సాక్షి, అమరావతి: ఇంటెలిజెన్స్.. పోలీసు వ్యవస్థలో అత్యంత కీలకమైనది నిఘా వ్యవస్థ. శాంతిభద్రతలకు భంగం కలిగించే సంఘ విద్రోహశక్తుల కదలికలను, మావోయిస్టు, తీవ్రవాద కార్యకలాపాల్ని నిశితంగా కనిపెడుతూ పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ఈ వ్యవస్థది. ఇప్పుడీ యంత్రాంగం పూర్తిగా దారితప్పింది. ‘పచ్చ’ సేవలో తరిస్తోంది. సీఎం చంద్రబాబు ఇంటెలిజెన్స్ వ్యవస్థను తన జేబు వ్యవస్థగా మార్చేశారు. ఫలితంగా రాష్ట్ర పౌరుల భద్రతను గాలికొదిలేసిన ఇంటెలిజెన్స్.. ఎల్లో నెట్‌వర్క్‌గా మారిపోయిందనే విమర్శలను మూటగట్టుకుంది. ప్రస్తుత ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు పూర్తిగా పచ్చచొక్కా తొడుక్కుని పనిచేస్తున్నట్టు ఆరోపణలు ముంచెత్తుతున్నాయి. జిల్లాల్లో ఇంటెలిజెన్స్ డీఎస్పీల నుంచి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలోని ఓఎస్‌డీ వరకు సీఎం సొంత సామాజికవర్గానికి చెందినవారితో నింపేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇప్పుడీ నిఘా వ్యవస్థ దారితప్పిందని, చేయాల్సిన పని వదిలేసి.. పూర్తిగా టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తోందనే తీవ్రమైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చివరకు టీడీపీ అభ్యర్థుల ఎంపికలోనూ కీలకపాత్ర పోషిస్తోందని, అదే సమయంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల్ని నీడలా వెంటాడుతూ ఎప్పటికప్పుడు వారి సమాచారాన్ని పొలిటికల్ బాస్‌కు చేరవేయడం ద్వారా టీడీపీకి రాజకీయంగా తోడ్పడడంలో నిమగ్నమైనట్టు చర్చ నడుస్తోంది.
టీడీపీ సేవలోనే ఇంటెలిజెన్స్ సిబ్బంది..
రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో ఇంటెలిజెన్స్ డీఎస్పీ పర్యవేక్షణలో అసెంబ్లీ నియోజకవర్గానికో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ను కేటాయించారు. అదే పట్టణ ప్రాంతాల్లో ఇద్దరు, ముగ్గురు సిబ్బందిని నియమించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 256 మంది ఇంటెలిజెన్స్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తూ రోజువారీ సమాచారం ఇస్తుంటారు. ఆ సమాచారాన్ని రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో 150 మంది క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తుంటారు. వీరందరినీ రాజకీయ కోణంలోనే పనిచేయిస్తుండడం గమనార్హం. దీంతో అసలు విధులను మరిచి అధికార టీడీపీకి ఏజెన్సీగా వ్యవహరిస్తున్నట్టు విమర్శలు రేగుతున్నాయి. అంతేగాక ప్రతిపక్షాన్ని ఇబ్బందిపెట్టి పాలకపక్షానికి కొమ్ముకాసేలా వ్యవహరిస్తోందనే చర్చ కూడా సాగుతోంది. చేయాల్సిన పని వదిలేసి అధికారపార్టీ సేవలో నిఘా వ్యవస్థ తరిస్తోందని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఒకరు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కారణంగా చంద్రబాబు అధికారం చేపట్టాక రాష్ట్రంలో చోటుచేసుకున్న పలు ఘటనలతో ఇంటెలిజెన్స్ విభాగం తీవ్ర అభాసుపాలైందని వ్యాఖ్యానించారు.
అంతా తానై వ్యవహరిస్తున్న ఏబీవీ..
ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఆయన పూర్తిగా పచ్చచొక్కా తొడుక్కుని పనిచేస్తున్నారని, పోలీసు శాఖలో బదిలీలు, పోస్టింగుల్లో సొంత సామాజికవర్గానికి పెద్దపీట వేస్తున్నారని పోలీసు అధికారులు, సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు అధికారం చేపట్టిన తొలినాళ్లలో ఏఆర్ అనురాధను ఇంటెలిజెన్స్ ఏడీజీగా నియమించారు. ఓటుకు కోట్లు స్కామ్‌లో చంద్రబాబు అడ్డంగా దొరికిపోవడంతో అనురాధపై వేటుపడింది. తర్వాత విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుకు ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్టు కట్టబెట్టారు. అప్పట్నుంచీ ఆయన పూర్తిగా చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకోసమే పనిచేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల్ని టీడీపీలోకి తీసుకొచ్చేందుకు జరిగిన బేరసారాల్లో ఆయనే కీలకపాత్ర వహించినట్టు ఆరోపణలున్నాయి. భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతితో జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో ఇంటెలిజెన్స్‌ను పూర్తిగా టీడీపీకోసమే ఉపయోగించారనే ఆరోపణలొచ్చాయి. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లోనూ టీడీపీ సేవకు ఇంటెలిజెన్స్‌లోని సొంత సామాజికవర్గం వారిని ఏబీవీ రంగంలోకి దించినట్టు పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
నిఘా వైఫల్యానికి మూల్యం..
అసలు విధులను మరిచి టీడీపీ సేవలో ఇంటెలిజెన్స్ తరిస్తున్నందునే రాష్ట్రంలో పలుమార్లు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని పోలీసు శాఖలోని పలువురు సీనియర్ అధికారులు సైతం చర్చించుకుంటున్నారు. ఇందుకుగాను వారు కొన్ని ఘటనలను ఉదహరిస్తున్నారు.
- గతేడాది విశాఖపట్నం జిల్లా అరకులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సివేరి సోమాలను మావోయిస్టులు హత్య చేసిన ఘటనకు నిఘా వ్యవస్థ వైఫల్యమే ప్రధాన కారణమంటున్నారు. ఆ ఘటనపై ఆగ్రహించిన గిరిజనులు అక్కడి పోలీస్‌స్టేషన్‌పై దాడిచేసి ధ్వంసం చేసిన విషయాన్ని నిఘా వర్గాలు ముందుగా పసిగట్టలేకపోయాయని గుర్తు చేస్తున్నారు.
- రాజధాని కేంద్రంలో సంచలనం రేపిన కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లో సొంత మనుషులను కాపాడుకునేందుకు మంత్రి, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి ఇంటెలిజెన్స్ సాయంతో ఈ అంశాన్ని పక్కదారి పట్టించారని విమర్శలున్నాయి.
- ఇసుక దందా, నీరు–మట్టి, బెట్టింగ్ మాఫియా, కృష్ణాజిల్లా ఫెర్రీ వద్ద బోటు బోల్తా వంటి అనేక ప్రధాన ఘటనల్లో ముందస్తుగా అప్రమత్తమై ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారమిచ్చి ఉంటే నష్ట నివారణ జరిగేదని పోలీసు శాఖలోనే పలువురు చర్చించుకుంటున్నారు.
నిఘా వ్యవస్థలో ఓఎస్‌డీలా?
సొంత సామాజికవర్గానికి పెద్దపీట వేయడంలో నిఘా వ్యవస్థ అతీతం కాదని చంద్రబాబు నిరూపించారని ఇంటెలిజెన్స్‌లోని ఓ అధికారి వ్యాఖ్యానించారు. రిటైర్డ్ పోలీసు అధికారులైన యోగానంద్, మాధవరావులను ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్‌డి)లుగా నియమించడాన్ని ప్రస్తావించారు. యోగానంద్ అత్యంత వివాదాస్పద చరిత్రను మూటగట్టుకున్నారని ఆ విభాగంలోని సిబ్బందే చర్చించుకుంటున్నారు. 2014లో చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లను యోగానంద్ డీఐజీ హోదాలో అన్నీ తానై పర్యవేక్షించారు. అనంతరం ఇంటెలిజెన్స్‌కు వచ్చిన ఆయన సీఎంకు సన్నిహితంగా మెలుగుతూ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న అనురాధను సైతం బేఖాతరు చేసేవారని అక్కడి సిబ్బంది ఇప్పటికీ చెబుతుంటారు. పోలీసు శాఖలో అసలు కులాలవారీ లెక్కలు తీసింది యోగానందేనని, అందుకే ఆయన్ను సిబ్బంది కులానంద్ అని పిలుస్తారని పోలీసు అధికారి ఒకరు చెప్పడం గమనార్హం. యావత్ రాష్ట్రాన్ని నివ్వెరపరిచిన విశాఖ భూకుంభకోణం సమయంలో అక్కడే పనిచేసిన యోగానంద్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
Comments
Please login to add a commentAdd a comment