ఇంటర్నెట్‌లో ‘స్థానిక’ ప్రాధాన్యం!
ఐకాన్ వార్షిక సమావేశంలో కేంద్ర మంత్రి రవిశంకర్
- ఇందుకు ఐకాన్ మరింత చొరవ చూపాలి
- త్వరలో కొత్తగా 100 కోట్ల నెట్ వినియోగదారులు..
- సైబర్ సెక్యూరిటీపై ప్రభుత్వాలతో ఐకాన్ కలసి పనిచేయాలి
- ‘భారత్ నెట్’ చురుగ్గా సాగుతున్నట్లు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: విప్లవాత్మక మార్పులకు కారణమవుతున్న ఇంటర్నెట్ టెక్నాలజీలో అన్ని వర్గాల వారికీ సమాన ప్రాతినిధ్యం లభించాల్సిన అవసరముందని కేంద్ర న్యాయ, ఐటీ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ (ఐకాన్) 57వ వార్షిక సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఇంటర్నెట్ ఆవిర్భవించి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ఇంగ్లిష్ ప్రధాన భాషగా కొనసాగుతోందని, స్థానిక భాషల్లోనూ నెట్ సేవలు అందుబాటులోకి వచ్చేందుకు ఐకాన్ మరింత చొరవచూపాలని మంత్రి సూచించారు. నెట్ నిర్వహణ విధానాల రూపకల్పనలో ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు, పౌర సమాజం.. అన్ని వర్గాల వారికీ తమ గొంతు వినిపించే అవకాశం కల్పించాలన్నారు.
125 కోట్ల పైచిలుకు జనాభా ఉన్న భారత్.. డిజిటల్ టెక్నాలజీని ప్రజలందరికీ అందుబాటులోకి తేవడంలో వేగంగా ముందడుగు వేస్తోందని చెప్పారు. ప్రధాని మోదీ మొదలుపెట్టిన డిజిటల్, స్కిల్, స్టార్టప్ ఇండియా కార్యక్రమాలు ఇందులో భాగమేనన్నారు. దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయితీలను ఇంటర్నెట్‌తో అనుసంధానించేందుకు చేపట్టిన భారత్ నెట్ కార్యక్రమం చురుగ్గా సాగుతోందని, ఈ-హాస్పిటల్స్, ఈ-పేమెంట్స్, ఈ-మండీ, ఈ-స్కాలర్‌షిప్‌ల విషయంలోనూ ఎంతో ప్రగతి సాధించామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 350 కోట్ల నెట్ వినియోగదారులకు.. మరో వంద కోట్ల మంది అతిత్వరలో భారత్ నుంచి చేరబోతున్నారని చెప్పారు. ఇంటర్నెట్ అందరికీ చౌకగా అందుబాటులోకి వచ్చేలా ఐకాన్ పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. సైబర్ సెక్యూరిటీ విషయంలో ఐకాన్, ప్రభుత్వాలు కలసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో ఆయా దేశాల ప్రభుత్వాలను భాగస్వాములను చేయాలని సూచించారు.
అందరికీ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్: కేటీఆర్
మరో రెండేళ్లలో రాష్ట్రంలోని మొత్తం 90 లక్షల ఇళ్లకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, తద్వారా ఈ ఘనత సాధించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతోందని ఐటీ, పంచాయితీరాజ్ శాఖల మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ఇంటింటికీ కుళాయి నీళ్లు అందించేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పైప్‌లైన్లతోపాటు ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లను ఏర్పాటు చేస్తూండటం వల్ల ఇది సాధ్యమవుతోందని చెప్పారు. ఆధునిక టెక్నాలజీలు ఎలాంటి సమస్యకైనా చక్కటి పరిష్కారాన్ని చూపగల విప్లవాత్మక సాధనాలుగా మారాయని, మానవజాతి పురోభివృద్ధిలో ఇంటర్నెట్ పాత్ర అంతాఇంతా కాదన్నారు.
అయితే సైబర్ అటాక్స్, ఫిషింగ్ స్కామ్, మాల్‌వేర్, పైరసీ వంటివి నెట్‌తో వచ్చే ఇబ్బందులని, ఈ నేపథ్యంలో దేశంలోనే తొలిసారి తెలంగాణ రాష్ట్రం సైబర్ సెక్యూరిటీ పాలసీని అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సైబర్ సెక్యూరిటీ విషయంలో ఐకాన్ వంటి సంస్థలు తమవంతు చేయూత అందించాల్సిన అవసరముందని అన్నారు. కార్యక్రమంలో ఐకాన్ అధ్యక్షుడు యోరాన్ మార్బి, ఐకాన్ సృష్టికర్తల్లో ఒకరైన స్టీఫన్ క్రాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడు వేల మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ ఐకాన్ సదస్సు నవంబర్ 9 వరకు సాగనుంది.