Union Minister Ravi Shankar
-
ఇంటర్నెట్లో ‘స్థానిక’ ప్రాధాన్యం!
ఐకాన్ వార్షిక సమావేశంలో కేంద్ర మంత్రి రవిశంకర్ - ఇందుకు ఐకాన్ మరింత చొరవ చూపాలి - త్వరలో కొత్తగా 100 కోట్ల నెట్ వినియోగదారులు.. - సైబర్ సెక్యూరిటీపై ప్రభుత్వాలతో ఐకాన్ కలసి పనిచేయాలి - ‘భారత్ నెట్’ చురుగ్గా సాగుతున్నట్లు వెల్లడి సాక్షి, హైదరాబాద్: విప్లవాత్మక మార్పులకు కారణమవుతున్న ఇంటర్నెట్ టెక్నాలజీలో అన్ని వర్గాల వారికీ సమాన ప్రాతినిధ్యం లభించాల్సిన అవసరముందని కేంద్ర న్యాయ, ఐటీ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ (ఐకాన్) 57వ వార్షిక సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఇంటర్నెట్ ఆవిర్భవించి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ఇంగ్లిష్ ప్రధాన భాషగా కొనసాగుతోందని, స్థానిక భాషల్లోనూ నెట్ సేవలు అందుబాటులోకి వచ్చేందుకు ఐకాన్ మరింత చొరవచూపాలని మంత్రి సూచించారు. నెట్ నిర్వహణ విధానాల రూపకల్పనలో ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు, పౌర సమాజం.. అన్ని వర్గాల వారికీ తమ గొంతు వినిపించే అవకాశం కల్పించాలన్నారు. 125 కోట్ల పైచిలుకు జనాభా ఉన్న భారత్.. డిజిటల్ టెక్నాలజీని ప్రజలందరికీ అందుబాటులోకి తేవడంలో వేగంగా ముందడుగు వేస్తోందని చెప్పారు. ప్రధాని మోదీ మొదలుపెట్టిన డిజిటల్, స్కిల్, స్టార్టప్ ఇండియా కార్యక్రమాలు ఇందులో భాగమేనన్నారు. దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయితీలను ఇంటర్నెట్తో అనుసంధానించేందుకు చేపట్టిన భారత్ నెట్ కార్యక్రమం చురుగ్గా సాగుతోందని, ఈ-హాస్పిటల్స్, ఈ-పేమెంట్స్, ఈ-మండీ, ఈ-స్కాలర్‌షిప్‌ల విషయంలోనూ ఎంతో ప్రగతి సాధించామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 350 కోట్ల నెట్ వినియోగదారులకు.. మరో వంద కోట్ల మంది అతిత్వరలో భారత్ నుంచి చేరబోతున్నారని చెప్పారు. ఇంటర్నెట్ అందరికీ చౌకగా అందుబాటులోకి వచ్చేలా ఐకాన్ పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. సైబర్ సెక్యూరిటీ విషయంలో ఐకాన్, ప్రభుత్వాలు కలసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో ఆయా దేశాల ప్రభుత్వాలను భాగస్వాములను చేయాలని సూచించారు. అందరికీ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్: కేటీఆర్ మరో రెండేళ్లలో రాష్ట్రంలోని మొత్తం 90 లక్షల ఇళ్లకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, తద్వారా ఈ ఘనత సాధించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతోందని ఐటీ, పంచాయితీరాజ్ శాఖల మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ఇంటింటికీ కుళాయి నీళ్లు అందించేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పైప్లైన్లతోపాటు ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లను ఏర్పాటు చేస్తూండటం వల్ల ఇది సాధ్యమవుతోందని చెప్పారు. ఆధునిక టెక్నాలజీలు ఎలాంటి సమస్యకైనా చక్కటి పరిష్కారాన్ని చూపగల విప్లవాత్మక సాధనాలుగా మారాయని, మానవజాతి పురోభివృద్ధిలో ఇంటర్నెట్ పాత్ర అంతాఇంతా కాదన్నారు. అయితే సైబర్ అటాక్స్, ఫిషింగ్ స్కామ్, మాల్వేర్, పైరసీ వంటివి నెట్‌తో వచ్చే ఇబ్బందులని, ఈ నేపథ్యంలో దేశంలోనే తొలిసారి తెలంగాణ రాష్ట్రం సైబర్ సెక్యూరిటీ పాలసీని అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సైబర్ సెక్యూరిటీ విషయంలో ఐకాన్ వంటి సంస్థలు తమవంతు చేయూత అందించాల్సిన అవసరముందని అన్నారు. కార్యక్రమంలో ఐకాన్ అధ్యక్షుడు యోరాన్ మార్బి, ఐకాన్ సృష్టికర్తల్లో ఒకరైన స్టీఫన్ క్రాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడు వేల మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ ఐకాన్ సదస్సు నవంబర్ 9 వరకు సాగనుంది. -
చాయ్, రిక్షాకూ యాప్స్!
