500 వైఫై హాట్‌స్పాట్లు: రైల్వే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో 500 ఉచిత వైఫై హాట్‌స్పాట్‌లను నెలకొల్పనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. వీటి సాయంతో ఈ–కామర్స్, ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఈ–టికెట్ బుకింగ్, మొబైల్, డీటీహెచ్ రీచార్జ్ వంటి సేవలను పొందవచ్చని రైల్వే వర్గాలు స్పష్టం చేశాయి. ‘రైల్‌వైర్ సాథీ’ పేరుతో ప్రారంభించనున్న ఈ పథకంలో ఉచిత వైఫై కేంద్రాల ఏర్పాటుతో పాటు గ్రామీణ యువతకు ఉద్యోగాలు కల్పించనున్నారు. రైల్వే టెలికం విభాగం ‘రైల్‌టెల్’ ఈ పథకాన్ని అమలుపర్చనుంది.
ఈ సేవలు మే నెలకల్లా ప్రారంభమవుతాయని రైల్వే వర్గాలు తెలిపాయి. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులకు, ముఖ్యంగా మహిళలకు ఈ పథకం ద్వారా వైఫై హాట్‌స్పాట్ కేంద్రాల ఏర్పాటుపై శిక్షణ ఇవ్వనున్నారు.