భోపాల్: డైనోసార్లు(రాక్షస బల్లులు).. వీటి రూపం ఎలా ఉంటుందో సినిమాల ద్వారా అందరికీ పరిచయమే. భౌతికంగా ఈ జాతులు మిలియన్ల సంవత్సరాల కిందటే అంతరించినా.. ఈ భూమ్మీద వీటి అవశేషాలు శిలాజాల రూపంలో బయల్పడుతూనే ఉన్నాయి. తాజాగా భారత్‌లో అరుదైన రాక్షస బల్లుల గుడ్లను వెలికితీశారు పరిశోధకులు.
ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలోని డైనోసార్ ఫోసిల్ నేషనల్ పార్క్ లో తవ్వకాలు చేపట్టారు. ఈ సందర్భంగా పది డైనోసార్ గుడ్ల అవశేషాలను వెలికితీశారు. ఇప్పటివరకు లభ్యమైన గుడ్లతో పోల్చితే ఇవి ఎంతో భిన్నంగా ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అవన్నీ అసాధారణరీతిలో ఉన్నట్టు గమనించారు. సారోపోడ్ వర్గానికి చెందిన టిటానోసారస్ డైనోసార్లకు చెందినవిగా నిర్ధారించారు.
ఓవమ్ ఇన్ ఓవో..
ఒక గుడ్డులోనే మరొక గుడ్డు ఏర్పడి ఉండడంతో రీసెర్చర్లు ఆశ్చర్యపోయారు. శాస్త్ర పరిభాషలో ఈ స్థితిని ‘ఓవమ్ ఇన్ ఓవో’ అంటారు. సాధారణంగా.. గుడ్డులోనే గుడ్డు ఉండడం అనే స్థితి పక్షుల్లో అధికంగా కనిపిస్తుందని. సో.. టిటానోసారస్ డైనోసార్లకు పక్షులకు మధ్య దగ్గరి సంబంధం ఉండొచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.ధార్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో ఇప్పటికే 52 టిటానోసారస్ సారోపోడ్స్ డైనోసార్ గూడులను(పక్షుల మాదిరి) వెలికితీశారు. లక్షల సంవత్సరాల క్రితం భూమిపై సంచరించి, ప్రతికూల వాతావరణం కారణంతోనే డైనోసార్లు అంతరించి పోయాయన్నది అందరికీ తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment