గిరిజన ఆణిముత్యాలు | Araku Constituency Elections History | Sakshi
Sakshi News home page

గిరిజన ఆణిముత్యాలు

Published Sun, Mar 31 2019 8:40 AM | Last Updated on Sun, Mar 31 2019 8:40 AM

Araku Constituency Elections History - Sakshi

భాగ్యలక్ష్మి, పుష్స శ్రీవాణి, కళావతి, మాధవి

సాక్షి, అమరావతి: కటిక పేదరికం నుంచి వచ్చి కష్టపడి ఉన్నత చదువులు చదివిన వీరందరినీ ఇప్పుడు అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు తన ప్రతినిధులుగా పంపించేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి ఎంపికచేశారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ, విజయనగరం జిల్లా కురుపాం, సాలూరు, విశాఖపట్నం జిల్లా పాడేరు, అరకు, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, పశ్చిమగోదావరి జిల్లా పోలవరం అసెంబ్లీ స్థానాలతో పాటు అరకు లోక్‌సభ స్థానం గిరిజనులకు రిజర్వు అయ్యాయి. త్వరలో జరగబోయే ఎన్నికలకోసం ఈ స్థానాలకు వైఎస్సార్‌ సీపీ, టీడీపీ అభ్యర్థులను ఖరారు చేశాయి. ఈ అభ్యర్థుల వ్యక్తిగత సమాచారం చూస్తే టీడీపీ, వైఎస్సార్‌ సీపీ మధ్య నక్కకు, నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది.   

రాజు.. పేద మధ్య పోటీ 
అరకు లోక్‌సభ టీడీపీ అభ్యర్థిగా కురుపాం రాజకుటుంబానికి చెందిన కిశోర్‌చంద్రదేవ్‌ను బరిలోకి దించింది. రాజ కుటుంబానికి చెందిన ఆయన కాంగ్రెస్‌ సీనియర్‌ నేతగా కేంద్రంలో అనేక హోదాల్లో పనిచేసి ఆర్థికంగా ఎంతో స్థితిమంతుడుగా మారారు. కేంద్రంలో యూపీఏ–2 ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ కాంగ్రెస్‌ అధిష్టానం ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తీరని అన్యాయం చేసినా నోరెత్తి ఒక్కమాట మాట్లాడలేదు. కనీసం లోక్‌సభలో రాష్ట్రానికి న్యాయం చేయాలనీ కోరలేదు. కాంగ్రెస్, టీడీపీ లోపాయికారీ ఒప్పందాల నేపథ్యంలో సరిగ్గా ప్రస్తుత సాధారణ ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్‌ నుంచి తెలుగుదేశంలో చేరారు.

అరకు నుంచి తమ పార్టీ నుంచి డబ్బున్న అభ్యర్థులను పోటీకి నిలబెట్టాలన్న ఒకే ఒక్క వ్యూహంతో చంద్రబాబు టీడీపీలోకి కిశోర్‌చంద్రదేవ్‌ను తెచ్చుకుని సీటిచ్చారు. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఇదే లోక్‌సభ స్థానానికి తమ పార్టీ అభ్యర్థినిగా సామాన్య గిరిజన మహిళ గొట్టేటి మాధవిని బరిలోకి దించారు. గిరిజన సంక్షేమ హాస్టల్‌లో ఉండి కష్టపడి డిగ్రీ వరకు చదివారు.

ఈమె తండ్రి గొట్టేటి దేవుడు రెండుసార్లు సీపీఐ ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా ఆ కుటుంబం కటిక పేదరికంతోనే గడిపింది. అనారోగ్యం పాలైన ఆయన కనీసం వైద్యం కూడా చేయించుకోలేక మృతి చెందారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన మాధవిని వైఎస్సార్‌ సీపీ ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఇదే అరకు లోక్‌సభ నియోజకవర్గంలో, రాష్ట్రంలో కూడా హాట్‌ టాపిక్‌గా మారింది. చిత్రమేమంటే కిశోర్‌చంద్రదేవ్‌ గిరిజనుడు కాదని, ఆయన గిరిజనేతరుడని గిరిజన సంఘాలు ఆయన్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ఆయనపై న్యాయపోరాటం కూడా చేస్తున్నాయి. 

అసలు.. నకిలీల మధ్య పోటీ 
ఇక అరకు లోక్‌సభ స్థానంలోని అసెంబ్లీ సెగ్మెంట్ల అభ్యర్థుల సంగతి కూడా ఇలానే ఉంది. కురుపాం అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే జనార్థన్‌ థాట్రాజ్‌ను పెట్టారు. ఈయన ఎస్టీ కాదని గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చాయి. కోర్టులు తీర్పులిచ్చినా వాటిని బేఖాతరు చేస్తూ టీడీపీ తమ అభ్యర్థిగా రంగంలోకి దించింది. చివరకు ఆయన నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. దీంతో ఆయన తల్లి నరసింహ ప్రియ థాట్రాజ్‌ను తమ అభ్యర్థిగా టీడీపీ ప్రచారం చేస్తోంది. ఈమె సోదరుడు శత్రుచర్ల విజయరామరాజు గతంలో ఎస్టీ ఎమ్మెల్యేగా కొనసాగగా ఆయన గిరిజనుడు కాదని కోర్టు తేల్చిచెప్పింది.

