ఖనిజ సంపద దోపిడీ
- అక్రమంగా లేటరైట్ తవ్వకాలు
- కాఫీ తోటలకు నష్టం
- అడ్డుకున్న గిరిజనులు
- క్వారీ వద్ద ఆందోళన
చింతపల్లిరూరల్ : రాజుపాకల సమీపంలో బినామీ అనుమతులతో చేపట్టిన లేటరైట్ తవ్వకాలను వెంటనే నిలుపుదల చే సి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తు పంచాయతీ ప్రజలు గురువారం క్వారీ వద్ద ఆందోళన నిర్వహించారు. పెదబరడ పంచాయతీ రాజుపాకల జంక్షన్ నుంచి క్వారీ వర కు ర్యాలీ నిర్వహించి క్వారీ ప్రాంతంలో బహిరంగ సమావేశం ఏర్పాటు చేశారు. పంచాయతీ సర్పంచ్ బోయిన సత్యనారాయణ, ఎంపీటీసీ మర్రి సింగారమ్మ, మాజీ ఎంపీపీ ఉల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమంలో పంచాయతీలోని రాజుపాకలు, దిగుపాకలు, సిరిపురం, రాజుబంద, చెరపల్లి, నడిగుంట గ్రామాల గిరిజనులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా గిరిజన ప్రతినిధులు మాట్లాడుతూ గిరిజనుల పేరిట బినామీ కాంట్రాక్టును చేజిక్కిం చుకుని అటవీ చట్టాలను తుంగలోకి తొక్కి రూ.కోట్లు విలువ చేసే ఖనిజ సంపదను దోచుకుపోతున్నా.. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, అధికారు లు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లేటరైట్ తవ్వకాల ఫలితంగా చుట్టు పక్కల ఉన్న 150 ఎకరాల్లో సాగవుతున్న కాఫీ తోటలు పాడైపోయే అవకాశం ఉందన్నారు.
ఏజెన్సీలో చట్టాలను పక్కాగా అమలు చేయాల్సిన అధికారులు ప్రకటనలకే పరిమితమవుతున్నారని వాపోయా రు. ఎన్నిమార్లు ఐటీడీఏ పీవో, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకు వెళ్లినా ప్ర యోజనం లేకుండా పోయిందన్నారు. సబ్ కలెక్టర్ ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వి.సత్యవతి, పీసా కమిటీ ఉపాధ్యక్షులు నూకరాజు, వి.ఆనంద్, జి.అబ్బాయినాయుడు పాల్గొన్నారు.