• స్టార్టప్ ప్రతినిధులతో ముఖాముఖిలో కేంద్ర మంత్రి రవిశంకర్ • రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో కలసి టీ హబ్ సందర్శన సాక్షి, హైదరాబాద్: సామాన్యులకు చేరువయ్యేలా స్టార్టప్ ఉత్పత్తులుండాలని, తద్వారా మన ఐటీ సత్తా ప్రపంచానికి చాటాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. సామాన్యుల కోసం సమకూర్చే సదుపాయాలకే పెద్ద ఎత్తున మార్కెట్ ఉంటుందనే విషయాన్ని గుర్తు చేశారు. ఇకపై చాయ్‌వాలా, రిక్షావాలా సేవలు కూడా యాప్ ద్వారానే అందుబాటులోకి తీసుకొచ్చేలా కృషి చేయాలని సూచించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని టీహబ్ ఏర్పాటై ఏడాదైన సందర్భంగా శనివారం రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌తో కలసి ఆయన సందర్శించారు. స్టార్టప్ ప్రతినిధి రూపొందించిన బ్యాటరీ ద్వారా నడిచే సైకిల్‌పై క్యాంపస్‌లో కొద్దిసేపు కలియదిరిగారు. టీహబ్ విశేషాలను రవిశంకర్‌కు కేటీఆర్ వివరించారు. అనంతరం స్టార్టప్ ప్రతినిధులతో ముఖాముఖి నిర్వహించారు. ఐటీ, మెడికల్ తదితర రంగాలకు సంబంధించి టీహబ్‌లో రూపొందించిన ఉత్పత్తులను స్టార్టప్ ప్రతినిధులు వివరించారు. అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ వినియోగం ముఖ్యమైనదని రవిశంకర్ అన్నారు. సామాన్యులను ఆసరా చేసుకునే స్టార్టప్‌లు ముందుకు వెళ్లాలని, అప్పుడే మార్కెట్ సౌకర్యం సులభతరమవుతుందన్నారు. తెలంగాణకు చెందిన బీడీ కార్మికులు కూడా సాంకేతిక తను వినియోగిస్తున్నారని పేర్కొంటూ తన అనుభవాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో స్టార్టప్ ఆరంభించిన విషయాన్ని గుర్తు చేశారు. స్టార్టప్ ఇండియాకు రూ.10 వేల కోట్ల నిధులు ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం టీ హబ్ ద్వారా యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందిస్తోందని కొనియాడారు. టీహబ్ ఉత్పత్తులకు కేంద్రం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ ప్రపంచానికి పెద్ద సవాల్‌గా మారిందని, స్టార్టప్ ప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి ఈ విషయంలో భారత్‌ను అగ్రభాగాన చేర్చాలని కోరారు. బ్యాటరీ సైకిల్‌పై కేంద్ర మంత్రి ఆసక్తి టీ హబ్‌లోని స్టార్టప్‌లో ఆవిష్కరిస్తున్న ఉత్పత్తులను అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రిని గాయమ్ ఆటో వర్క్స్‌కు చెందిన బ్యాటరీతో నడిచే సైకిల్ ఆకర్షించింది. బ్యాటరీతో నడిచే సైకిల్‌పై గంటకు 25 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని రాహుల్ గాయమ్ ఈ సందర్భంగా తెలిపారు. సైకిల్ తొక్కాలనుకుంటే బ్యాటరీ ఆఫ్ చేయవచ్చన్నారు. రెండు నెలలుగా ఇలాంటి 50 సైకిళ్లను ఆమెరికాకు ఎగుమతి చేశామన్నారు. త్వరలో హైదరాబాద్‌లోనూ అమ్మకాలు ప్రారంభిస్తామన్నారు. రూ.25 వేల నుంచి రూ.45 వేలకు లభించే ఈ సైకిల్‌ను ‘లిమిట్లెస్ బైక్’ అని పిలుస్తామన్నారు. టీహబ్ తెలంగాణ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయమని, స్టార్టప్‌లకు ప్రపంచంలోనే హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారిందని కార్యక్రమం అనంతరం రవిశంకర్ పేర్కొన్నారు. కేంద్ర ఐటీ శాఖ అదనపు కార్యదర్శి అజయ్‌కుమార్ కూడా.. టీహబ్ సందర్శన గొప్ప అనుభూతినిచ్చిందని కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. త్వరలో టీహబ్-2: కేటీఆర్ దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీహబ్-2ను త్వరలో తీసుకొస్తామని కేటీఆర్ వెల్లడించారు. ప్రస్తుత టీహబ్‌కు 4 రెట్లు పెద్దదిగా ఈ హబ్ ఉంటుందన్నారు. ఈ ఇంక్యుబేటర్ సెంటర్‌కు సీఎం కేసీఆర్ త్వరలోనే శంకుస్థాపన చేస్తారని తెలిపారు. స్టార్టప్ రాజధానిగా హైదరాబాద్ అవతరిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర ఐటీ శాఖ అదనపు కార్యదర్శి అజయ్‌కుమార్, రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ పీజే నారాయణన్ తదితరులు పాల్గొన్నారు. 