పోలింగ్ ముగిసింది. పోలైన ఓట్లు వివరాలను బూత్‌లలో పోలింగ్ ఏజెంట్లకు ఆఫీసర్లు అందజేశారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపర్చారు. అభ్యర్థు లంతా కౌంటింగ్ వరకూ వేచి ఉండాల్సిన పరిస్థితి. కానీ టీడీపీ నేతలు కోడిగుడ్డుపై వెంట్రుకలు పీకే ప్రయత్నాలు ప్రారంభించారు. నియోజకవర్గాలవారిగా ఫారం–17సీ ఇవ్వాలంటూ రిటర్నింగ్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. అధినేత చంద్రబాబు పర్యటన తర్వాత మరింతగా బెదిరింపులకు దిగుతున్నట్లు సమాచారం.
సాక్షి ప్రతినిధి కడప: జిల్లాలో ఇటీవల ముగిసిన ఎన్నికల్లో 22,04,964 ఓట్లకుగాను 2,726 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. 17,02,981 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సగటు 77.23శాతం పోలింగ్ నమోదయ్యింది. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో పోలింగ్ ఏజెంటుకు నమోదైన ఓట్ల వివరాలను ఫారం–17సీ లో పొందుపర్చి జాబితాను అందించారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఏజెంట్లకు ఫారం–17సీ అందిస్తారు. ఇంతవరకూ ఎలాంటి ఆరోపణలు లేవు. టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా పర్యటన ముగిశాక ఫారం–17సీ ఇవ్వాలంటూ టీడీపీ అభ్యర్థులు ఆర్వోల వెంటపడుతున్నారు. స్ట్రాంగ్ రూముల్లో భద్రపర్చేంతవరకూ వీరు ఈ వివరాలు కోరలేదు. ఎన్నికల యంత్రాంగం పారదర్శకత కోసం ఈవీఎంలతో పాటుఫారం–17సీ కూడా స్ట్రాంగ్ రూములల్లో భద్రపర్చారు. చంద్రబాబు జిల్లా పర్యటన తర్వాత ఈ జాబితా ఎందుకివ్వరంటూ నాయకులు తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగుతోన్నట్లు సమాచారం.
దేవమాచుపల్లె బూచి చూపెడుతూ....
రైల్వేకోడూరు నియోజకవర్గం దేవమాచుపల్లె పోలింగ్ బూత్–21లో 707 ఓట్లుకు గాను 645 ఓట్లు పోలైయ్యాయి. బూత్‌లో పురుషులు–337, మహిళలు–370 ఓట్లు ఉండగా అందులో పురుషులవి–320 ఓట్లు, మహిళలవి–325ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ ఆఫీసరు ఫారం–17సీలో పురుషుల ఓట్లు 370 నమోదైనట్లుగా రాశారు. ఈ స్వల్ప తప్పిదాన్ని ఆసరా చేసుకుని మొత్తం పోలింగ్‌నే తప్పుబట్టుతూ టీడీపీ ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకెళ్లింది. టీడీపీ ఫిర్యాదు ఆధారంగా అధికారుల పరిశీలనలో మహిళ ఓటర్లు సంఖ్యను పురుషుల పోల్డ్ ఓటర్లు జాబితాలో పోలింగ్ అధికారి పొందుపర్చినట్లు రూఢీ అవుతోంది. పోలింగ్ అధికారి పొరపాటున పొందుపర్చినా తప్పునకు చర్యలు సహజం. ఈ కారణంగా పోలింగ్ నిర్వహణే సక్రమంగా లేదని, ఈవీఎంలు ట్యాపంరింగ్ అంటూ లేని ఆరోపణలు చేస్తూ టీడీపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.దేవమాచుపల్లె బూత్–21లో పురుషుల ఓట్లు సంఖ్య 337 ఉంటే పోలింగ్‌లో 370 ఓట్లు ఎలా నమోదయ్యాయని టీడీపీ రాద్ధాంతాం చేస్తోంది. వాస్తవంగా అక్కడ పోల్ అయిన పురుషుల ఓట్లు 320 మాత్రమే. ఈవాస్తవాన్ని విస్మరించి ఆరోపణల్లో నిమగ్నమయ్యారు.
ఫారం–17సీ ఇవ్వాల్సిందే: పీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి
ఫారం–17సీ ఇవ్వాలంటూ కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి రిటర్నింగ్ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. తాము అడిగేంతవరకూ ఎందుకు ఇవ్వలేదంటూ తీవ్రస్థాయిలో దబాయిస్తున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ ఏజెంట్లకు ఎక్కడిక్కడ బూత్‌లు వారిగా అందజేశామని, మొత్తం వివరాలు ఈవీఎంలతోపాటు స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపర్చామని అధికారులు తెలియజేస్తున్నట్లు సమాచారం. పోలింగ్ ఏజెంట్ల నుంచి ఫారం–17సీ తెచ్చుకోకుండా ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్లుగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment