పచ్చ జెండా ఎత్తిన పోలీసు బాసులు! | Police Department Ready to cooperate to TDP | Sakshi
Sakshi News home page

పచ్చ జెండా ఎత్తిన పోలీసు బాసులు!

Published Sat, Mar 23 2019 5:06 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

Police Department Ready to cooperate to TDP - Sakshi

సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల కదలికలను నిశితంగా గమనించండి.. ఓటర్లకు టీడీపీ డబ్బులు తప్ప వైఎస్సార్‌సీపీ సొమ్ము చేరకుండా అడ్డుకోండి.. ఏదేమైనా ఈసారికి టీడీపీ అధికారంలోకి వచ్చేలా చూడాలి..’ ఇదేదో టీడీపీ శ్రేణులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లో చెప్పిన మాటలు అనుకుంటే తప్పులో కాలేసినట్టే. చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులు తమ సిబ్బందికిస్తున్న ఫోన్‌ ఆదేశాలివీ.. టీడీపీ జెండాను భుజానికెత్తుకున్న కొందరు పోలీసు అధికారులు గడిచిన రెండు రోజులుగా జిల్లాలవారీగా ఫోన్లలో చెబుతున్న మాటలు విని పోలీసులే విస్తుపోతున్నారు. చంద్రబాబు సేవలో కొందరు పోలీసు బాసులు ఈ రీతిలో తరించిపోతుండడం పట్ల సాధారణ పోలీసుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. పచ్చ చొక్కాలు వేసుకుని కొందరు పనిచేస్తుండంతో పోలీసు శాఖకే మాయని మచ్చగా మారిందని, మునుపెన్నడూ ఇంతటి దారుణమైన పరిస్థితి లేదని ఒక రిటైర్డ్‌ పోలీస్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీ సేవలో..
రాష్ట్రంలో టీడీపీకి ఎదురుగాలి వీస్తోందని గుర్తించిన చంద్రబాబు తిరిగి ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తూ.. ఇందుకోసం పోలీసు శాఖను పెద్ద ఎత్తున తన సొంత ప్రయోజనాలకోసం వినియోగించుకుంటున్నారు. ఇందుకోసం పథకం ప్రకారం వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో పలు విభాగాల్లో కీలకంగా పనిచేస్తున్న పోలీసు బాసులు ఇందుకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఆ మేరకు ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడానికి మూడు నెలల ముందునుంచే ఇచ్చిన దాదాపు 26 డీవో(బదిలీ ఉత్తర్వులు)లతో కావాల్సిన వారిని కావాల్సిన ప్రాంతాల్లో నింపేశారు. ప్రతీ జిల్లాలోనూ ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ, స్పెషల్‌ బ్రాంచి డీఎస్పీ, కీలక ప్రాంతాల్లోని శాంతిభద్రతల డీఎస్పీలను నియమించుకోవడంలో చక్రం తిప్పిన నలుగురు రాష్ట్రస్థాయి కీలక అధికారులు ఇప్పుడు టీడీపీ సేవలో తరించడంలో డైరెక్షన్‌ ఇస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ నియోజక వర్గాల్లోని వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల వెంట ఒక కానిస్టేబుల్, హెడ్‌ కానిస్టేబుల్‌ను నీడలా వెంటాడే ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కదలికలను పసిగట్టడం, అక్కడి సమీకరణలు, ప్రచారం తదితర విషయాలను వారు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేసేలా ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వచ్చే ఈ సమాచారాన్ని ఆసరాగా తీసుకుని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను దెబ్బతీసేలా కుయుక్తులు పన్నుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కట్టుదిట్టమైన నెట్‌వర్క్‌..
ఇప్పటికే వివాదాస్పదమైన డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ నేరుగా ఎన్నికల విధుల్లో కనిపించకుండా ప్రభుత్వ పెద్దలు, ఇంటెలిజెన్స్‌ నుంచి వస్తున్న ఆదేశాల మేరకు పనిచేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలవారీగా సీఎం సొంత సామాజికవర్గం, సొంత మనుషులతో ఏర్పాటు చేసుకున్న పోలీస్‌ నెట్‌వర్క్‌ను ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు సమన్వయం చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం ఆఫీసు, ఇంటెలిజెన్స్‌ మధ్య రిటైర్డ్‌ పోలీసు అధికారి, ఇంటెలిజెన్స్‌ ఓఎస్‌డీ యోగానంద్‌ సమన్వయం చేసుకుంటున్నట్టు సమాచారం. అటు సీఎం ఆఫీసు, ఇటు ఇంటెలిజెన్స్‌ నుంచి వచ్చే సమాచారంతో డీజీపీ కార్యాలయంలో శాంతిభద్రతల డీఐజీగా ఉన్న ఘట్టమనేని శ్రీనివాస్‌ ఎప్పటికప్పుడు పోలీసు యంత్రాంగాన్ని నడిపిస్తున్నట్టు పోలీసు శాఖలో చర్చ సాగుతోంది. ఈ కీలక అధికారులు జిల్లాలవారీగా తమ వారితో అనధికార వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు టీడీపీకోసం ఏమి చేయాలో డైరెక్షన్‌ ఇస్తున్నట్టు ఒక సీనియర్‌ పోలీసు అధికారి చెప్పారు.

