సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త గనుల లీజుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను పూర్తిగా అన్‌లైన్ చేశామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. గనుల లీజులు, అనుమతుల దరఖాస్తులను ఇకపై ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చన్నారు. లీజుల పునరుద్ధరణ దరఖాస్తులను సైతం ఆన్‌లైన్‌లో స్వీకరిస్తామన్నారు. గనుల శాఖ ఇప్పటికే అందిస్తున్న ఆన్‌లైన్ సేవలకు అనుబంధంగా కొత్త సేవలను బుధవారం మంత్రి కేటీఆర్ సచివాలయంలో ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. దరఖాస్తుదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా అన్‌లైన్‌లో దరఖాస్తుల స్థితిగతులను తెలుసుకోవచ్చన్నారు. ఆన్‌లైన్ విధానంతో లైసెన్సుల పునరుద్ధరణ ద్వారా రాయల్టీలు సకాలంలో అంది ఖజానాకు అదాయం పెరుగుతుందని చెప్పారు. ఏ అధికారినీ నేరుగా కలవాల్సిన అవసరం లేకుండా అనుమతులు పొందవచ్చని, దీంతో పారదర్శకత, వేగం పెరుగుతుందని అన్నారు. ఖనిజాల డీలర్లకు సైతం లైసెన్సుల కోసం దరఖాస్తుల సమర్పణ, అమ్మకాలు, నిల్వ వంటి కార్యకలాపాలను నిర్వహించేందుకు డిజిటల్ సంతకాలతో కూడిన లైసెన్సులు జారీ చేస్తామని గనుల శాఖ డైరెక్టర్ సుశీల్‌కుమార్ మంత్రికి తెలిపారు.
లీజు విస్తీర్ణం డిజిటైజ్..
గనుల శాఖ ఇప్పటికే టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకుంటోందని, రాష్ట్రంలో గనులు, వివిధ రకాల ఖనిజాలు లభించే ప్రాంతాలు, వాటి నిల్వలు, ఖనిజాల ఆధారిత పరిశ్రమలు, వాటి అభివృద్ధికి ఉన్న అవకాశాల వివరాలను గనుల శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరి చామని మంత్రి కేటీఆర్ చెప్పారు. లీజుకు ఇచ్చిన విస్తీర్ణాన్ని డిజిటైజ్ చేసి దాన్ని జియో మ్యాపింగ్ చేయడం, మైనింగ్ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి కార్యకలాపాలను పర్యవేక్షించడం, డ్రోన్ల వినియోగం లాంటి కార్యక్రమాలను వెంటనే చేపట్టాలని గనుల శాఖను మంత్రి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment