సాక్షి, అమరావతి: సీఎంఓ సిఫారసుల మేరకు సుధాకర్ ఇన్‌ఫ్రా అనే సంస్థకు గోదావరి నదిలో ఇసుక డ్రెడ్జింగ్‌కు అనుమతిచ్చినట్లు టీడీపీ అధికార ప్రతినిధి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, సత్యదూరమని రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాల కాంట్రాక్టును జేపీ పవర్ వెంచర్స్ సంస్థకు టెండర్ల ద్వారా నిబంధనల ప్రకారం ఇచ్చామని సోమవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ఆ సంస్థకు మాత్రమే ఓపెన్ రీచ్‌లలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఉందన్నారు. సుధాకర్ ఇన్‌ఫ్రా సంస్థకు అనుమతిస్తూ తన కార్యాలయం ఎటువంటి లేఖ ఇవ్వలేదని ఆయన స్పష్టంచేశారు. ఆ సంస్థకు గోదావరి నదిలో ఇసుక డ్రెడ్జింగ్‌కు అనుమతివ్వాలని సీఎంఓ నుంచి కూడా ఎటువంటి మౌఖిక లేదా లిఖితపూర్వక సిఫారసు రాలేదన్నారు. కాంట్రాక్టు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ తనకు ఆ సంస్థ రాసినట్లు చెబుతున్న లేఖకు.. తన కార్యాలయానికి సంబంధంలేదన్నారు. ఇవ్వని కాంట్రాక్టుకు ధన్యవాదాలు ఎలా చెబుతారని ద్వివేది ప్రశ్నించారు.
సుధాకర్ ఇన్‌ఫ్రాపై జూన్ 4న కేసు
జేపీ సంస్థ నుంచి తాము సబ్ కాంట్రాక్టు పొందామని సుధాకర్ ఇన్‌ఫ్రా కొందరిని మోసం చేసినట్లు ఈ సంవత్సరం జూన్ 4న విజయవాడ భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైనట్లు ఆయన తెలిపారు. తమకు గనుల శాఖ అనుమతి ఉందంటూ ఆ సంస్థ చూపించిన డాక్యుమెంట్లు తమ కార్యాలయం నుంచి జారీచేసినవి కావన్నారు. ఈ విషయాన్ని తాను అదే రోజు ఆ కేసు దర్యాప్తు చేస్తున్న విజయవాడ పశ్చిమ ఏసీపీకి లిఖితపూర్వకంగా తెలిపానని గోపాలకృష్ణ ద్వివేది గుర్తుచేశారు. దీనిపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఇప్పుడు అవే ఫోర్జరీ పత్రాలను మరోసారి చూపించి టీడీపీ అధికార ప్రతినిధి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వాటిని సృష్టించి మోసం చేసిన వ్యక్తులు అరెస్టయ్యారని తెలిపారు. గతంలో పోలీసు కేసు నమోదై అరెస్టులు కూడా జరిగిన వ్యవహారానికి సంబంధించిన ఫోర్జరీ పత్రాలను చూపించి ఇప్పుడు జరిగినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
జూన్‌లోనే ఫోర్జరీకి పాల్పడిన వారిపై కేసు నమోదవడం, అరెస్టులు జరిగిన విషయాన్ని టీడీపీ నాయకుడు ఎందుకు ప్రస్తావించలేదో ప్రజలు గమనించాలని కోరారు. అన్ని మీడియాల్లో వచ్చిన నిజాలను దాచిపెట్టి మళ్లీ కొత్త అంశంగా ప్రభుత్వంపై బురదజల్లాలని ప్రయత్నించడం ఏమిటన్నారు. సుధాకర్ ఇన్‌ఫ్రాకు చెందిన వ్యక్తులపై కాకినాడ టుటౌన్ పోలీస్‌స్టేషన్‌లోనూ 420 కేసు నమోదైందని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేవిధంగా, గనుల శాఖలో నిబద్ధతతో పనిచేస్తున్న అధికారుల మానసికస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఆరోపణలు చేశారన్నారు. దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ద్వివేది హెచ్చరించారు.
ఫోర్జరీ పత్రాలతో ఆరోపణలా!?
Published Tue, Aug 31 2021 3:39 AM | Last Updated on Tue, Aug 31 2021 3:39 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment