవీంద్రరెడ్డి, మరో నలుగురి నుంచి ప్రాణహాని - ఉన్నతాధికారులకు గుత్తి విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డి ఫిర్యాదు - తాడిపత్రి గ్రానైట్ దందాపై ఏడాదిగా ఉక్కుపాదం - బుజ్జగించినా.. బెదిరించినా లొంగని అధికారి - చివరకు బదిలీ చేయించేందుకు విశ్వ ప్రయత్నాలు - ఏడీకి నిజాయితీకి అండగా నిలిచిన సొంత శాఖ ‘‘ విధి నిర్వహణలో భాగంగా పగలు, రాత్రి కష్టపడుతున్నా. అనంతపురంతో పాటు కర్నూలు జిల్లా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. తాడిపత్రి గ్రానైట్ మాఫియాతో నాకు ప్రాణహాని ఉంది. అందుకే మీకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేస్తున్నా. – భూగర్భ గనుల శాఖ డైరెక్టర్‌కు రాసిన లేఖలో విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డి తాడిపత్రిలో గ్రానైట్ మాఫియా కొన్నేళ్లుగా అరాచకం సృష్టిస్తోంది. వ్యాపారులను గుప్పిట్లో పెట్టుకుని ఓ పెద్దమనిషి సాగిస్తున్న దందాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. విషయం తెలిసినా అనంతపురం, తాడిపత్రి మైనింగ్ అధికారులు చోద్యం చూడటమే తప్పిస్తే అడ్డుకోలేకపోయారు. ఓ రకంగా కీలుబొమ్మగా మారిపోయారు. సరిగ్గా రెండేళ్ల క్రితం గుత్తి విజిలెన్స్ ఏడీగా ప్రతాప్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అక్రమార్కుల గుండెల్లో దడ మొదలయింది. ఇక తమ ఆటలు సాగవని తెలిసి.. ఆ పెద్దమనిషి బదిలీ చేయించేందుకు సిద్ధపడిన తీరు ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. సాక్షిప్రతినిధి, అనంతపురం: తాడిపత్రిలో 600 పైగా గ్రానైట్ పాలిష్ మిషన్లు ఉన్నాయి. వీటికి 20–30మంది ట్రాన్స్పోర్టర్లు 70 లారీలను ఏర్పాటు చేసి గ్రానైట్ రాళ్లను సరఫరా చేస్తున్నారు. తాడిపత్రి చుట్టపక్కల ఎక్కడా క్వారీలు లేవు. చిత్తూరు, మడకశిర, కర్నూలు జిల్లాల నుంచి గ్రానైట్ సరఫరా అవుతోంది. ఒకలోడు గ్రానైట్ క్వారీ నుంచి తాడిపత్రికి చేరాలంటే రూ.45వేల నుంచి రూ.50వేల రాయల్టీ చెల్లించాలి. రాయల్టీ లేకుండా క్వారీ నుంచి తాడిపత్రికి గ్రానైట్ చేర్చేలా క్వారీ, తాడిపత్రి పాలిష్ మిషన్ వ్యాపారులతో ఒప్పందం చేసుకుంటారు. గ్రానైట్లారీ క్వారీ నుంచి బయలుదేరగానే ముందు నాలుగు పైలెట్ వాహనాలు ఉంటాయి. విజిలెన్స్ అధికారులు వస్తే అప్రమత్తమై వారి నుంచి దారి తప్పించే చర్యలకు ‘పైలెట్లు’ ఉపక్రమిస్తారు. అలాగే లారీలో ఉన్న గ్రానైట్ పరిమాణానికి, బిల్లులో తక్కువ చూపించి రవాణా చేస్తారు. ఒకే బిల్లుతో పదుల సంఖ్యలో 5–6లోడ్లను తరలిస్తారు. ఈ మొత్తం తతంగంలో అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి బాగోగులు చూసుకునేవారు. జోరోబిజినెస్ చేసేందుకు క్వారీ, మిషన్ వ్యాపారులతో బేరం కుదుర్చుకుని ఆ డబ్బును ‘తాడిపత్రి పెద్దమనిషి’కి కప్పం రూపంలో ఇచ్చేవారు. ఆయన తన పీఏ ద్వారా ‘గ్రానైట్ మాఫియా’కు కొద్దిమేర చిల్లర విదిల్చి తక్కిన డబ్బును పోగుచేసుకునేవారు. ఇలా రోజూ లక్షల రూపాయలను అప్పనంగా అర్జించారు. ప్రతాప్‌రెడ్డి రాకతో ఇబ్బందులు భూగర్భ గనుల శాఖ విజిలెన్స్ ఏడీగా ప్రతాప్‌రెడ్డి 2015 ఆగస్టు 21న బాధ్యతలు స్వీకరించారు. తాడిపత్రిలో జరుగుతున్న అక్రమాలు చూసి నివ్వెరపోయారు. లారీలను ఆపి బిల్లులు అడిగితే లేవని చెప్పేవారు. దీంతో పెనాల్టీ రాయడం మొదలయింది. ఆ వెంటనే ‘పెద్దమనిషి పీఏ’ నుంచి ఏడీకి ఫోన్ వచ్చేది. ‘తాడిపత్రి వెహికల్స్‌పై స్టిక్కర్ చూడలేదా? అవి ఎవరివో తెలియదా? పెనాల్టీ వేశావు, నువ్వే చెల్లించి రశీదు తీసుకో!’ అని దబాయించేవారు. అయినప్పటికీ విజిలెన్స్ ఏడీ బెదరకుండా వాహనాలను సీజ్ చేయసాగారు. ఇలా రెండేళ్లలో గ్రానైట్ అక్రమ దందాపై ఉక్కపాదం మోపారు. 2015కు ముందు ఏటా కోటి రూపాయలు కూడా పెనాల్టీ డబ్బులు వచ్చేవి కాదు. కానీ 2015–16లో రూ.5.40కోట్లు, 2016–17లో రూ.5.55కోట్లు రాబట్టారు. ఇతన్ని మొదట దారికి తెచ్చుకోవాలని చూశారు. ఆ తర్వాత బెదిరించారు. చివరకు అవినీతి ఆరోపణలతో డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఏడీపై విచారణకు ఓ బృందం వచ్చి తాడిపత్రి గ్రానైట్ వ్యాపారులతో మామూళ్లు తీసుకుంటున్నారా? అని ఆరా తీశారు. ఎవ్వరూ ఏడీఏకు వ్యతిరేకంగా సమాధానం చెప్పలేదు. పైగా పెనాల్టీలు భారీగా రావడంతో అధికారులు కూడా ఏడీ వైపు నిలిచారు. అనంతపురంతో పాటు కర్నూలు జిల్లా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. ఏడీఏ ఫిర్యాదుతో కలకలం తాడిపత్రి గ్రానైట్ మాఫియాతో ప్రాణహాని ఉందని భూగర్భ గనులశాఖ డైరెక్టర్‌కు గుత్తి విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డి గత బుధవారం లేఖ రాయడం కలకలం సృష్టిస్తోంది. ఐదుగురి పేర్లు కూడా ఫిర్యాదులో పొందుపరిచారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పీఏ రవీంద్రారెడ్డిని నెంబర్–1గా పేర్కొన్నారు. ఇతనిపై బోలెడు క్రిమినల్ కేసులు ఉన్నాయని, స్టీఫెన్ రవీంద్ర హయాంలో ఇతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు. తాడిపత్రి గ్రానైట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరెడ్డి, బిల్లుల బాబు, సూర్యముని, ఎం.సుబ్బారావు అనే వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. వీరందరిపై కేసులు ఉన్నాయని కూడా ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఈ మాఫియా బరితెగించి గ్రానైట్ అక్రమ రవాణా సాగిస్తోందని, వీరిని కట్టడి చేసేందుకు యత్నిస్తే గ్రానైట్ మాఫియాతో పాటు రాజకీయనేతలు బెదిరింపులకు దిగుతున్నారని పేర్కొన్నారు. గ్రానైట్ ఏడీఏ తనకు ప్రాణహాని ఉందని ఏకంగా పేర్లతో సహా ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.