2018 కల్లా గ్రామ పంచాయతీల అనుసంధానం మరో రెండేళ్లలో దేశంలోని గ్రామ పంచాయతీలన్నింటినీ ఇంటర్నెట్తో అనుసంధానించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రవిశంకర్‌ప్రసాద్ తెలిపారు. ఐదేళ్ల క్రితం యూపీఏ హయాంలో ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటికీ.. తాము అధికారం చేపట్టిన తర్వాత శరవేగంతో ముందుకు సాగుతోందని శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు. భారత్ నెట్లో భాగంగా 2014 నాటికి కేవలం 358 కిలోమీటర్ల మేర ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు వేస్తే గత రెండేళ్లలో తాము దీన్ని 1.39 లక్షల కిలోమీటర్లకు పెంచామని తెలిపారు. అలాగే డిజిటల్ సాక్షరత కార్యక్రమం ‘దిశ’ కింద ఇప్పటికే కోటి మందికి శిక్షణ ఇచ్చామని, వచ్చే మూడేళ్లలో మరో ఐదు కోట్ల మందిని సిద్ధం చేయాలన్నది తమ లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వివిధ ప్రభుత్వ సేవలను అందించే కామన్ సర్వీస్ సెంటర్ల సంఖ్యను 80 వేల నుంచి 2.46 లక్షలకు పెంచామన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 105 కోట్ల మందికి ఆధార్ నంబర్ ఉండగా.. వీటిని మొబైల్ ఫోన్ నంబర్లకు, జన్‌ధన్ యోజన కింద తెరచిన బ్యాంక్ అకౌంట్లకు అనుసంధానించామని, దీని ద్వారా సబ్సిడీ మొత్తం నేరుగా పేదల బ్యాంక్ అకౌంట్లకే చేరేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. డిజిటల్ టెక్నాలజీ ద్వారా దాదాపు రూ.36 వేల కోట్ల దుర్వినియోగాన్ని నివారించగలిగామని వివరించారు. -
కేంద్ర వైద్యుల విరమణ 65 ఏళ్లకు
కేంద్ర కేబినెట్ పచ్చజెండా - ఆరోగ్య నిపుణుల కొరతను అధిగమించేందుకు నిర్ణయం న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య సర్వీసు(సీహెచ్ఎస్)లో ఉన్న వైద్యుల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచడానికి కేంద్ర కేబినెట్ అంగీకరించింది. దేశంలో తీవ్రంగా ఉన్న వైద్య నిపుణుల కొరతను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇది జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను మెరుగ్గా అమలుపరచడానికి, రోగుల సంరక్షణ, వైద్య విద్యా కార్యకలాపాలకూ దోహదం చేస్తుందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. బుధవారమిక్కడ జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీహెచ్‌ఎస్‌లో నాలుగు వేల మంది వైద్యులున్నారు. సీహెచ్ఎస్లోని నాన్-టీచింగ్, ప్రత్యేక ఆరోగ్య నిపుణులు, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ల పదవీ విరమణను 62 ఏళ్ల నుంచి 65 పెంచనున్నట్లు కేంద్రం తెలిపింది. ఆరు ఒప్పందాలకు ఆమోదం హిందూమహా సముద్రంలో భారీగా ఉన్న ఖనిజ సంపదను వెలికితీసేందుకు అంతర్జాతీయ సముద్రగర్భ ప్రాధికార సంస్థ (ఐఎస్ఏ)తో కుదుర్చుకున్న ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. తైవాన్‌తో విమాన సర్వీసులు, సౌదీ అరేబియాతో కుదుర్చుకున్న కార్మిక సహకార ఒప్పందం తదితర మొత్తం 6 ఒప్పందాలకు పచ్చజెండా ఊపింది.