సాక్షి, అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో అధికార టీడీపీ సేవలో తరిస్తూ, విధి నిర్వహణలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్న పోలీసు ఉన్నతాధికారులపై చర్యలు చేపట్టింది. ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై వేటు వేసింది. ఆయనతోపాటు వైఎస్సార్, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు రాహుల్‌దేవ్ శర్మ, వెంకటరత్నంలను కూడా బదిలీ చేసింది. సీఎం చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రంలో పలువురు పోలీసు అధికారులు పనిచేస్తున్నారంటూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలుమార్లు చేసిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం స్పందించింది. తాజాగా సోమవారం వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘం ఫుల్‌బెంచ్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ మంగళవారం రాత్రి మీడియాకు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేయడం, నిబంధనలకు విరుద్ధంగా పరికరాలను దుర్వినియోగం చేయడం వంటి అభియోగాల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. వేటు పడిన ఈ ముగ్గురు అధికారులు రాష్ట్రంలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఆదేశించింది. పోలీస్ హెడ్‌క్వార్టర్‌కు రిపోర్టు చేయాలని ముగ్గురు అధికారులకు స్పష్టం చేసింది.
సర్వం టీడీపీ సేవలోనే...
ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరరావు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చంద్రబాబు స్వప్రయోజనాల కోసమే పని చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోవడంతో అప్పటి ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీగా ఉన్న ఏఆర్ అనూరాధను అకస్మాత్తుగా విధుల నుంచి తప్పించారు. ఆమెను హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా బదిలీ చేసి, విజయవాడ పోలీసు కమిషనర్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించారు. అప్పటి నుంచి ఆయన తన విధులను పక్కనపెట్టి, చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. నక్సలైట్లు, తీవ్రవాదులు, సంఘ విద్రోహశక్తుల కదలికలను కనిపెట్టడానికి ఉపయోగించాల్సిన సాంకేతిక పరికరాలను ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయడానికి వాడుకుంటున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకొచ్చేలా పార్టీ ఫిరాయింపులకు ఆయన బేరసారాలు జరిపారనే ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటెలిజెన్స్ విభాగంలో ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుని, టీడీపీ కోసం సేవలు అందించేలా చేశారనే విమర్శలు ఉన్నాయి. పదవీ విరమణ చేసిన యోగానంద్, మాధవరావు వంటి అధికారులను ఇంటెలిజెన్స్ ఓఎస్‌డీలుగా నియమించుకుని, కుల సమీకరణలకు తెరలేపారంటూ విమర్శలు వచ్చాయి. పలు కీలక అంశాల్లో ఇంటెలిజెన్స్ చీఫ్ వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావుపై ఎన్నికల సంఘం వేటు వేయడం గమనార్హం.
వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో వైఫల్యం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో విఫలమైన వైఎస్సార్ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మపై కూడా ఎన్నికల కమిషన్ వేటు వేసింది. వైఎస్సార్‌సీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న వివేకానందరెడ్డి ఎన్నికల ముందు దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో రాజకీయ కుట్ర కోణం జోలికి పోకుండా పోలీసులు దర్యాప్తును తప్పుదోవ పట్టించారు. ప్రభుత్వ పెద్దలు, ఇంటెలిజెన్స్ చీఫ్ జోక్యం కారణంగా వైఎస్సార్‌సీపీపై, వైఎస్ కుటుంబ సభ్యులపై నెపం నెట్టే ప్రయత్నాలు జరిగాయి. పోలీసులు ఇదే దిశగా దర్యాప్తు చేపట్టి, అసలు కుట్ర కోణాన్ని వదిలేయడం పట్ల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ రాహుల్‌దేవ్ వర్మపై వేటు వేసిన ఎన్నికల కమిషన్ ఆయనను పోలీస్ ప్రధాన కార్యాలయానికి సరెండర్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
రూ.5 కోట్లు వదిలేసినందుకే..
శ్రీకాకుళం జిల్లా ఎస్పీ వెంకటరత్నం అధికార టీడీపీకి కొమ్ము కాస్తున్నారనే ఫిర్యాదులతో ఎన్నికల కమిషన్ ఆయనపై వేటేసింది. కొద్ది రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలోని టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళి వాహనంలో తీసుకెళ్తున్న రూ.5 కోట్లను తనిఖీల సందర్భంగా అధికారులు పట్టుకున్నారు. ఇంటెలిజెన్స్ డీజీ ఆదేశాలతో ఆ డబ్బును వదిలేశారనే ఫిర్యాదుతో ఎస్పీ వెంకటరత్నంపై ఎన్నికల కమిషన్ వేటు వేసినట్లు సమాచారం. నాన్‌కేడర్ ఎస్పీగా పదోన్నతి పొందిన వెంకటరత్నంను ఇటీవలే శ్రీకాకుళం ఎస్పీగా నియమించారు.
డీజీపీ అత్యవసర సమావేశం
రాష్ట్రంలో ముగ్గురు పోలీసు అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్ వేటు వేసిన నేపథ్యంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్ మంగళవారం రాత్రి అత్యవసర సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. ఆ ముగ్గురు అధికారుల స్థానాల్లో ఎవరిని నియమించాలనే దానిపై తర్జనభర్జన సాగినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment