‘యాక్ట్’తో ఎక్కడున్నా ఇంటర్నెట్
⇔ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఉంటే చాలు
⇔ వైఫై జోన్లతో నగరమంతా కనెక్టివిటీ
⇔ యాక్ట్ ఫైబర్‌నెట్ సీఈవో బాల మల్లాది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంట్లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్.. మరి బయటకు వెళితే మొబైల్‌లో డేటా ప్యాక్. ఇప్పుడు చాలా మంది కస్టమర్లు అనుసరిస్తున్న విధానమిది. ఇన్నేసి ఖర్చులు లేకుండా ఇంట్లో ఉన్న బ్రాడ్‌బ్యాండ్ కనెక్షనే ఎక్కడికి వెళ్లినా పనిచేసేలా ఉంటే.. సరిగ్గా ఈ విధానాన్నే యాక్ట్ ఫైబర్‌నెట్ (అట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్) ఆచరణలో పెడుతోంది. కంపెనీ సేవలు అందిస్తున్న నగరాల్లో బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు ఎక్కడున్నా అంతరాయం లేని ఇంటర్నెట్ సేవలు 24 గంటలు అందించేందుకు వైఫై హాట్‌స్పాట్స్‌ను ఏర్పాటు చేస్తోంది. వినియోగదార్లు ఇందుకోసం అదనంగా చెల్లించాల్సిన అవసరం లేకపోవడం విశేషం. ఇక స్పీడ్ అంటారా.. ఇంట్లో వాడే ప్యాక్‌ను బట్టి వైఫై జోన్లో కూడా అదే వేగంతో నెట్ ఎంజాయ్ చేయొచ్చు.
తొలుత హైదరాబాద్..: వైఫై జోన్లను కంపెనీ తొలుత హైదరాబాద్‌లో ప్రవేశపెడుతోంది. ఇప్పటికే 200 çహŸట్‌స్పాట్స్ ఏర్పాటయ్యాయి. మరో 800 ఏప్రిల్‌లోనే రానున్నాయి. ఇవి కనెక్ట్ అయితే హైదరాబాద్‌లో 70 శాతం కవరేజ్ ఉంటుంది. భాగ్యనగరి మొత్తం కవరేజ్‌కు రెండేళ్లు పడుతుందని యాక్ట్ ఫైబర్‌నెట్ సీఈవో బాల మల్లాది సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. ప్రతి రోజు 1.40 లక్షల మంది లాగిన్ అవుతున్నారని చెప్పారు. వీరిలో 70 శాతం మంది యాక్ట్ కస్టమర్లు ఉంటారని తెలిపారు.
హాట్‌స్పాట్ జోన్‌లో ఇతరులు 30–45 నిముషాలు ఉచితంగా ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు. వైఫై జోన్లలో యాక్ట్ కస్టమర్లు ఉపయోగించిన డేటాను బ్రాడ్‌బ్యాండ్ ఖాతా కిందే పరిగణిస్తారు. అంటే వైఫై ద్వారా ఒక నెలలో 10 జీబీ డేటా వాడితే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కింద ఇచ్చే ఉచిత డేటా నుంచి తగ్గిస్తారు. గెస్ట్ యూజర్లకు 10 ఎంబీపీఎస్ స్పీడ్, యాక్ట్ కస్టమర్లకు వారి బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్‌నుబట్టి స్పీడ్ ఉంటుంది. బెంగళూరులో ఇటువంటి వైఫై ప్రాజెక్టుకు కంపెనీ శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత యాక్ట్ సేవలు అందిస్తున్న ఇతర నగరాలకు విస్తరించనున్నారు.
కొత్త నగరాలకు బ్రాడ్‌బ్యాండ్..
ప్రస్తుతం యాక్ట్ ఫైబర్‌నెట్ 11 నగరాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తోంది. దేశంలో మూడో అతిపెద్ద ఇంటర్నెట్ సేవల కంపెనీ అయిన ఈ సంస్థకు మొత్తం 12 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. తెలంగాణలో రెండేళ్లలో మరో 6 నగరాల్లో అడుగు పెట్టాలని లక్ష్యంగా చేసుకుంది. 5 లక్షల జనాభా ఉన్న నగరాలకు విస్తరిస్తామని బాల మల్లాది చెప్పారు. దేశవ్యాప్తంగా 2020 నాటికి మొత్తం 25 నగరాల్లో యాక్ట్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. వైఫై హాట్‌స్పాట్స్‌తో కస్టమర్లకు 24 గంటలు సేవలు ఉంటాయని వివరించారు.
ఈ రంగంలోనూ కన్సాలిడేషన్..
4జీ రాకతో చాలామందికి ఇంటర్నెట్ అంటే ఏంటో అవగాహన వచ్చిందని బాల మల్లాది చెప్పారు. ‘బ్రాడ్‌బ్యాండ్ పరిశ్రమకు ఇది మంచి అవకాశం. భవిష్యత్ ఇంకా బాగుంటుంది. కనెక్షన్లు అధికమవుతాయి. ఇక టెలికం కంపెనీల మాదిరిగా వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్‌లోనూ కన్సాలిడేషన్ ఖాయం. పెద్ద సంస్థలే మిగులుతాయి. అవకాశం వస్తే ఈ రంగంలోని ఇతర కంపెనీల కొనుగోలుకు మేం ఎప్పుడూ సిద్ధమే. విస్తరణకు రెండేళ్లలో రూ.1,200 కోట్లు ఖర్చు పెడుతున్నాం. పరిశ్రమ సింగిల్ డిజిట్‌లో వృద్ధి చెందితే, యాక్ట్ 40 శాతం వృద్ధి నమోదు చేస్తోంది’ అని తెలిపారు. హైదరాబాద్‌లో కొత్తగా 600 మందిని నియమిస్తామని వివరించారు.