జరుగుతున్నదిదీ..
గత ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా రంగంలోకి దిగిన బడా పారిశ్రామికవేత్తలు జిల్లాలవారీగా బాధ్యతలు తీసుకుని డబ్బు మూటలను అంబులెన్సుల ద్వారా అసెంబ్లీ నియోజక వర్గాలకు తరలించినట్టు ఆరోపణలున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో కొందరు పోలీసుల అండతో వారి వాహనాల్లోనే దర్జాగా తరలిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లిలో ప్రత్యేకంగా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసుకున్నారు. టీడీప తరపున ఏపీ పోలీసులు డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణలతో అక్కడి పోలీసులు ఏపీకి చెందిన ఇద్దరు ఇంటెలిజెన్స్‌ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. మా వాళ్లు డబ్బులు పంపిణీకి వెళ్లలేదని, విధి నిర్వహణలో భాగంగానే వెళ్లారంటూ అప్పట్లో ఏపీ డీజీపీ ఠాకుర్‌ ఖండించారు.

ఏది ఏమైనా అప్పట్లో ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసుల తీరు వివాదాస్పదమైంది.  ప్రస్తుతం లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొందరు పోలీసులు పూర్తిగా టీడీపీ సేవలో తరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాలకు డబ్బు చేరవేతతోపాటు టీడీపీ డబ్బు పంపిణీ సజావుగా జరిగేలా సహకరించాలనే సంకేతాలిచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో వైఎస్సార్‌సీపీకి చెందిన అభ్యర్థుల ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టాలని మౌఖిక ఆదేశాలిచ్చినట్టు సమాచారం. వైఎస్సార్‌సీపీ శ్రేణులను బైండోవర్, కేసులు, బెదిరింపులతో కట్టడి చేయాలని కూడా ఆదేశాలందినట్టు తెలిసింది. ఇలా డబ్బు పంపిణీతోపాటు అన్ని విషయాల్లోనూ పోలీసు మార్కు ఎత్తుగడ టీడీపీకి అనుకూలిస్తే గెలవచ్చన్నది అధికార పార్టీ ఎత్తుగడగా చెబుతున్నారు.

టీడీపీ సేవలో ఇలా..
- శ్రీకాకుళం జిల్లా రాజాం టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళీకి చెందిన వాహనంలో నోట్ల కట్లలు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికినా పోలీస్‌ కీలక అధికారి ఆదేశాలతో వదిలేసినట్టు సమాచారం.
చిత్తూరు జిల్లా పీలేరులో టీడీపీ అభ్యర్థికోసం ఏకంగా ఒక సీఐ కారులో కోట్లాది రూపాయలు తరలించిన విషయంపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందినప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా సర్దేసినట్టు తెలిసింది. 
గుంటూరు జిల్లాలోని ఒక డీఎస్పీ టీడీపీ ప్రచార ఏర్పాట్ల నుంచి అన్నీ తానై చూసుకుంటున్నారు. 
రాయలసీమలోని ఒక డీఎస్పీ టీడీపీ యంత్రాంగాన్ని తన కనుసన్నల్లో నడిపిస్తున్నారు. ఆయనకు పోలీసు ప్రధాన కార్యాలయంలోని ఒక అధికారి డైరెక్షన్‌ ఇస్తున్నట్టు సమాచారం. 
మంత్రి అచ్చెన్నాయుడి సోదరుడైన విశాఖపట్నం డీఎస్పీ టీడీపీ కోసం చురుకుగా సేవలందిస్తున్నారు. 
విజయవాడలోని ఒక ఏసీపీ అధికారపార్టీకి చెందిన డబ్బు చేరవేత నుంచి అన్నీ తానై సహకారమందిస్తున్నట్టు విమర్శలున్నాయి. 
ప్రకాశం జిల్లాలోని ఒక డీఎస్పీ టీడీపీ అభ్యర్థులకు అవసరమైన సేవలందిస్తున్నట్టు చెబుతున్నారు

ఎన్నికల కమిషన్‌కు వస్తున్న ఫిర్యాదులపై క్లీన్‌చిట్‌..
రాష్ట్రంలో జిల్లాలవారీగా పోలీసులపై పెద్ద ఎత్తున ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నట్టు తెలిసింది. చిత్రమేమిటంటే పోలీసులపై రోజుకు 20 నుంచి 25కుపైగా ఫిర్యాదులు ఈసీకి వస్తుంటే ఆయా పోలీసులకు రాష్ట్ర పోలీసు అధికారులు మాత్రం క్లీన్‌చిట్‌ ఇస్తుండటం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు సక్రమంగా, స్వేచ్ఛగా జరగాలంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులను మార్చాల్సిన అవసరముందని ఈసీని ప్రజలు, ప్రతిపక్షాలు కోరుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement