సాక్షి, హైదరాబాద్: రాక్షస బల్లుల శిలాజాల జాడ కనుక్కునేందుకు చాలాకాలం తర్వాత జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) మళ్లీ నడుం బిగించింది. మంచిర్యాల జిల్లా యామన్‌పల్లి పరిసరాల్లో ఆ విభాగం శాస్త్రవేత్తల బృందం మూడు రోజులపాటు పర్యటించి శిలాజాల ఆధారాలను కనుగొంది. రాకాసిబల్లితోపాటు కొన్ని ఇతర జంతువుల శిలాజాలుగా భావిస్తున్న రాళ్లపై ప్రాథమిక పరిశోధనలు చేసి వాటిల్లో శిలాజాలుగా గుర్తించిన వాటిల్లో కొన్నింటిని, మిగతావాటి నమూనాలను సేకరించారు. ‘రాళ్లలో రాక్షసబల్లి’శీర్షికతో మే 22న ‘సాక్షి’ప్రచురించిన కథనానికి ఆ విభాగం స్పందించింది. స్థానిక యామన్‌పల్లి సమీపంలో నిర్మించిన వంతెన రివిట్‌మెంట్ రాళ్లలో శిలాజాలను పోలిన రాళ్లున్న విషయంతోపాటు, ఇతర ప్రాంతాల్లో కనిపిస్తున్న కొన్ని జాడల వివరాలు, స్థానికులు కొందరు శిలాజాలను బేరం పెట్టిన తీరును ఆ కథనం వెలుగులోకి తెచ్చింది. 1970లలో ఇక్కడే డైనోసార్ అస్థిపంజరం లభించింది.
మూడు రాక్షస బల్లులకు సంబంధించిన ఎముకలను సేకరించిన అప్పటి జీఎస్‌ఐ పరిశోధకులు వాటిని ఓ ప్రత్యేక పద్ధతిలో కూర్చి డైనోసార్ ఆకృతిని రూపొందించారు. ప్రస్తుతం హైదరాబాద్ బీఎం బిర్లా సైన్స్ మ్యూజియంలోని డైనోసోరియంలో ప్రదర్శనలో ఉన్న ఆకృతి అదే. కోల్‌కతా మ్యూజియం తర్వాత రాక్షసబల్లి రెండో అస్థిపంజరం మనదేశంలో ఇదే కావటం విశేషం. అప్పట్లో జీఎస్‌ఐ పరిశోధకులు యాదగిరి ఈ ప్రాంతంలో విస్తృతంగా పరిశోధనలు జరిపి వాటి ఆధారాలను గుర్తించారు. ఆయన మృతి చెందిన తర్వాత దాదాపు 2 దశాబ్దాలుగా జీఎస్‌ఐ ఇటువైపు చూడలేదు. దీంతో అప్పటినుంచి ఆయా ప్రాంతాల్లో అడపాదడపా శిలాజాలు వెలుగు చూస్తున్నా... వాటిపై స్థానికుల్లో అవగాహన లేకుండా పోయింది. దీంతో శిలాజాలను సాధారణ రాళ్లుగానే భావిస్తూ పనులకు వాడుకుంటున్నారు. ఇదేక్రమంలో ఇటీవల వంతెన రివిట్‌మెంట్‌లో కూడా వాడేశారు.
అందులోని కొన్ని రాళ్లు శిలాజాలను పోలినట్టు ఉండటంతో ఔత్సాహిక చరిత్ర పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్, సముద్రాల సునీల్, పులిపాక సాయి తదితరులు వాటిచిత్రాలు సేకరించారు. వాటిని పుణెలోని డెక్కన్ కళాశాలలో పనిచేస్తున్న శిలాజాల నిపుణులు ప్రొఫెసర్ బాదామ్ దృష్టికి ‘సాక్షి’తీసుకెళ్లగా.. అందులో కొన్ని శిలాజాలేనని ధ్రువీకరించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని సచిత్రంగా వివరిస్తూ ‘సాక్షి’కథనం వెలువరించటంతో రెండు దశాబ్దాల తర్వాత జీఎస్‌ఐ మళ్లీ పరిశోధనలకు శ్రీకారం చుట్టింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హైదరాబాద్ విభాగం సంచాలకులు మంజూషా మహాజన్ ఆదేశంతో శాస్త్రవేత్తల బృందం మూడు రోజులపాటు మంచిర్యాల జిల్లా యామన్‌పల్లితోపాటు సమీపంలోని పలు గ్రామాల శివార్లలో పర్యటించింది. వంతెన రివిట్‌మెంట్ రాళ్లను పరిశీలించి వాటిల్లో శిలాజాలున్నట్టు ప్రాథమికంగా గుర్తించింది. వెంట తెచ్చుకున్న రసాయనాలు, మైక్రోస్కోప్ ఆధారంగా ప్రాథమికంగా గుర్తించిన వాటిలో కొన్ని రాళ్లను వాళ్లు సమీకరించారు. కొన్నింటిని నమూనాలను సేకరించి తదుపరి పరిశీలనకు ల్యాబ్‌కు పంపారు. వాటి పూర్తి వివరాలు అందిన తర్వాత ఆయా ప్రాంతాల్లో తవ్వకాలు జరపాలని నిర్ణయించినట్టు తెలిసింది.
శిలాజాల జాడలను అన్వేషిస్తున్నాం
‘సాక్షిలో ప్రచురితమైన కథనం ఆధారంగా ఆ ప్రాంతంలో పర్యటించాం. కొన్ని రాళ్లను ప్రాథమికంగా పరిశీలించినప్పుడు శిలాజాలనే తేలింది. పూర్తిస్థాయి పరిశీలన జరగాల్సి ఉంది. పక్షం రోజుల తర్వాత వాటికి సంబంధించిన నివేదిక వస్తుంది. ఆ తర్వాత చర్యలు తీసుకుంటాం. శిలాజాలపై ప్రజల్లో అవగాహన రావాల్సిన అవసరం ఉంది. వాటిని ధ్వంసం చేయొద్దు. వాటి ఆధారం గానే తదుపరి పరిశోధనలు జరుగుతాయి’అని జీఎస్‌ఐ హైదరాబాద్ సంచాలకులు మంజూషా మహాజన్ మంగళవారం ‘సాక్షి’కి వెల్లడించారు.
వెంటనే చర్యలు చేపట్టాలి: హరగోపాల్
కోట్ల సంవత్సరాల క్రితం తిరగాడిన రాకాసి బల్లులు, నాటి ఇతర జంతువులు, పక్షులకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పటికీ వెలుగుచూసే అవకాశం ఉందని, అందుకు వాటి శిలాజాలు మాత్రమే ఏకైక ఆధారాలని ఔత్సాహిక పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా యామన్‌పల్లి పరిసరాల్లో గుర్తించినవి శిలాజాలేనని, అలాంటివి ఇంకా చాలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. జీఎస్‌ఐ వెంటనే తవ్వకాలు జరిపితే కోట్ల ఏళ్ల నాటి జంతువులు, పక్షులు, మొక్కల శిలాజాలు వెలుగు చూస్తాయని పేర్కొన్నారు. మరోవైపు వాటిని ధ్వంసం చేయకుండా సామాన్య జనంలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
రాకాసిబల్లి వేటలో జీఎస్‌ఐ
Published Wed, May 29 2019 1:52 AM | Last Updated on Wed, May 29 2019 1:52 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment