అరాచకం | jc brothers gang halchal | Sakshi
Sakshi News home page

అరాచకం

Published Thu, Aug 3 2017 9:55 PM | Last Updated on Sun, Sep 17 2017 5:07 PM

అరాచకం

అరాచకం

జేసీ పీఏ రవీంద్రరెడ్డి, మరో నలుగురి నుంచి ప్రాణహాని
- ఉన్నతాధికారులకు గుత్తి విజిలెన్స్‌ ఏడీ ప్రతాప్‌రెడ్డి ఫిర్యాదు
- తాడిపత్రి గ్రానైట్‌ దందాపై ఏడాదిగా ఉక్కుపాదం
- బుజ్జగించినా.. బెదిరించినా లొంగని అధికారి
- చివరకు బదిలీ చేయించేందుకు విశ్వ ప్రయత్నాలు
- ఏడీకి నిజాయితీకి అండగా నిలిచిన సొంత శాఖ


‘‘ విధి నిర్వహణలో భాగంగా పగలు, రాత్రి కష్టపడుతున్నా. అనంతపురంతో పాటు కర్నూలు జిల్లా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. తాడిపత్రి గ్రానైట్‌ మాఫియాతో నాకు ప్రాణహాని ఉంది. అందుకే మీకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేస్తున్నా.
– భూగర్భ గనుల శాఖ డైరెక్టర్‌కు రాసిన లేఖలో విజిలెన్స్‌ ఏడీ ప్రతాప్‌రెడ్డి

తాడిపత్రిలో గ్రానైట్‌ మాఫియా కొన్నేళ్లుగా అరాచకం సృష్టిస్తోంది. వ్యాపారులను గుప్పిట్లో పెట్టుకుని ఓ పెద్దమనిషి సాగిస్తున్న దందాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. విషయం తెలిసినా అనంతపురం, తాడిపత్రి మైనింగ్‌ అధికారులు చోద్యం చూడటమే తప్పిస్తే అడ్డుకోలేకపోయారు. ఓ రకంగా కీలుబొమ్మగా మారిపోయారు. సరిగ్గా రెండేళ్ల క్రితం గుత్తి విజిలెన్స్‌ ఏడీగా ప్రతాప్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అక్రమార్కుల గుండెల్లో దడ మొదలయింది. ఇక తమ ఆటలు సాగవని తెలిసి.. ఆ పెద్దమనిషి బదిలీ చేయించేందుకు సిద్ధపడిన తీరు ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది.

సాక్షిప్రతినిధి, అనంతపురం: తాడిపత్రిలో 600 పైగా గ్రానైట్‌ పాలిష్‌ మిషన్లు ఉన్నాయి. వీటికి 20–30మంది ట్రాన్స్‌పోర్టర్లు 70 లారీలను ఏర్పాటు చేసి గ్రానైట్‌ రాళ్లను సరఫరా చేస్తున్నారు. తాడిపత్రి చుట్టపక్కల ఎక్కడా క్వారీలు లేవు. చిత్తూరు, మడకశిర, కర్నూలు జిల్లాల నుంచి గ్రానైట్‌ సరఫరా అవుతోంది. ఒకలోడు గ్రానైట్‌ క్వారీ నుంచి తాడిపత్రికి చేరాలంటే రూ.45వేల నుంచి రూ.50వేల రాయల్టీ చెల్లించాలి. రాయల్టీ లేకుండా క్వారీ నుంచి తాడిపత్రికి గ్రానైట్‌ చేర్చేలా క్వారీ, తాడిపత్రి పాలిష్‌ మిషన్‌ వ్యాపారులతో ఒప్పందం చేసుకుంటారు.

గ్రానైట్‌లారీ క్వారీ నుంచి బయలుదేరగానే ముందు నాలుగు పైలెట్‌ వాహనాలు ఉంటాయి. విజిలెన్స్‌ అధికారులు వస్తే అప్రమత్తమై వారి నుంచి దారి తప్పించే చర్యలకు ‘పైలెట్లు’ ఉపక్రమిస్తారు. అలాగే లారీలో ఉన్న గ్రానైట్‌ పరిమాణానికి, బిల్లులో తక్కువ చూపించి రవాణా చేస్తారు. ఒకే బిల్లుతో పదుల సంఖ్యలో 5–6లోడ్లను తరలిస్తారు. ఈ మొత్తం తతంగంలో అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి బాగోగులు చూసుకునేవారు. జోరోబిజినెస్‌ చేసేందుకు క్వారీ, మిషన్‌ వ్యాపారులతో బేరం కుదుర్చుకుని ఆ డబ్బును ‘తాడిపత్రి పెద్దమనిషి’కి కప్పం రూపంలో ఇచ్చేవారు. ఆయన తన పీఏ ద్వారా ‘గ్రానైట్‌ మాఫియా’కు కొద్దిమేర చిల్లర విదిల్చి తక్కిన డబ్బును పోగుచేసుకునేవారు. ఇలా రోజూ లక్షల రూపాయలను అప్పనంగా అర్జించారు.

ప్రతాప్‌రెడ్డి రాకతో ఇబ్బందులు
భూగర్భ గనుల శాఖ విజిలెన్స్‌ ఏడీగా ప్రతాప్‌రెడ్డి 2015 ఆగస్టు 21న బాధ్యతలు స్వీకరించారు. తాడిపత్రిలో జరుగుతున్న అక్రమాలు చూసి నివ్వెరపోయారు. లారీలను ఆపి బిల్లులు అడిగితే లేవని చెప్పేవారు. దీంతో పెనాల్టీ రాయడం మొదలయింది. ఆ వెంటనే ‘పెద్దమనిషి పీఏ’ నుంచి ఏడీకి ఫోన్‌ వచ్చేది. ‘తాడిపత్రి వెహికల్స్‌పై స్టిక్కర్‌ చూడలేదా? అవి ఎవరివో తెలియదా? పెనాల్టీ వేశావు, నువ్వే చెల్లించి రశీదు తీసుకో!’ అని దబాయించేవారు.

అయినప్పటికీ విజిలెన్స్‌ ఏడీ బెదరకుండా వాహనాలను సీజ్‌ చేయసాగారు. ఇలా రెండేళ్లలో గ్రానైట్‌ అక్రమ దందాపై ఉక్కపాదం మోపారు. 2015కు ముందు ఏటా కోటి రూపాయలు కూడా పెనాల్టీ డబ్బులు వచ్చేవి కాదు. కానీ 2015–16లో రూ.5.40కోట్లు, 2016–17లో రూ.5.55కోట్లు రాబట్టారు. ఇతన్ని మొదట దారికి తెచ్చుకోవాలని చూశారు. ఆ తర్వాత బెదిరించారు. చివరకు అవినీతి ఆరోపణలతో డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఏడీపై విచారణకు ఓ బృందం వచ్చి తాడిపత్రి గ్రానైట్‌ వ్యాపారులతో మామూళ్లు తీసుకుంటున్నారా? అని ఆరా తీశారు. ఎవ్వరూ ఏడీఏకు వ్యతిరేకంగా సమాధానం చెప్పలేదు. పైగా పెనాల్టీలు భారీగా రావడంతో అధికారులు కూడా ఏడీ వైపు నిలిచారు. అనంతపురంతో పాటు కర్నూలు జిల్లా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు.

ఏడీఏ ఫిర్యాదుతో కలకలం
తాడిపత్రి గ్రానైట్‌ మాఫియాతో ప్రాణహాని ఉందని భూగర్భ గనులశాఖ డైరెక్టర్‌కు గుత్తి విజిలెన్స్‌ ఏడీ ప్రతాప్‌రెడ్డి గత బుధవారం లేఖ రాయడం కలకలం సృష్టిస్తోంది. ఐదుగురి పేర్లు కూడా ఫిర్యాదులో పొందుపరిచారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పీఏ రవీంద్రారెడ్డిని నెంబర్‌–1గా పేర్కొన్నారు. ఇతనిపై బోలెడు క్రిమినల్‌ కేసులు ఉన్నాయని, స్టీఫెన్‌ రవీంద్ర హయాంలో ఇతనికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. తాడిపత్రి గ్రానైట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ నాగేశ్వరరెడ్డి, బిల్లుల బాబు, సూర్యముని, ఎం.సుబ్బారావు అనే వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. వీరందరిపై కేసులు ఉన్నాయని కూడా ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఈ మాఫియా బరితెగించి గ్రానైట్‌ అక్రమ రవాణా సాగిస్తోందని, వీరిని కట్టడి చేసేందుకు యత్నిస్తే గ్రానైట్‌ మాఫియాతో పాటు రాజకీయనేతలు బెదిరింపులకు దిగుతున్నారని పేర్కొన్నారు. గ్రానైట్‌ ఏడీఏ తనకు ప్రాణహాని ఉందని ఏకంగా పేర్లతో సహా ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement