టీహబ్‌లో బ్యాటరీ సైకిల్ నడుపుతున్న రవిశంకర్. చిత్రంలో కేటీఆర్
• స్టార్టప్ ప్రతినిధులతో ముఖాముఖిలో కేంద్ర మంత్రి రవిశంకర్
• రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో కలసి టీ హబ్ సందర్శన
సాక్షి, హైదరాబాద్: సామాన్యులకు చేరువయ్యేలా స్టార్టప్ ఉత్పత్తులుండాలని, తద్వారా మన ఐటీ సత్తా ప్రపంచానికి చాటాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. సామాన్యుల కోసం సమకూర్చే సదుపాయాలకే పెద్ద ఎత్తున మార్కెట్ ఉంటుందనే విషయాన్ని గుర్తు చేశారు. ఇకపై చాయ్‌వాలా, రిక్షావాలా సేవలు కూడా యాప్ ద్వారానే అందుబాటులోకి తీసుకొచ్చేలా కృషి చేయాలని సూచించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని టీహబ్ ఏర్పాటై ఏడాదైన సందర్భంగా శనివారం రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌తో కలసి ఆయన సందర్శించారు. స్టార్టప్ ప్రతినిధి రూపొందించిన బ్యాటరీ ద్వారా నడిచే సైకిల్‌పై క్యాంపస్‌లో కొద్దిసేపు కలియదిరిగారు.
టీహబ్ విశేషాలను రవిశంకర్‌కు కేటీఆర్ వివరించారు. అనంతరం స్టార్టప్ ప్రతినిధులతో ముఖాముఖి నిర్వహించారు. ఐటీ, మెడికల్ తదితర రంగాలకు సంబంధించి టీహబ్‌లో రూపొందించిన ఉత్పత్తులను స్టార్టప్ ప్రతినిధులు వివరించారు. అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ వినియోగం ముఖ్యమైనదని రవిశంకర్ అన్నారు. సామాన్యులను ఆసరా చేసుకునే స్టార్టప్‌లు ముందుకు వెళ్లాలని, అప్పుడే మార్కెట్ సౌకర్యం సులభతరమవుతుందన్నారు. తెలంగాణకు చెందిన బీడీ కార్మికులు కూడా సాంకేతిక తను వినియోగిస్తున్నారని పేర్కొంటూ తన అనుభవాలను వివరించారు.
కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో స్టార్టప్ ఆరంభించిన విషయాన్ని గుర్తు చేశారు. స్టార్టప్ ఇండియాకు రూ.10 వేల కోట్ల నిధులు ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం టీ హబ్ ద్వారా యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందిస్తోందని కొనియాడారు. టీహబ్ ఉత్పత్తులకు కేంద్రం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ ప్రపంచానికి పెద్ద సవాల్‌గా మారిందని, స్టార్టప్ ప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి ఈ విషయంలో భారత్‌ను అగ్రభాగాన చేర్చాలని కోరారు.
బ్యాటరీ సైకిల్‌పై కేంద్ర మంత్రి ఆసక్తి
టీ హబ్‌లోని స్టార్టప్‌లో ఆవిష్కరిస్తున్న ఉత్పత్తులను అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రిని గాయమ్ ఆటో వర్క్స్‌కు చెందిన బ్యాటరీతో నడిచే సైకిల్ ఆకర్షించింది. బ్యాటరీతో నడిచే సైకిల్‌పై గంటకు 25 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని రాహుల్ గాయమ్ ఈ సందర్భంగా తెలిపారు. సైకిల్ తొక్కాలనుకుంటే బ్యాటరీ ఆఫ్ చేయవచ్చన్నారు. రెండు నెలలుగా ఇలాంటి 50 సైకిళ్లను ఆమెరికాకు ఎగుమతి చేశామన్నారు. త్వరలో హైదరాబాద్‌లోనూ అమ్మకాలు ప్రారంభిస్తామన్నారు. రూ.25 వేల నుంచి రూ.45 వేలకు లభించే ఈ సైకిల్‌ను ‘లిమిట్లెస్ బైక్’ అని పిలుస్తామన్నారు. టీహబ్ తెలంగాణ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయమని, స్టార్టప్‌లకు ప్రపంచంలోనే హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారిందని కార్యక్రమం అనంతరం రవిశంకర్ పేర్కొన్నారు. కేంద్ర ఐటీ శాఖ అదనపు కార్యదర్శి అజయ్‌కుమార్ కూడా.. టీహబ్ సందర్శన గొప్ప అనుభూతినిచ్చిందని కేటీఆర్‌కు ట్వీట్ చేశారు.
త్వరలో టీహబ్-2: కేటీఆర్
దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీహబ్-2ను త్వరలో తీసుకొస్తామని కేటీఆర్ వెల్లడించారు. ప్రస్తుత టీహబ్‌కు 4 రెట్లు పెద్దదిగా ఈ హబ్ ఉంటుందన్నారు. ఈ ఇంక్యుబేటర్ సెంటర్‌కు సీఎం కేసీఆర్ త్వరలోనే శంకుస్థాపన చేస్తారని తెలిపారు. స్టార్టప్ రాజధానిగా హైదరాబాద్ అవతరిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర ఐటీ శాఖ అదనపు కార్యదర్శి అజయ్‌కుమార్, రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ పీజే నారాయణన్ తదితరులు పాల్గొన్నారు.
2018 కల్లా గ్రామ పంచాయతీల అనుసంధానం
మరో రెండేళ్లలో దేశంలోని గ్రామ పంచాయతీలన్నింటినీ ఇంటర్నెట్తో అనుసంధానించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రవిశంకర్‌ప్రసాద్ తెలిపారు. ఐదేళ్ల క్రితం యూపీఏ హయాంలో ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటికీ.. తాము అధికారం చేపట్టిన తర్వాత శరవేగంతో ముందుకు సాగుతోందని శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు. భారత్ నెట్లో భాగంగా 2014 నాటికి కేవలం 358 కిలోమీటర్ల మేర ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు వేస్తే గత రెండేళ్లలో తాము దీన్ని 1.39 లక్షల కిలోమీటర్లకు పెంచామని తెలిపారు. అలాగే డిజిటల్ సాక్షరత కార్యక్రమం ‘దిశ’ కింద ఇప్పటికే కోటి మందికి శిక్షణ ఇచ్చామని, వచ్చే మూడేళ్లలో మరో ఐదు కోట్ల మందిని సిద్ధం చేయాలన్నది తమ లక్ష్యమన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో వివిధ ప్రభుత్వ సేవలను అందించే కామన్ సర్వీస్ సెంటర్ల సంఖ్యను 80 వేల నుంచి 2.46 లక్షలకు పెంచామన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 105 కోట్ల మందికి ఆధార్ నంబర్ ఉండగా.. వీటిని మొబైల్ ఫోన్ నంబర్లకు, జన్‌ధన్ యోజన కింద తెరచిన బ్యాంక్ అకౌంట్లకు అనుసంధానించామని, దీని ద్వారా సబ్సిడీ మొత్తం నేరుగా పేదల బ్యాంక్ అకౌంట్లకే చేరేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. డిజిటల్ టెక్నాలజీ ద్వారా దాదాపు రూ.36 వేల కోట్ల దుర్వినియోగాన్ని నివారించగలిగామని వివరించారు.