Broadband connection
-
మణిపూర్‌లో మరోసారి ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు
ఇంఫాల్: మణిపూర్‌లో రెండు నెలల క్రితం పేట్రేగిన హింసాకాండ రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ప్రాణనష్టం తోపాటు ఆస్తినష్టం కూడా భారీగా జరగడంతో మణిపూర్ ఎప్పటికి కోలుకుంటుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఇక అన్నాడు ఇంటర్నెట్ సేవలను నిషేధించి ప్రభుత్వం చాలావరకు అల్లర్లను కట్టడి చేసింది. ఇటీవల ఆంక్షలు ఎత్తివేసిన నిముషాల్లోనే ఫార్వార్డ్ మెసేజులతో ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టిన కారణంగా మరోసారి అంతర్జాల వినియోగంపై ఆంక్షలు విధించింది మణిపూర్ ప్రభుత్వం. అనవసర ఫార్వార్డ్ సందేశాలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్న కారణంతో మొదట మొబైల్ ఇంటర్నెట్ వినియోగాన్ని నిషేధించింది. కేవలం బ్రాడ్ బ్యాండ్ సేవలు, స్టాటిక్ ఐపీ ద్వారా ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్ అందించే సేవలను మాత్రమే వినియోగించుకోవాలని సూచించింది. అల్లర్లు జరుగుతున్న సమయంలో ఆనాడు ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేయడం వల్లనే చాలా వరకు హింసాత్మక సంఘటనలు తగ్గుముఖం పట్టాయి. లేదంటే చరవాణుల్లో సందేశాల ద్వారా ఎదుటివారి భావోద్వేగాలను సులువుగా రెచ్చగొట్టేవారు. ఇటీవల ఆంక్షలను ఎత్తివేయడంతో అల్లర్ల నాటి వీడియోలను ఫార్వార్డ్ చేస్తూ మరోసారి ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలకు అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హాట్ స్పాట్, వైఫై సేవలను కూడా నిషేధించింది. ఒకవేళ ఎవరైనా వీటిని వినియోగించినట్లు తెలిస్తే సదరు సర్వీస్ ప్రొవైడర్ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ప్రభుత్వం. ఇది కూడా చదవండి: రెండు రోజుల్లో మణిపూర్‌లోకి 718 మంది మయన్మార్ దేశస్తులు.. -
‘యాక్ట్’తో ఎక్కడున్నా ఇంటర్నెట్
⇔ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఉంటే చాలు ⇔ వైఫై జోన్లతో నగరమంతా కనెక్టివిటీ ⇔ యాక్ట్ ఫైబర్‌నెట్ సీఈవో బాల మల్లాది హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంట్లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్.. మరి బయటకు వెళితే మొబైల్లో డేటా ప్యాక్. ఇప్పుడు చాలా మంది కస్టమర్లు అనుసరిస్తున్న విధానమిది. ఇన్నేసి ఖర్చులు లేకుండా ఇంట్లో ఉన్న బ్రాడ్‌బ్యాండ్ కనెక్షనే ఎక్కడికి వెళ్లినా పనిచేసేలా ఉంటే.. సరిగ్గా ఈ విధానాన్నే యాక్ట్ ఫైబర్‌నెట్ (అట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్) ఆచరణలో పెడుతోంది. కంపెనీ సేవలు అందిస్తున్న నగరాల్లో బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు ఎక్కడున్నా అంతరాయం లేని ఇంటర్నెట్ సేవలు 24 గంటలు అందించేందుకు వైఫై హాట్‌స్పాట్స్‌ను ఏర్పాటు చేస్తోంది. వినియోగదార్లు ఇందుకోసం అదనంగా చెల్లించాల్సిన అవసరం