దీంతో ఆయన జనరల్‌ స్థానాల్లో పోటీచేస్తున్నారు. కొడుకు, సోదరుడు గిరిజనేతరులుగా ఉండగా నరసింహప్రియను ఎస్టీ అంటూ టీడీపీ నేతలు గిరిజనులను మోసం చేస్తన్నారని గిరిజన సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. కాగా, గిరిజన పాఠశాలలో విద్యనభ్యసించిన సామాన్య కుటుంబానికి చెందిన పాముల పుష్పశ్రీ వాణిని వైఎస్సార్‌ సీపీ బరిలోకి దించింది. కురుపాం సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన ఈమె విలువలకు కట్టుబడి, ప్రలోభాలకు లొంగకుండా నిజాయతీగా చివరివరకు వైఎస్సార్‌ సీపీలోనే కొనసాగారు.   సాలూరు అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్పీ బాంజ్‌దేవ్‌ను ప్రకటించింది.

ఈయన కూడా గిరిజనుడు(ఎస్టీ) కాదని గతంలో హైకోర్టు తీర్పు ఇవ్వడంతో అర్థంతరంగా ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోయారు. అప్పట్లో రెండోస్థానంలో ఉన్న పీడిక రాజన్న దొరను ఎమ్మెల్యేగా ప్రకటించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన చిన్న వెసులుబాటును ఆసరా చేసుకుని టీడీపీ ప్రభుత్వం ఏకంగా భాంజ్‌దేవ్‌ గిరిజనుడంటూ జీఓ ఇచ్చి గిరిజనులను మోసగించింది. ఇప్పుడు ఆయన్ను సాలూరు నుంచి తమ అభ్యర్థిగా మళ్లీ పోటీకి దింపింది. దీనిపైనా ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తోంది.  ఇదే స్థానం నుంచి వైఎస్సార్‌ సీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పీడిక రాజన్న దొరను మరోసారి బరిలోకి దించింది.

చంద్రబాబు ఎన్ని ప్రలోభాలు పెట్టినా వైఎస్సార్‌సీపీలోనే కొనసాగిన రాజన్నదొర గిరిజనుల హక్కుల కోసం నిరంతరం న్యాయపోరాటం చేసే నాయకుడు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి, జీసీసీలో ఉద్యోగం వదులుకుని రాజకీయాల్లోకి వచ్చిన రాజన్నదొర నాలుగోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.   ఈ ఎన్నికల్లో అసలైన గిరిజనులనే ఎమ్మెల్యేలుగా గెలిపించాలని ఏపీ ఎస్టీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ న్యాయ సలహాదారు రేగు మహేష్‌ పేర్కొన్నారు. – సి. శ్రీనివాసరావు సాక్షి, అమరావతి

రంపలో ప్రభుత్వ టీచర్‌కు వైఎస్సార్‌సీపీ సీటు 

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సామాన్య గిరిజన కుటుంబానికి చెందిన ప్రభుత్వ టీచర్‌ ధనలక్ష్మికి అవకాశం కల్పించారు. గతంలో వైఎస్సార్‌ సీపీ తరఫున గెల్చి టీడీపీ ప్రలోభాలకు లొంగి ఆ పార్టీలోకి ఫిరాయించిన వంతల రాజేశ్వరిని చంద్రబాబు తన పార్టీ తరఫున పోటీలో పెట్టారు. పాడేరు నుంచి వైఎస్సార్‌ సీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అనంతరం టీడీపీలో ఫిరాయించగా ఆమెకు మళ్లీ టీడీపీ టిక్కెట్‌ ఇచ్చి బరిలో దించింది. ఇక్కడ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా ఉన్నత విద్యావంతురాలు కొత్తగుల్లి భాగ్యలక్ష్మికి అవకాశం ఇచ్చింది.

అరకు నుంచి టీడీపీ అభ్యర్థిగా మంత్రి కిడారి శ్రవణ్‌ను బరిలోకి దించింది. గతంలో వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన కిడారి సర్వేశ్వరరావు కుమారుడు ఈయన. ఇక్కడ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా బ్యాంకు మేనేజర్‌గా పనిచేసిన విద్యావంతుడు శెట్టి ఫాల్గుణను బరిలోకి దించింది. పాలకొండ నుంచి టీడీపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీల తరపున పాత అభ్యర్థులే బరిలో దిగారు. టీడీపీ నుంచి నిమ్మక జయకృష్ణ పోటీ చేస్తుండగా, వైఎస్సార్‌ సీపీ నుంచి ఎమ్మెల్యే కళావతి పోటీ చేస్తున్నారు. సకాలంలో గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయకుండా చంద్రబాబు అన్యాయం చేశారని గిరిజనులు విమర్శిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement