కేంద్ర వైద్యుల విరమణ 65 ఏళ్లకు
కేంద్ర కేబినెట్ పచ్చజెండా
- ఆరోగ్య నిపుణుల కొరతను అధిగమించేందుకు నిర్ణయం
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య సర్వీసు(సీహెచ్‌ఎస్)లో ఉన్న వైద్యుల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచడానికి కేంద్ర కేబినెట్ అంగీకరించింది. దేశంలో తీవ్రంగా ఉన్న వైద్య నిపుణుల కొరతను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇది జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను మెరుగ్గా అమలుపరచడానికి, రోగుల సంరక్షణ, వైద్య విద్యా కార్యకలాపాలకూ దోహదం చేస్తుందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. బుధవారమిక్కడ జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీహెచ్‌ఎస్‌లో నాలుగు వేల మంది వైద్యులున్నారు. సీహెచ్‌ఎస్‌లోని నాన్-టీచింగ్, ప్రత్యేక ఆరోగ్య నిపుణులు, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ల పదవీ విరమణను 62 ఏళ్ల నుంచి 65 పెంచనున్నట్లు కేంద్రం తెలిపింది.
ఆరు ఒప్పందాలకు ఆమోదం
హిందూమహా సముద్రంలో భారీగా ఉన్న ఖనిజ సంపదను వెలికితీసేందుకు అంతర్జాతీయ సముద్రగర్భ ప్రాధికార సంస్థ (ఐఎస్‌ఏ)తో కుదుర్చుకున్న ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. తైవాన్‌తో విమాన సర్వీసులు, సౌదీ అరేబియాతో కుదుర్చుకున్న కార్మిక సహకార ఒప్పందం తదితర మొత్తం 6 ఒప్పందాలకు పచ్చజెండా ఊపింది.