లేకపోవడం విశేషం. ఇక స్పీడ్ అంటారా.. ఇంట్లో వాడే ప్యాక్‌ను బట్టి వైఫై జోన్లో కూడా అదే వేగంతో నెట్ ఎంజాయ్ చేయొచ్చు. తొలుత హైదరాబాద్..: వైఫై జోన్లను కంపెనీ తొలుత హైదరాబాద్‌లో ప్రవేశపెడుతోంది. ఇప్పటికే 200 çహŸట్స్పాట్స్ ఏర్పాటయ్యాయి. మరో 800 ఏప్రిల్‌లోనే రానున్నాయి. ఇవి కనెక్ట్ అయితే హైదరాబాద్‌లో 70 శాతం కవరేజ్ ఉంటుంది. భాగ్యనగరి మొత్తం కవరేజ్‌కు రెండేళ్లు పడుతుందని యాక్ట్ ఫైబర్‌నెట్ సీఈవో బాల మల్లాది సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. ప్రతి రోజు 1.40 లక్షల మంది లాగిన్ అవుతున్నారని చెప్పారు. వీరిలో 70 శాతం మంది యాక్ట్ కస్టమర్లు ఉంటారని తెలిపారు. హాట్‌స్పాట్ జోన్లో ఇతరులు 30–45 నిముషాలు ఉచితంగా ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చు. వైఫై జోన్లలో యాక్ట్ కస్టమర్లు ఉపయోగించిన డేటాను బ్రాడ్‌బ్యాండ్ ఖాతా కిందే పరిగణిస్తారు. అంటే వైఫై ద్వారా ఒక నెలలో 10 జీబీ డేటా వాడితే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కింద ఇచ్చే ఉచిత డేటా నుంచి తగ్గిస్తారు. గెస్ట్ యూజర్లకు 10 ఎంబీపీఎస్ స్పీడ్, యాక్ట్ కస్టమర్లకు వారి బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్‌నుబట్టి స్పీడ్ ఉంటుంది. బెంగళూరులో ఇటువంటి వైఫై ప్రాజెక్టుకు కంపెనీ శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత యాక్ట్ సేవలు అందిస్తున్న ఇతర నగరాలకు విస్తరించనున్నారు. కొత్త నగరాలకు బ్రాడ్‌బ్యాండ్.. ప్రస్తుతం యాక్ట్ ఫైబర్‌నెట్ 11 నగరాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తోంది. దేశంలో మూడో అతిపెద్ద ఇంటర్నెట్ సేవల కంపెనీ అయిన ఈ సంస్థకు మొత్తం 12 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. తెలంగాణలో రెండేళ్లలో మరో 6 నగరాల్లో అడుగు పెట్టాలని లక్ష్యంగా చేసుకుంది. 5 లక్షల జనాభా ఉన్న నగరాలకు విస్తరిస్తామని బాల మల్లాది చెప్పారు. దేశవ్యాప్తంగా 2020 నాటికి మొత్తం 25 నగరాల్లో యాక్ట్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. వైఫై హాట్‌స్పాట్స్‌తో కస్టమర్లకు 24 గంటలు సేవలు ఉంటాయని వివరించారు. ఈ రంగంలోనూ కన్సాలిడేషన్.. 4జీ రాకతో చాలామందికి ఇంటర్నెట్ అంటే ఏంటో అవగాహన వచ్చిందని బాల మల్లాది చెప్పారు. ‘బ్రాడ్‌బ్యాండ్ పరిశ్రమకు ఇది మంచి అవకాశం. భవిష్యత్ ఇంకా బాగుంటుంది. కనెక్షన్లు అధికమవుతాయి. ఇక టెలికం కంపెనీల మాదిరిగా వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్‌లోనూ కన్సాలిడేషన్ ఖాయం. పెద్ద సంస్థలే మిగులుతాయి. అవకాశం వస్తే ఈ రంగంలోని ఇతర కంపెనీల కొనుగోలుకు మేం ఎప్పుడూ సిద్ధమే. విస్తరణకు రెండేళ్లలో రూ.1,200 కోట్లు ఖర్చు పెడుతున్నాం. పరిశ్రమ సింగిల్ డిజిట్లో వృద్ధి చెందితే, యాక్ట్ 40 శాతం వృద్ధి నమోదు చేస్తోంది’ అని తెలిపారు. హైదరాబాద్‌లో కొత్తగా 600 మందిని నియమిస్తామని వివరించారు. -
ఇంటర్నెట్లో ‘స్థానిక’ ప్రాధాన్యం!
ఐకాన్ వార్షిక సమావేశంలో కేంద్ర మంత్రి రవిశంకర్ - ఇందుకు ఐకాన్ మరింత చొరవ చూపాలి - త్వరలో కొత్తగా 100 కోట్ల నెట్ వినియోగదారులు.. - సైబర్ సెక్యూరిటీపై ప్రభుత్వాలతో ఐకాన్ కలసి పనిచేయాలి - ‘భారత్ నెట్’ చురుగ్గా సాగుతున్నట్లు వెల్లడి సాక్షి, హైదరాబాద్: విప్లవాత్మక మార్పులకు కారణమవుతున్న ఇంటర్నెట్ టెక్నాలజీలో అన్ని వర్గాల వారికీ సమాన ప్రాతినిధ్యం లభించాల్సిన అవసరముందని కేంద్ర న్యాయ, ఐటీ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ (ఐకాన్) 57వ వార్షిక సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఇంటర్నెట్ ఆవిర్భవించి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ఇంగ్లిష్ ప్రధాన భాషగా కొనసాగుతోందని, స్థానిక భాషల్లోనూ నెట్ సేవలు అందుబాటులోకి వచ్చేందుకు ఐకాన్ మరింత చొరవచూపాలని మంత్రి సూచించారు. నెట్ నిర్వహణ విధానాల రూపకల్పనలో ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు, పౌర సమాజం.. అన్ని వర్గాల వారికీ తమ గొంతు వినిపించే అవకాశం కల్పించాలన్నారు. 125 కోట్ల పైచిలుకు జనాభా ఉన్న భారత్.. డిజిటల్ టెక్నాలజీని ప్రజలందరికీ అందుబాటులోకి తేవడంలో వేగంగా ముందడుగు వేస్తోందని చెప్పారు. ప్రధాని మోదీ మొదలుపెట్టిన డిజిటల్, స్కిల్, స్టార్టప్ ఇండియా కార్యక్రమాలు ఇందులో భాగమేనన్నారు. దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయితీలను ఇంటర్నెట్తో అనుసంధానించేందుకు చేపట్టిన భారత్ నెట్ కార్యక్రమం చురుగ్గా సాగుతోందని, ఈ-హాస్పిటల్స్, ఈ-పేమెంట్స్, ఈ-మండీ, ఈ-స్కాలర్‌షిప్‌ల విషయంలోనూ ఎంతో ప్రగతి సాధించామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 350 కోట్ల నెట్ వినియోగదారులకు.. మరో వంద కోట్ల మంది అతిత్వరలో భారత్ నుంచి చేరబోతున్నారని చెప్పారు. ఇంటర్నెట్ అందరికీ చౌకగా అందుబాటులోకి వచ్చేలా ఐకాన్ పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. సైబర్ సెక్యూరిటీ విషయంలో ఐకాన్, ప్రభుత్వాలు కలసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో ఆయా దేశాల ప్రభుత్వాలను భాగస్వాములను చేయాలని సూచించారు. అందరికీ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్: కేటీఆర్ మరో రెండేళ్లలో రాష్ట్రంలోని మొత్తం 90 లక్షల ఇళ్లకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, తద్వారా ఈ ఘనత సాధించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతోందని ఐటీ, పంచాయితీరాజ్ శాఖల మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ఇంటింటికీ కుళాయి నీళ్లు అందించేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పైప్లైన్లతోపాటు ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లను ఏర్పాటు చేస్తూండటం వల్ల ఇది సాధ్యమవుతోందని చెప్పారు. ఆధునిక టెక్నాలజీలు ఎలాంటి సమస్యకైనా చక్కటి పరిష్కారాన్ని చూపగల విప్లవాత్మక సాధనాలుగా మారాయని, మానవజాతి పురోభివృద్ధిలో ఇంటర్నెట్ పాత్ర అంతాఇంతా కాదన్నారు. అయితే సైబర్ అటాక్స్, ఫిషింగ్ స్కామ్, మాల్వేర్, పైరసీ వంటివి నెట్‌తో వచ్చే ఇబ్బందులని, ఈ నేపథ్యంలో దేశంలోనే తొలిసారి తెలంగాణ రాష్ట్రం సైబర్ సెక్యూరిటీ పాలసీని అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సైబర్ సెక్యూరిటీ విషయంలో ఐకాన్ వంటి సంస్థలు తమవంతు చేయూత అందించాల్సిన అవసరముందని అన్నారు. కార్యక్రమంలో ఐకాన్ అధ్యక్షుడు యోరాన్ మార్బి, ఐకాన్ సృష్టికర్తల్లో ఒకరైన స్టీఫన్ క్రాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడు వేల మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ ఐకాన్ సదస్సు నవంబర్ 9 వరకు సాగనుంది.