ఈ చిత్రంలో కనిపిస్తున్నవి గండరాతి శిలలు.. కానీ సాధారణ రాయితో ఏర్పడ్డవి కాదు. భూపొరల నుంచి ఉప్పొంగిన లావా ఘనీభవించి ఇలా రాతిగా మారాయి. లావాతో ఏర్పడ్డ రాతి పొరలు సహజంగానే కనిపిస్తుంటాయి. కానీ ఉలితో శిల్పి చెక్కినట్టుగా ఇలా ఒకేరకం కడ్డీలుగా ఏర్పడటం మాత్రం కొంత అరుదే. వాటిని కాలమ్నార్ బసాల్ట్‌గా పిలుస్తారు. ఇలాంటి అరుదైన లావా రాతిస్తంభాలు ఆసిఫాబాద్ అడవుల్లో వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల్లో గతంలో విస్తారంగా కనిపించిన ఈ లావా స్తంభాలు తెలంగాణ లో తొలిసారి కనిపించడం విశేషం. ఇలాం టి రాతిస్తంభాలు కొన్ని ప్రాంతాల్లో చాలా పొడవుగా ఉంటాయి. అలాంటి స్తంభాలతో ఏర్పడ్డ గుట్టలు కూడా ఉన్నాయి. ఆసిఫాబాద్ అభయారణ్యంలో వెలుగుచూసిన లా వా ‘రాతికడ్డీలు’ భూ ఉపరితలంలో చిన్న విగానే కనిపిస్తున్నా భూగర్భంలో మరింత పొడవుగా ఉండి ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ ప్రాంతంలో జీఎస్‌ఐ విభాగం పరిశోధన జరిపితే మరిన్ని కొత్త విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది.
6.5 కోట్ల సంవత్సరాల క్రితం..
దక్కన్ పీఠభూమి చాలా వరకు లావా ప్రవహించిన ప్రాంతమే. దాదాపు 6.5 కోట్ల సంవత్సరాల క్రితం భూగర్భంలోని పొరల్లో చోటుచేసుకున్న చర్య ఫలితంగా లోపలి నుంచి లావా ఉప్పొంగి మహారాష్ట్ర పూర్తి భాగం, రాజస్తాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో కొంతభాగం చొప్పున ఆవరించిందని, వికారాబాద్ సమీపంలోని అనంతగిరి గుట్టలు అలా ఉప్పొంగిన లావా ఘనీభవించి ఏర్పడ్డవేనని ఔత్సాహిక పరిశోధకులు చెబుతున్నారు. చేవెళ్ల మీదుగా వికారాబాద్, ఇటు కర్ణాటక, అటు మహారాష్ట్ర వైపు ఇలా లావాతో రాతి పొరలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. దాదాపు 5 లక్షల చదరపు కి.మీ. మేర ఇవి ఏర్పడటం గమనార్హం. ఈ సాధారణ రాతి పొరలే కాకుండా కొన్ని ప్రత్యేక ఒత్తిళ్ల వల్ల అవి నిర్దిష్ట ఆకృతిలో స్తంభాలుగా ఏర్పడ్డాయి. వాటినే కాలమ్నార్ బసాల్ట్‌గా పేర్కొంటారు.
– సాక్షి, హైదరాబాద్
జీఎస్‌ఐ పరిశోధన చేపట్టాలి...
కొందరు ఔత్సాహికులు కొంతకాలం క్రితం ఆసిఫాబాద్ అభయారణ్యంలో పరిశోధించి ఈ రాళ్లను గుర్తించారు. ఆ చిత్రాలను నేను జీఎస్‌ఐ విశ్రాంత డిప్యూటీ డైరక్టర్ చకిలం వేణుగోపాల్‌కు పంపగా అవి కాలమ్నార్ బసాల్ట్‌గా ఆయన నిర్ధారించారు. ఈ అరుదైన రాళ్లకు సంబంధించి ఆ ప్రాంతంలో జీఎస్‌ఐ వెంటనే పరిశోధన చేపట్టాలి.
– శ్రీరామోజు హరగోపాల్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్
తెలంగాణలో తొలిసారే...
మహారాష్ట్రలోని యావత్‌మాల్‌లో ఇటీవల రోడ్డు నిర్మాణం కోసం జరిపిన తవ్వకాల్లో భారీ కాలమ్నార్ బసాల్డ్ పొర వెలుగుచూసింది. ఆసిఫాబాద్ అడవిలో కనిపించిన శిలాస్తంభాల చిత్రాలు చూస్తే అవి కాలమ్నార్ బసాల్ట్‌గానే అనిపిస్తోంది. జీఎస్‌ఐ పరిశోధించి వాటిని అధికారికంగా తేలిస్తే తెలంగాణలో మొదటిసారి అలాంటి శిలారూపాలు రికార్డయినట్టవుతుంది.
– చకిలం వేణుగోపాల్,జీఎస్‌ఐ విశ్రాంత డిప్యూటీ డైరక్టర్
Comments
Please login to add a commentAdd a comment